పంచాయతీ పాలన అస్తవ్యస్తం..! | Grama Panchayat Sarpanch Work Is Not Good Karimnagar | Sakshi
Sakshi News home page

పంచాయతీ పాలన అస్తవ్యస్తం..!

Published Mon, Oct 15 2018 8:46 AM | Last Updated on Mon, Oct 15 2018 8:46 AM

Grama Panchayat Sarpanch Work Is Not Good Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: గ్రామ పంచాయతీల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆగస్టు 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియండంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో పోలుపోలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో కార్యదర్శికి ఐదారు గ్రామ పంచాయతీలు అప్పగించడంతో ఏ పని చేయాలో తోచని పరిస్థితి వారిది. ఇటీవల నియమించిన ప్రత్యేక అధికారుల నియమాకం కూడా ముందునుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. నిధులున్నా.. వాడుకోలేని దుస్థితి. గ్రామాల్లోని పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాట్లు, మంచినీటి సమస్య, క్లోరినేషన్‌ వంటి పనులకు నిధులున్నా ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక అధికారులు గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోక పోవడంతో పంచాయతీ పాలన గాడి తప్పుతోంది.

గ్రామ కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు గ్రామాల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా కార్యదర్శి బాధ్యత కీలకం. ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలోని గ్రామాల్లో అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాల్సింది గ్రామ కార్యదర్శులే. గ్రామ పంచాయతీలు అభివృద్ధికి పట్టుకొమ్మలు అనే నానుడిని అధికార యంత్రాంగం విస్మరిస్తుండడంతో గ్రామపంచాయతీ పాలన గాడి తప్పుతోంది. జిల్లాలో పాతవి 276 గ్రామ పంచాయతీలు, కొత్తవి 54  గ్రామపంచాయతీలున్నాయి. మొత్తం 330 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 109 మంది కార్యదర్శులు పనిచేస్తుండగా.. 167 ఖాళీలున్నాయి. ఇదో లెక్క.. దీనికి మరో లెక్క కూడా ఉంది.

ఇప్పటికే క్లస్టర్‌ గ్రామాల పేర ప్రభుత్వం కొన్నింటిని ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 136 క్లస్టర్‌గ్రామాలకు 27 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి రెండుమూడు, ఒక్కొక్క చోట నాలుగేసి పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌ గ్రామంగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఎందుకు జరిగిందో అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. నేరుగా ప్రజలతో సంబంధం ఉండి ఆ గ్రామానికి సేవ చేసేందుకు పంచాయతీలు ఉపయోగపడుతుంటాయి. ఇలాంటి సమయంలో క్లస్టర్ల ఏర్పాటు ఎందుకు జరిగిందో.. ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో బయటపెట్టడం లేదు. ఈ క్రమంలో పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్థిక కోణంలో పరిశీలిస్తే కార్యదర్శుల సంఖ్య తగ్గించేందుకే ఆ పని చేసినట్టు తెలు స్తోంది.

ఒక్కో పంచాయతీకి ఒక కార్యదర్శిని ఇవ్వడానికి బదులు రెండుమూడు పంచాయతీలను కలిపి క్లస్టర్‌ గ్రామంగా ఎంపిక చేయడం వెనుక ఒకే కార్యదర్శితో వెల్లదీసే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవస్థ మరింత అధ్వానంగా ఉంది. క్లస్టర్ల పరంగా చూస్తే ఖాళీలు 27గానే కనబడుతున్నాయి. పంచాయతీల పరంగా 167 ఖాళీలున్నా యి. పనిచేస్తున్నవారు 109 మందే కావడంతో సగానికి పైగా ఖాళీలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి అరడజన్‌ పంచాయతీలకు సైతం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న తీరు కొనసాగుతోంది.  పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా 90 శాతం పన్నులు వసూలు చేశాయి. పంచాయతీలకు రావాల్సిన 14 ఆర్థిక సంఘం నిధులు రెండు దశల్లో రూ.25 కోట్లు వచ్చాయి.

అంగన్‌వాడీ భవనాల నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీలకే అప్పగించారు. ఇప్పటికే వీధిదీపాలు, పారిశుధ్య పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి దశలో ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి చొప్పున కేటాయిస్తే అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త పంచాయతీ డివిజన్లు ఏర్పాటు చేయకపోగా.. డివిజన్‌ పంచాయతీ అధికారి పోస్టులను ఎత్తేశారు. వారిని కొత్త జిల్లాలకు పంపారు. అన్ని బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారి మాత్రమే చూస్తున్నారు. దీంతో పనుల ఒత్తిడితో పంచాయతీ పాలన క్షేత్రస్థాయిలో ప్రజలదరికి చేరకపోవడంతో అనుకున్న మేరకు అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇకనైనా పంచాయతీ కార్యదర్శుల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసి గ్రామపంచాయతీలను పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

పట్టించుకోని ప్రత్యేకాధికారులు
పంచాయతీల పాలన వ్యవహారాలను చూడటానికి నియమించిన ప్రత్యేక అధికారులు  రెవెన్యూ, వ్యవసాయ, ఇంజినీరింగ్, విద్య తదితర శాఖల అధికారులకు అప్పగించడంతో వారు రోజువారీ కార్యాలయాల పనులు పూర్తి చేయడంతోపాటు పల్లెల్లో పాలన వ్యవహారాలు చూడాల్సివస్తోంది. ఆయా శాఖల అధికారులు రైతుబీమా, రైతుబంధు, ఓటరు నమోదు, సర్వేలు, వంటి అనేక కార్యక్రమాల్లో తలమునకలై ఉండడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి.

బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై  అయోమయం
ఈనెల 17, 18 తేదీల్లో జరిగే బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై గ్రామపంచాయతీల్లో నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడం, కార్యదర్శుల కొరత, ప్రత్యేక అధికారుల లేమి దీనికితోడు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఉన్న అధికారులంతా బిజీగా ఉండడంతో గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలు, బతుకమ్మ, దసరా ఏర్పాట్ల నిర్వహణపై ఎవరికి చెప్పుకోవాలో..? ఏం చేయాలో..? తోచని పరిస్థితి గ్రామప్రజల్లో నెలకొంది. కొన్ని గ్రామాల్లో తాజా మాజీ సర్పంచ్‌లు, ఔత్సాహిక యువకులు, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే వారు అక్కడక్కడ పండుగల ఏర్పాట్లపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప మెజార్టీ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి.

కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో బతుకమ్మల నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్న ట్యాంక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement