gramapanchayti
-
పవర్ లేని పంచాయతీలు
వెల్దుర్తి(తూప్రాన్): గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో పలు మార్పులు, చేర్పులు చేసినా అది కంటితుడుపు చర్యగానే మిగిలిపోయేట్లు కనిపిస్తోంది. చట్ట సవరణలు సరే పంచాయతీలకు వివిధ శాఖలపై పట్టు ఏది ?.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పంచాయతీ పాలకవర్గాలు చేసే తీర్మానాలను ఏ ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడంలేదు. పాలకవర్గ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వ శాఖపై అజమాయీషీకి పంచాయతీ లకు విశేషమైన అధికారులు లేకపోవడం. పంచాయతీ సమావేశాలకుఅన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా హాజరుకావాలి. కానీ ఏ అధికారి హాజరుకావడం లేదు. తప్పదు అనుకున్నప్పుడు కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. నిజానికి పంచాయతీ పరిధిలో 29 ప్రభుత్వ శాఖలు ఉండాలి. ఈ శాఖలపై పంచాయతీ పాలకవర్గం అజమాయిషీ కలిగి ఉండాలి. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం 29 రకాల ప్రభుత్వ శాఖలను పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించాల్సి ఉంది. ఈ శాఖలు గ్రామస్థాయిలో పంచాయతీలు, మండల స్థాయిలో మండల పరిషత్‌లు, జిల్లాస్థాయిలో జిల్లా ప్రజాపరిషత్‌ల అజమాయిషీలో పని చేయా ల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ప్రభుత్వ శాఖలను ఇప్పటివరకు బదలాయించలేదు. రాజ్యాంగంలోని సంబంధిత ఆదేశికం కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వశా ఖలు పంచాయతీలను పట్టించుకోవడంలేదు. పా లకవర్గ తీర్మానాలను బుట్టదాఖలు చేస్తున్నాయి. బదలాయించాల్సిన ప్రభుత్వ శాఖలు.. వ్యవసాయశాఖ: పంచాయతీ పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు, విస్తరణ, పంటలసాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, సబ్సిడీ, సస్యరక్షణ చర్యలు తదితర కార్యకలాపాలను పాలకవర్గం పర్యవేక్షణలో అమలు చేయాలి. రెవిన్యూశాఖ: పంచాయతీ పరిధిలో భూ సంస్కరణల అమలు, భూసార రక్షణ, భూమి అభివృద్ధి, భూముల ఏకీకరణ, భూరికార్డుల నవీకరణ, భూ తగాదాల పరిష్కారం, సంక్షేమ పథకాల కింద వ్యవసాయ భూముల కేటాయింపు తదితర కార్యక్రమాలను గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో అమలు చేయాలి. నీటిపారుదలశాఖ: పంచాయతీ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్ట్‌ల అమలు, నీటి నిర్వహణ, చెరువులు, కుంటల అభివృద్ది, పంట కాలువల నిర్మాణం, చివరి భూముల వరకు నీరందించేందుకు పైప్లైన్ల నిర్మాణం,చెక్‌డ్యాంల ఏర్పాటు తదితర పనులను పంచాయతీ కనుసన్నల్లో అధికారులు నిర్వర్తించడం.పశుసంవర్థక శాఖ: గ్రామాల్లో పశు సంవర్థకం, పాడి పరిశ్రమ అభివృద్ధి, కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం, ప్రభుత్వపరంగా అమలయ్యే పథకాలపై ప్రచారం, అవగాహన, లబ్ధిదారుల ఎంపిక తది తర అంశాలను పాలకవర్గంతో కలిసి అమలు చేయడం. మత్స్యశాఖ: గ్రామ పరిధిలోని చెరువుల్లో చేపలపెంపకం, చేప విత్తనాల పంపిణీ, చేపల మార్కెటింగ్, చేపల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, చేపల పెంపకందారులకు రాయితీపై వలలు, సైకిళ్ల అం దజేత వంటివి పంచాయతీ పాలకవర్గంతో చర్చిం చి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవడం. సోషల్ ఫారెస్ట్: గ్రామాల్లో సామాజిక అడవుల పెంపకం, చేలల్లో చెట్ల పెంపకం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, మొక్కల పంపిణీ, చెట్ల నరికివేత నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించడం వంటివి పంచాయతీ సర్పంచ్‌లు, వారి సభ్యులతో కలిసి వారి సూచనలు మేరకు చేయడం. పరిశ్రమల శాఖ: పంచాయతీ పాలకవర్గంతో కలిసి గ్రామంలో పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను అన్వేషించడం, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించడం. ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలు: గ్రామాల్లో కుటీర పరిశ్రమల స్థాపనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఖాదీ, చేనేతపై ఎక్కువమంది ఆధారపడి జీవిస్తుంటారు. పట్టు పురుగుల పెంపకాన్ని కూడా చేపడతారు. పంచాయతీ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాలు, ప్రతిపాదనలకు అనుగుణంగా ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలశాఖ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజారోగ్యశాఖ: గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. రక్షిత మంచినీటికోసం అల్లాడుతుంటారు. ప్రజారోగ్యశాఖ గ్రామ జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం విజ్ఞప్తుల మేరకు పనులను చేపట్టాల్సి ఉంటుంది. రోడ్లు భవనాలు: గ్రామాల అభివృద్ధిలో రోడ్లు భవనాల శాఖ పాత్ర కీలకం. గ్రామంలో రోడ్డు, కల్వర్టులు, వంతెనలు, కాల్వలు నిర్మాణాల్లో పంచాయతీ పాలకవర్గంతో కలిసి ఈ శాఖ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. డీఆర్డీఏ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాల్లో దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల అమలుకు పెద్దపీట వేయాల్సి ఉంటుంది. గ్రామంలో ప్రజల జీవన విధానం, స్థితిగతుల గురించి పంచాయతీ పాలకవర్గానికి తెలిసినంత అధికారులకు తెలియదు. ఏ పథకం అమలు చేయాలన్నా ముందుగా వారి సూచనలు, సలహాలను, ప్రతిపాదనలను తీసుకోవాలి. విద్యుత్‌శాఖ: గ్రామీణ విద్యుద్దీకరణలో విద్యుత్ శాఖ పాత్ర కీలకం. గ్రామంలో విద్యుత్ పనుల అమలు విషయంలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు పంచాయతీ ప్రతిపాదనలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అలాంటిదేది ప్రస్తుతం ఎక్కడా జరగడంలేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇతర శాఖలు: ప్రజాపంపిణీ వ్యవస్థ, బలహీనవర్గాల సంక్షేమం, సాంఘీక సంక్షేమం, మహిళలు, శిశు సంరక్షణ, వైద్యం, మార్కెట్ల ఏర్పాటు, గ్రంథాలయాల నిర్వహణ, వయోజన విద్య, అనియత విద్య, సాంకేతిక శిక్షణ, వృత్తిపరమైన విద్య, సంప్రదాయేతర ఇంధన వనరులు, సామాజిక ఆస్తుల నిర్వహణ తదితర వాటి విషయంలో సంబంధిత శాఖలు పంచాయతీలతో నిమిత్తం లేకుండానే తమ సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నారు. జిల్లాస్థాయిలో ప్రతిపాదనలను రూపొం దించి అమలు చేస్తున్నాయి. గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకోవడంలేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు గ్రామీణులకు అందడం లేదు. కనీసం ఇప్పుడైనా.. పంచాయతీ పాలకవర్గాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కొలువుదీరాయి. కనీసం ఇప్పుడైనా పంచాయతీలకు 29 ప్రభుత్వశాఖల బదలా యింపు జరిగేనా? ప్రభుత్వ శాఖలపై పంచాయతీలు అజమాయిషీ చేసే అధికారం దక్కేనా? అన్నది వేచి చూడాల్సిందే. -
పంచాయతీ పాలన అస్తవ్యస్తం..!
సాక్షి, కరీంనగర్: గ్రామ పంచాయతీల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆగస్టు 2తో సర్పంచ్ల పదవీకాలం ముగియండంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో పోలుపోలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో కార్యదర్శికి ఐదారు గ్రామ పంచాయతీలు అప్పగించడంతో ఏ పని చేయాలో తోచని పరిస్థితి వారిది. ఇటీవల నియమించిన ప్రత్యేక అధికారుల నియమాకం కూడా ముందునుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. నిధులున్నా.. వాడుకోలేని దుస్థితి. గ్రామాల్లోని పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాట్లు, మంచినీటి సమస్య, క్లోరినేషన్ వంటి పనులకు నిధులున్నా ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక అధికారులు గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోక పోవడంతో పంచాయతీ పాలన గాడి తప్పుతోంది. గ్రామ కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు గ్రామాల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా కార్యదర్శి బాధ్యత కీలకం. ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలోని గ్రామాల్లో అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాల్సింది గ్రామ కార్యదర్శులే. గ్రామ పంచాయతీలు అభివృద్ధికి పట్టుకొమ్మలు అనే నానుడిని అధికార యంత్రాంగం విస్మరిస్తుండడంతో గ్రామపంచాయతీ పాలన గాడి తప్పుతోంది. జిల్లాలో పాతవి 276 గ్రామ పంచాయతీలు, కొత్తవి 54 గ్రామపంచాయతీలున్నాయి. మొత్తం 330 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 109 మంది కార్యదర్శులు పనిచేస్తుండగా.. 167 ఖాళీలున్నాయి. ఇదో లెక్క.. దీనికి మరో లెక్క కూడా ఉంది. ఇప్పటికే క్లస్టర్ గ్రామాల పేర ప్రభుత్వం కొన్నింటిని ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 136 క్లస్టర్‌గ్రామాలకు 27 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి రెండుమూడు, ఒక్కొక్క చోట నాలుగేసి పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్ గ్రామంగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఎందుకు జరిగిందో అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. నేరుగా ప్రజలతో సంబంధం ఉండి ఆ గ్రామానికి సేవ చేసేందుకు పంచాయతీలు ఉపయోగపడుతుంటాయి. ఇలాంటి సమయంలో క్లస్టర్ల ఏర్పాటు ఎందుకు జరిగిందో.. ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో బయటపెట్టడం లేదు. ఈ క్రమంలో పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్థిక కోణంలో పరిశీలిస్తే కార్యదర్శుల సంఖ్య తగ్గించేందుకే ఆ పని చేసినట్టు తెలు స్తోంది. ఒక్కో పంచాయతీకి ఒక కార్యదర్శిని ఇవ్వడానికి బదులు రెండుమూడు పంచాయతీలను కలిపి క్లస్టర్ గ్రామంగా ఎంపిక చేయడం వెనుక ఒకే కార్యదర్శితో వెల్లదీసే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవస్థ మరింత అధ్వానంగా ఉంది. క్లస్టర్ల పరంగా చూస్తే ఖాళీలు 27గానే కనబడుతున్నాయి. పంచాయతీల పరంగా 167 ఖాళీలున్నా యి. పనిచేస్తున్నవారు 109 మందే కావడంతో సగానికి పైగా ఖాళీలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి అరడజన్ పంచాయతీలకు సైతం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న తీరు కొనసాగుతోంది. పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా 90 శాతం పన్నులు వసూలు చేశాయి. పంచాయతీలకు రావాల్సిన 14 ఆర్థిక సంఘం నిధులు రెండు దశల్లో రూ.25 కోట్లు వచ్చాయి. అంగన్వాడీ భవనాల నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీలకే అప్పగించారు. ఇప్పటికే వీధిదీపాలు, పారిశుధ్య పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి దశలో ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి చొప్పున కేటాయిస్తే అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త పంచాయతీ డివిజన్లు ఏర్పాటు చేయకపోగా.. డివిజన్ పంచాయతీ అధికారి పోస్టులను ఎత్తేశారు. వారిని కొత్త జిల్లాలకు పంపారు. అన్ని బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారి మాత్రమే చూస్తున్నారు. దీంతో పనుల ఒత్తిడితో పంచాయతీ పాలన క్షేత్రస్థాయిలో ప్రజలదరికి చేరకపోవడంతో అనుకున్న మేరకు అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇకనైనా పంచాయతీ కార్యదర్శుల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసి గ్రామపంచాయతీలను పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పట్టించుకోని ప్రత్యేకాధికారులు పంచాయతీల పాలన వ్యవహారాలను చూడటానికి నియమించిన ప్రత్యేక అధికారులు రెవెన్యూ, వ్యవసాయ, ఇంజినీరింగ్, విద్య తదితర శాఖల అధికారులకు అప్పగించడంతో వారు రోజువారీ కార్యాలయాల పనులు పూర్తి చేయడంతోపాటు పల్లెల్లో పాలన వ్యవహారాలు చూడాల్సివస్తోంది. ఆయా శాఖల అధికారులు రైతుబీమా, రైతుబంధు, ఓటరు నమోదు, సర్వేలు, వంటి అనేక కార్యక్రమాల్లో తలమునకలై ఉండడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి. బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై అయోమయం ఈనెల 17, 18 తేదీల్లో జరిగే బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై గ్రామపంచాయతీల్లో నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్ల పదవీకాలం ముగియడం, కార్యదర్శుల కొరత, ప్రత్యేక అధికారుల లేమి దీనికితోడు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉన్న అధికారులంతా బిజీగా ఉండడంతో గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలు, బతుకమ్మ, దసరా ఏర్పాట్ల నిర్వహణపై ఎవరికి చెప్పుకోవాలో..? ఏం చేయాలో..? తోచని పరిస్థితి గ్రామప్రజల్లో నెలకొంది. కొన్ని గ్రామాల్లో తాజా మాజీ సర్పంచ్‌లు, ఔత్సాహిక యువకులు, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే వారు అక్కడక్కడ పండుగల ఏర్పాట్లపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప మెజార్టీ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో బతుకమ్మల నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్న ట్యాంక్ -
ఆగని కన్నీళ్లు..!
చితి మంటలు ఆరలేదు.. కన్నీటి ధారలు ఆగలేదు.. ‘కొండగట్టు’ పల్లెల్లో కొడిగట్టిన విషాదం కొండంత శోకాన్ని మూటకట్టింది. ప్రమాదం జరిగి మూడురోజులు గడిచినా.. ఆ పల్లెల్లో విషాదం వీడలేదు. ఎవరినీ కదిలించినా కన్నీళ్లే. పచ్చని పొలాలు.. పాడి పంట.. కులవృత్తులు.. ఏ ఇంటి పెరడి చూసినా నిండాకాసిన కూరగాయలు. పాలు అమ్ముకుని కొందరు, పనికిపోయి ఇంకొందరు ఇలా.. ఏ గడప చూసినా.. పట్టెడన్నం తిని చల్లగా బతికిన ఊర్లవి. ‘కొండం’త అభివృద్ధి, సింగారించుకున్న ప్రజా జీవన సౌందర్యం ఆయా గ్రామాలకే సొంతం. ఇదంతా నాలుగు రోజుల కిందటి ముచ్చట. ఇప్పుడా పల్లెలు కళతప్పాయి. ఏ ఊరు చూసినా పెనువిషాదమే.. ఏ ఇళ్లు చూసినా విషాదఛాయలే.. ఏ గుండె తట్టినా కన్నీటిధారలే.. వెక్కివెక్కి ఏడ్చిన పల్లెజనం కళ్లలో నీళ్లూ ఇంకిపోయాయి. అయినా.. ఏడుపు ఇంకా మిగిలే ఉంది. తల్లికోసం బిడ్డ.. బిడ్డ కోసం తల్లిదండ్రులు.. భర్తను గుర్తుచేసుకుని భార్య.. భార్యను మరవలేని భర్త.. పని కోసం బయటికి వెళ్లి, తిరిగిరాని తోడుకోడళ్లు. అంతులేని విషాదం ఆ ఊళ్లలో చోటు చేసుకోగా.. ఇప్పుడా గ్రామాలు గణేష్ ఉత్సవాలకు కూడా దూరంగా ఉన్నాయి. ఎక్కడా చూసినా సిద్ధమైన మండపాలు.. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో వినాయకుడి విగ్రహాలు.. ఊహించిన ఘటనతో విషాదం నిండిన ఆ పల్లెలు వినాయక ఉత్సవాలను జరుపుకోవడం లేదు. కొండగట్టు పల్లెల నుంచి ‘సాక్షి’కథనం.. సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి జగిత్యాల: చిన్నా, పెద్ద, స్త్రీ, పురుషుల వయోభేదం లేకుండా కన్నుల పండుగలా జరుపుకునే గణేష్ నవరాత్రోత్రి ఉత్సవాల కళ ఆ గ్రామాల్లో తప్పింది. శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లె, రాంసాగర్‌లో ఏర్పాటు చేసి న గణేష్ మండపాలు వెలవెలబోతున్నాయి. ఈనె ల 11న కొండగట్టు ఘాట్‌రోడ్‌పై నుంచి లోయలో పడిన ప్రమాదంలో 62మంది మరణించిన సం గతి తెలిసింది. ఈ గ్రామాలకు చెందిన 43 మంది కొండగట్టు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు, విద్యార్థులు ఉన్నారు. ఈ పల్లెల్లో ఏ వాడ, ఏ గల్లికి, ఏ ఇంటి తలుపు తట్టినా ఆ విషాదకరమైన సంఘటననే తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కేవలం మృతుల కుటుంబాల్లోనే కా దు.. గ్రామస్తులందరిలోనూ నిస్తేజం. పదేళ్ల చి న్నారి నుంచి పండు ముసలి వరకు ఎవర్ని తట్టినా గుండెచెరువే.. అందరి కళ్లలోనూ ఇదే విషాదం. నిన్నటివరకు ఆ దారి గుండా అంజన్న చెంతకు వెళ్లాలనుకున్న భక్తులు ఇప్పుడు ఆ మార్గమంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం డీజి ల్ పొదుపు.. లాభాపేక్ష ఆ ఊళ్లను వల్లకాడుగా మార్చింది. మృతులపై ఆధారపడ్డ కుటుంబాలను ఛిద్రం చేసింది. పిల్లలపై తల్లిదండ్రులు.. తల్లిదండ్రులపై ఒకరికొకరు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. గణేష్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోలేక గణేష్ ఉత్సవాలకు దూరంగా ఉంటూ.. వాళ్ల బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక విషాదవదనంతో ఉన్నారు. మండపాలు ఎక్కని గణేష్ విగ్రహాలు.. పండుగకు దూరంగా పల్లెలు హిమ్మత్‌రావుపేటలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ముందుగానే యూత్ సంఘాలు, కుల సంఘాలు గ్రామాలకు చెందినవారు మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు డబ్బులు చెల్లించి విగ్రహాలను కూడా తెచ్చుకున్నారు. కానీ ఇంతలోనే కొండగట్టు ప్రమాదం రూపేణా ఆ ఊరికి చెందిన 10 మందిని కబళించింది. మొత్తం మృతుల్లో 60 మంది ఉంటే ఈ ఒక్క గ్రామానికి చెందిన వారే 10 మంది. దీంతో ఆ విగ్రహాలను గ్రామపంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో పెట్టి ఆ తర్వాత మండపాలకు పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే ఈ ఊరిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది కూడా నిత్యం గ్రామస్తులతో ఐక్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్లే. నిన్నమొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వాళ్లు నిత్యం మాట్లాడిన వాళ్లు లేకపోవడం ఆ బాధను తట్టుకోలేక ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పండగ జరుపులేక గ్రామాలు కళ తప్పాయి. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే కన్నుల పండువగా జరుపుకునే ఈ పండుగను ఈసారి జరుపుకోలేని పరిస్థితి. అలాగే శనివారంపేట, డబ్బు తిమ్మాయిపల్లె, రాంసాగర్లలోను ఈసారి గణేష్ నవరాత్రులను నిర్వహించడం లేదు. -
గ్రామపంచాయతీలకూ ప్రోత్సాహమివ్వాలి
కరీంనగర్ సిటీ: ఐఎస్ఎల్, ఇంకుడుగుంతల్లో వంద శాతం లక్ష్యం సాధించిన గ్రామ పంచాయతీలకూ అవార్డులు ఇవ్వాలని పంచాయతీరాజ్ చాంబర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పుల అంజనీప్రసాద్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్లు కోరారు. స్వచ్చభారత్‌లో జిల్లా కలెక్టర్‌కు అవార్డు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల్లో జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు. కాని కొంతమంది ఉన్నతాధికారులు అవార్డు రావడానికి కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధుల ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం శోచనీయమన్నారు. పంచాయతీకార్యదర్శులు, ఎంపీడీఓలు పూర్తిస్థాయిలో లేకున్నా జిల్లాకు అవార్డు వచ్చిందంటే స్థానిక ప్రజాప్రతినిధుల శ్రమతోనేనన్నారు. వందశాతం ఐఎస్ఎల్, ఇంకుడుగుంతలు సాధించిన గ్రామపంచాయతీలకు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో అవార్డులివ్వాలని కోరారు. సమావేశంలో చాంబర్ కార్యదర్శి ముల్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కూలిన నగరపంచాయతీ భవనం
హుజూరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వానలకు హుజూరాబాద్ నగరపంచాయతీ పాత కార్యాలయ భవనం ముందు వరండా పూర్తిగా కూలింది. గతంలోనే ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో నూతనంగా నిర్మించిన భవనంలో పాలకవర్గం, కొంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని విభాగాలు పాతభవనంలోనే కొనసాగుతున్నాయి. ఎక్కువగా మహిళా సంఘాల సభ్యులు ఈ వరండా కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇది మంగళవారం అర్ధరాత్రి కూలడంతో పెద్ద ప్రమాదం తప్పినటై ్లంది. ఈ భవనాన్ని 1926లో నిజాం ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు సిల్వర్‌జూబ్లీ క్లబ్‌గా కొనసాగింది. 1942 నుంచి 1963 వరకు మున్సిపాలిటీ కార్యాలయంగా ఉండేది. తరువాత 1964లో మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంగా మారింది. 2011లో హుజూరాబాద్ నగరపంచాయతీగా అవతరించిన తర్వాత కొత్త భవనాన్ని నిర్మించారు. పాత భవనంలో కొనసాగుతున్న విభాగాలను నూతన భవనంలోకి మార్చేందుకు చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ వెంటనే చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో సిబ్బందికి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.