'కేంద్రంలో చేరతామనేది ఊహాగానమే'
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి వేదికగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో మమేకమై బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారు.. ఎంపీ కవిత. ఆమె సీఎం కేసీఆర్ కుమార్తెగా కంటే తెలంగాణ జాగృతి కవితగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ చేరుతుందన్న ప్రచారంతో పాటు సీఎంపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా విపక్షాల విమర్శలు, బీజేపీతో సఖ్యత తదితర అంశాలపై ఆమె మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
టీఆర్‌ఎస్ కేంద్రంలో చేరుతుందన్న ప్రచారంపై మీ స్పందన?
కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ చేరుతుంద న్నవి రాజకీయ ఊహాగానాలే. పార్టీకి, తెలంగాణకు ఏది మంచిదో నిర్ణయించే తెలివి, కార్యదక్షత పార్టీలో కేసీఆర్‌కు త ప్పితే మరెవరికీ లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. పదవులు, హోదాల మీద మా కుటుంబంలో ఎవరికీ ఆశలేదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం. ఏ నిర్ణయమైనా పార్టీ, తెలంగాణ ప్రజల కోసమే ఉంటుంది.
బీజేపీని కేసీఆర్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారన్న విమర్శల మాటేమిటి?
తెలిసీ తెలియక ఏదో మాట్లాడుతుంటారు. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం
కేంద్రం విషయంలో టీఆర్‌ఎస్ వైఖరి మారినట్లుంది?
కేంద్ర ప్రభుత్వ విషయంలో మా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. బీజేపీ మొదట తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తాం. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దారిలో పెట్టడానికి ప్రయత్నాలు చేశాం. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి తెలుగుదేశానికి, ఎన్టీఆర్‌కు అనుకూలంగా మాట్లాడినప్పుడు విమర్శించాం. తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు సరే అన్నాం. కేంద్రంలో ఎవరున్నా.. ఏ ప్రభుత్వమున్నా.. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాలు కాపాడేందుకు సఖ్యతతో ఉం టాం. తెలంగాణకు వ్యతిరేకమైతే కచ్చితంగా వ్యతిరేకిస్తాం.
కేసీఆర్ ఆమరణ దీక్ష, ఉద్యమ సమయంలో ఎలా ఫీల్ అయ్యేవారు? రాష్ట్రం వచ్చాక ఎలా ఫీలవుతున్నారు?
రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటివరకూ పడిన కష్టమంతా చేయితో తీసేసినట్లు అనిపిస్తోంది. కానీ ఉద్యమ సమయంలో అనుభవించిన బాధాకర సంఘటనలు.. ఒకవైపు నాన్న ఉద్యమం.. మరోవైపు చనిపోతున్న పిల్లలు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు.. అదంతా మామూలు కష్టం కాదు. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దని కోరుకుంటాను.
సీఎం కుటుంబ సభ్యులపైనా విమర్శలు వస్తున్నాయి కదా?
ఈ పదిహేనేళ్లుగా విమర్శలను ఎదుర్కోవడం అలవాటైంది. చివరకు కుటుంబ సభ్యులనూ టార్గెట్ చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కొందరు మహానుభావులు ‘పిల్లలను చంపుతాం’ అని కూడా బెదిరించారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. మేమంతా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాం. విమర్శలు వస్తాయి. కానీ, మేమేంటో ప్రజలకు తెలుసు. మా అంకిత భావం, చిత్తశుద్ధి, పట్టుదల వారికి తెలుసు.
చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని..
నాన్న పుట్టినరోజును పెద్దగా చేసుకోరు. పెద్దగా స్పెషల్ ఏమీ లేదు. ఆయనకు గుర్తుండదు కూడా. నాన్న పుట్టినరోజు అని నేనే చిన్నప్పుడు చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని. ఇప్పుడు ఆయన అభిమానులుగా మాకు స్పెషల్. ఈ రోజు ఆయన యథావిధిగా తన విధుల్లో ఉన్నారు. మహారాష్ట్ర సీఎంతో చర్చల్లో పాల్గొన్నారు.
కేసీఆరే స్టార్ బ్యాట్స్‌మన్..
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విపక్షాల విమర్శలు సహజం. కేసీఆర్ స్టార్ బ్యాట్స్‌మన్. వాళ్లంతా చిన్న చిన్న బౌలర్లు. వారివల్ల ఆయనకు పెద్దగా ఫరక్ (సమస్య) పడేది ఏమీలేదు. కాకుంటే కువిమర్శలు కాకుండా, సద్విమర్శలు చేస్తే ఆహ్వానిస్తాం. ఉద్యమ సమయంలో తీవ్రంగా విమర్శించిన వారినీ కలుపుకొనిపోయాం. మన విధానాల మీద విమర్శలు చేస్తే ఓకే కానీ... వ్యక్తిగతంగా ‘వాస్తును నమ్ముతావ్, జాతకాలు నమ్ముతావ్’ అంటూ విమర్శిస్తే ప్రజలు హర్షించరు. ప్రతిపక్షాలకు నేను ఒకటే చెబుతున్నా.. మీరు కేసీఆర్ వేగాన్ని అందుకోలేరు. వాస్తవాలను విస్మరించి విమర్శిస్తే నవ్వుల పాలవుతారు. ప్రజలకు పనికొచ్చే, రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే సూచనలు చేయండి.. తీసుకుంటాం.