
వెల్దుర్తి(తూప్రాన్): గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో పలు మార్పులు, చేర్పులు చేసినా అది కంటితుడుపు చర్యగానే మిగిలిపోయేట్లు కనిపిస్తోంది. చట్ట సవరణలు సరే పంచాయతీలకు వివిధ శాఖలపై పట్టు ఏది ?.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పంచాయతీ పాలకవర్గాలు చేసే తీర్మానాలను ఏ ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడంలేదు. పాలకవర్గ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వ శాఖపై అజమాయీషీకి పంచాయతీ లకు విశేషమైన అధికారులు లేకపోవడం. పంచాయతీ సమావేశాలకుఅన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా హాజరుకావాలి.
కానీ ఏ అధికారి హాజరుకావడం లేదు. తప్పదు అనుకున్నప్పుడు కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. నిజానికి పంచాయతీ పరిధిలో 29 ప్రభుత్వ శాఖలు ఉండాలి. ఈ శాఖలపై పంచాయతీ పాలకవర్గం అజమాయిషీ కలిగి ఉండాలి. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం 29 రకాల ప్రభుత్వ శాఖలను పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించాల్సి ఉంది. ఈ శాఖలు గ్రామస్థాయిలో పంచాయతీలు, మండల స్థాయిలో మండల పరిషత్‌లు, జిల్లాస్థాయిలో జిల్లా ప్రజాపరిషత్‌ల అజమాయిషీలో పని చేయా ల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ప్రభుత్వ శాఖలను ఇప్పటివరకు బదలాయించలేదు. రాజ్యాంగంలోని సంబంధిత ఆదేశికం కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వశా ఖలు పంచాయతీలను పట్టించుకోవడంలేదు. పా లకవర్గ తీర్మానాలను బుట్టదాఖలు చేస్తున్నాయి.
బదలాయించాల్సిన ప్రభుత్వ శాఖలు..
వ్యవసాయశాఖ: పంచాయతీ పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు, విస్తరణ, పంటలసాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, సబ్సిడీ, సస్యరక్షణ చర్యలు తదితర కార్యకలాపాలను పాలకవర్గం పర్యవేక్షణలో అమలు చేయాలి. రెవిన్యూశాఖ: పంచాయతీ పరిధిలో భూ సంస్కరణల అమలు, భూసార రక్షణ, భూమి అభివృద్ధి, భూముల ఏకీకరణ, భూరికార్డుల నవీకరణ, భూ తగాదాల పరిష్కారం, సంక్షేమ పథకాల కింద వ్యవసాయ భూముల కేటాయింపు తదితర కార్యక్రమాలను గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో అమలు చేయాలి. నీటిపారుదలశాఖ: పంచాయతీ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్ట్‌ల అమలు, నీటి నిర్వహణ, చెరువులు, కుంటల అభివృద్ది, పంట కాలువల నిర్మాణం, చివరి భూముల వరకు నీరందించేందుకు పైప్‌లైన్‌ల నిర్మాణం,చెక్‌డ్యాంల ఏర్పాటు తదితర పనులను పంచాయతీ కనుసన్నల్లో అధికారులు నిర్వర్తించడం.పశుసంవర్థక శాఖ: గ్రామాల్లో పశు సంవర్థకం, పాడి పరిశ్రమ అభివృద్ధి, కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం, ప్రభుత్వపరంగా అమలయ్యే పథకాలపై ప్రచారం, అవగాహన, లబ్ధిదారుల ఎంపిక తది తర అంశాలను పాలకవర్గంతో కలిసి అమలు చేయడం.
మత్స్యశాఖ: గ్రామ పరిధిలోని చెరువుల్లో చేపలపెంపకం, చేప విత్తనాల పంపిణీ, చేపల మార్కెటింగ్, చేపల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, చేపల పెంపకందారులకు రాయితీపై వలలు, సైకిళ్ల అం దజేత వంటివి పంచాయతీ పాలకవర్గంతో చర్చిం చి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవడం.
సోషల్ ఫారెస్ట్: గ్రామాల్లో సామాజిక అడవుల పెంపకం, చేలల్లో చెట్ల పెంపకం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, మొక్కల పంపిణీ, చెట్ల నరికివేత నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించడం వంటివి పంచాయతీ సర్పంచ్‌లు, వారి సభ్యులతో కలిసి వారి సూచనలు మేరకు చేయడం. పరిశ్రమల శాఖ: పంచాయతీ పాలకవర్గంతో కలిసి గ్రామంలో పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను అన్వేషించడం, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించడం.
ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలు: గ్రామాల్లో కుటీర పరిశ్రమల స్థాపనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఖాదీ, చేనేతపై ఎక్కువమంది ఆధారపడి జీవిస్తుంటారు. పట్టు పురుగుల పెంపకాన్ని కూడా చేపడతారు. పంచాయతీ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాలు, ప్రతిపాదనలకు అనుగుణంగా ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలశాఖ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రజారోగ్యశాఖ: గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. రక్షిత మంచినీటికోసం అల్లాడుతుంటారు. ప్రజారోగ్యశాఖ గ్రామ జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం విజ్ఞప్తుల మేరకు పనులను చేపట్టాల్సి ఉంటుంది. రోడ్లు భవనాలు: గ్రామాల అభివృద్ధిలో రోడ్లు భవనాల శాఖ పాత్ర కీలకం. గ్రామంలో రోడ్డు, కల్వర్టులు, వంతెనలు, కాల్వలు నిర్మాణాల్లో పంచాయతీ పాలకవర్గంతో కలిసి ఈ శాఖ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది.
డీఆర్‌డీఏ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాల్లో దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల అమలుకు పెద్దపీట వేయాల్సి ఉంటుంది. గ్రామంలో ప్రజల జీవన విధానం, స్థితిగతుల గురించి పంచాయతీ పాలకవర్గానికి తెలిసినంత అధికారులకు తెలియదు. ఏ పథకం అమలు చేయాలన్నా ముందుగా వారి సూచనలు, సలహాలను, ప్రతిపాదనలను తీసుకోవాలి.
విద్యుత్‌శాఖ: గ్రామీణ విద్యుద్దీకరణలో విద్యుత్ శాఖ పాత్ర కీలకం. గ్రామంలో విద్యుత్ పనుల అమలు విషయంలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు పంచాయతీ ప్రతిపాదనలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అలాంటిదేది ప్రస్తుతం ఎక్కడా జరగడంలేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇతర శాఖలు: ప్రజాపంపిణీ వ్యవస్థ, బలహీనవర్గాల సంక్షేమం, సాంఘీక సంక్షేమం, మహిళలు, శిశు సంరక్షణ, వైద్యం, మార్కెట్‌ల ఏర్పాటు, గ్రంథాలయాల నిర్వహణ, వయోజన విద్య, అనియత విద్య, సాంకేతిక శిక్షణ, వృత్తిపరమైన విద్య, సంప్రదాయేతర ఇంధన వనరులు, సామాజిక ఆస్తుల నిర్వహణ తదితర వాటి విషయంలో సంబంధిత శాఖలు పంచాయతీలతో నిమిత్తం లేకుండానే తమ సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నారు. జిల్లాస్థాయిలో ప్రతిపాదనలను రూపొం దించి అమలు చేస్తున్నాయి. గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకోవడంలేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు గ్రామీణులకు అందడం లేదు.
కనీసం ఇప్పుడైనా..
పంచాయతీ పాలకవర్గాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కొలువుదీరాయి. కనీసం ఇప్పుడైనా పంచాయతీలకు 29 ప్రభుత్వశాఖల బదలా యింపు జరిగేనా? ప్రభుత్వ శాఖలపై పంచాయతీలు అజమాయిషీ చేసే అధికారం దక్కేనా? అన్నది వేచి చూడాల్సిందే.