అవయవదానంతో మరొకరికి ప్రాణం!  | Organ donation MPs Kavita And Santosh Kumar who signed | Sakshi
Sakshi News home page

అవయవదానంతో మరొకరికి ప్రాణం! 

Published Mon, Feb 18 2019 3:23 AM | Last Updated on Mon, Feb 18 2019 3:23 AM

Organ donation MPs Kavita And Santosh Kumar who signed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున తెలంగాణ జాగృతి మరో బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలో 50 వేల మందితో అవయవదాన ప్రతిజ్ఞలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో జరిగిన అవయవదాన ప్రతిజ్ఞ సదస్సులో ప్రకటించింది. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తొలి సంతకాలు చేసి తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీతో నిరుపేదలకు ఉచిత వైద్యం అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే అవయవదానాన్ని కూడా అందులో చేర్చిందని చెప్పారు. అవయవదానంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. సమాజం, తోటి మనుషుల ప్రాణాలపై తెలంగాణ వాసులకుండే గౌరవం, కరుణలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏడాదిలో 50 వేల అవయవదాన ప్రతిజ్ఞల కోసం తెలంగాణ జాగృతి నడుం బిగించిందని తెలిపారు. 

విస్తృత ప్రచారం అవసరం.. 
అవయవదానం గురించి ఎవరికీ అవగాహన లేని సమయంలోనే నగరంలో గ్లోబల్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో మొట్టమొదటి అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్స చేసి నూతన ఒరవడిని సృష్టించారని కవిత చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అవయవ దానంలో మొదటి స్థానంలో ఉండటం గర్వంగా ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా ఎలా బతకవచ్చన్న అంశాన్ని సాధారణ జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జాగృతి బృందాలకు కవిత సూచించింది.

పేదవారిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సను ప్రోత్సహించేందుకు నిమ్స్‌ వంటి ఆరోగ్య సంస్థల్లో అవయవదానం, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందని వివరించారు. అంతేగాకుండా అవయవ మార్పిడి తర్వాత తలెత్తే సమస్యలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకు నిమ్స్‌లో చేసిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని, అందుకోసం కృషి చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.  

జీవన్‌దాన్‌తో ఒప్పందం.. 
అవయవదానంపై ప్రభుత్వ నిమ్స్‌ సంస్థ ఏర్పాటు చేసిన జీవన్‌దాన్‌ (అవయవదాన కేంద్రం)కు తెలంగాణ జాగృతికి మధ్య కుది రిన ఒప్పంద పత్రాలపై ఎంపీ కవిత, జీవన్‌దాన్‌ చైర్మన్‌ రమేశ్‌రెడ్డిలు సంతకం చేశారు. కార్యక్రమంలో 800 మందికిపైగా అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠా గోపాల్, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, సీనియర్‌ జర్నలిస్టు కట్టా శేఖర్‌రెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద, యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞను చేశారు. అంతకుముందు పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల మృ తికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. సమావేశం ముగింపులో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ నిర్వహించిన బ్యాండ్‌ ఆకట్టుకుంది.

ఇది శుభ పరిణామం.. 
అవయవాల పనితీరు తగ్గిపోయిన పరిస్థితుల్లో అవయవ మార్పిడియే చివరి అవకాశం. జీవన్‌దాన్‌ ద్వారా 2012 నుంచి ప్రారంభమైన అవయదానాలు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నాయి.  2015లో బ్రెయిన్‌డెడ్‌ ద్వారా 104 డొనేషన్లు రాగా 2017లో ఈ సంఖ్య 150కి పెరిగింది. 2018లో 164 వరకు పెరిగి అత్యధిక స్థానంలో ఉన్న తమిళనాడు కంటే ముందుకు వెళ్ళాం. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన సదస్సులు విస్తృతంగా చేపట్టడం శుభపరిణామం.  
     
డాక్టర్‌ మనోహర్, నిమ్స్‌ డైరెక్టర్‌ 

ప్రభుత్వ సాయం అందితే మరింత సక్సెస్‌ 
1989లోనే అవయవదానం చేస్తానని సంతకం చేశాను. అవయవదానం ద్వారా 8 మందికి ప్రాణం పొసిన వాళ్ళమవుతాం. ఇప్పుడున్న నూతన సాంకేతికతతో బోన్, కార్టిలేజ్, స్కిన్‌ అన్నీ ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్‌ కార్యక్రమం ప్రారంభించాక అవయవదానంపై అవగాహన పెరిగింది. అవయవదానం చేసిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందేలా చేస్తే కార్యక్రమం మరింత విజయవంతమవుతుంది.

డాక్టర్‌ కె.రవీంద్రనాథ్, చైర్మన్, గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ 

అవగాహన పెంచాల్సిన అవసరముంది.. 
దేశంలో అవయవదానంపై అవగాహన చాలా తక్కువ. స్పెయిన్‌లో 20 లక్షల మందికి 70 మంది అవయవదానం చేస్తే, అమెరికాలో ఆ సంఖ్య 40గా ఉంటే మనదేశంలో 20 లక్షల మందికి ఒక్కరు మాత్రమే అవయవదానం చేస్తున్నారు. అవయవదానంపై 80 శాతం మందిలో అవగాహన లేదు. మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

        
డాక్టర్‌ గురువారెడ్డి, సన్‌ షైన్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement