ఆడపడుచుల గుండెచప్పుడు బతుకమ్మ
నల్లగొండ కల్చరల్ : బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచుల గుండెచప్పుడని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. గురువారం స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలను ప్రారంభించి మాట్లాడారు. పెద్ద ఎత్తున మహిళలు ఈ ఉత్సవాలలో పాల్గొనటం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ పండగ మహిళా సంఘటిత శక్తికి నిదర్శనమన్నారు. జిల్లా నుంచి ఇద్దరు మహిళలను ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలకు పంపించనున్నట్లు తెలిపారు. కళాశాల మైదానంలో ప్రతి రోజూ, అక్టోబర్ 2న బైపాస్‌లో గల వల్లభరావు చెర్వు వద్ద బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశామన్నారు.
మొదటి బహుమతి రూ. 1000లను పానగల్లు మహిళా సంఘ బంధం సభ్యులకు , 2వ బహుమతి రూ. 500లను ప్రభుత్వ శాఖల మహిళలకు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సోలేషన్ బహుమతి కింద రూ.250 చొప్పున అందజేశారు. అంతకుముందు 15 బృందాలుగా ఏర్పడిన మహిళలు బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతిమీనా, ఏజేసీ వెంకట్రావ్, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, ఆర్‌డీఓ జహీర్, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్, మెప్మా పీడీ సర్వోత్తమరెడ్డి, డీఎంహెచ్‌ఓ ఆమోస్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డీపీఆర్‌ఓ నాగార్జున, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, మౌలానా, శాస్త్రి, చాంద్‌పాషా, డీపీఓ కృష్ణమూర్తి, కె.చినవెంకట్‌రెడ్డి, సుధారాణి, ఏచూరి శైలజ తదితరులు పాల్గొన్నారు.
‘బతుకమ్మ’ పోస్టర్ ఆవిష్కరణ
రాంనగర్ : నల్లగొండ జిల్లా బతుకమ్మ ఉత్సవాలు అనే కార్యక్రమంపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను
కలెక్టర్ టి.చిరంజీవులు గురువారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జిల్లాస్థాయిలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలపై వాల్ పోస్టర్‌ను తయారు చేసియించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతి మీనా, ఏఎస్పీ రమా రాజేశ్వరి, ఏజేసీ వెంకట్రావ్, డీపీఆర్‌ఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.