Bathukamma Speciality
-
సీతమ్మజెడల పూల.. సిరుల వర్షం: ఎకరాకు 80 వేల నుంచి లక్ష దాకా ఆదాయం
Bathukamma- Seethamma Jada Flowers- మంచిర్యాల అగ్రికల్చర్: జిల్లాలో సీతమ్మ జెడల పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. బతుకమ్మ పండుగ సీజన్లో దిగుబడితో లాభం చేకూరుతోంది. పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటల సాగు తగ్గిస్తూ పూలసాగుపై దృష్టి సారించడంతో విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. బతుకమ్మ తయారీలో విని యోగించే తంగేడు పూలతోపాటు సీతమ్మ జెడ పూలకు మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బతుకమ్మ పేర్చడానికి ఆకర్షణీయంగా ఉంటుందని విని యోగిస్తారు. చూడడానికి గుబురుగా, దట్టంగా, ఆకట్టుకునే గులాబీ, నారింజ రంగుల్లో కనువిందు చేస్తాయి. సీజన్లో ధర ఎక్కువగా ఉన్నా బతుకమ్మను పేర్చడానికి వెనుకడుగు వేయరు. సద్దుల బతుకమ్మ ముందు నుంచి సీతమ్మ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కిలోపూలకు రూ.100 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇవ్వడంతో మహిళలు అధిక సంఖ్యలో పేరుస్తున్నారు. దీంతో పూలకు డిమాండ్ ఏర్పడింది. పెరిగిన సాగు జిల్లాలో సీతమ్మ(సీతమ్మ జెడ) సాగు గతేడాది 60 ఎకరాల వరకు ఉండగా.. ఈ ఏడాది 120 ఎకరాల వరకు పెరిగింది. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వె ళ్లే దారి పక్కనే ఉన్న గ్రామాల్లో సీతమ్మ పూల సాగు కనిపిస్తోంది. లక్సెట్టిపేట, హాజీపూర్, కన్నెపల్లి, బె ల్లంపల్లి, భీమిని, జైపూర్, చెన్నూర్ మండలాల్లో సా గు చేస్తున్నారు. తులం విత్తనం రూ.500కు కొనుగోలు చేసి విత్తుకున్నారు. రెండుమార్లు ఎరువులతోపా టు చీడపీడలు వ్యాప్తి చెందకుండా క్రిమిసంహారక మందులు పిచికారీచేశారు. జూలైలో విత్తుకున్న పంట పూతకు వచ్చింది. రెండు నుంచి మూడు తడుల నీటితో 70 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెడుతుండగా.. 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. గత ఏడాది ఎకరం సాగు చేసిన రైతులు రూ.80 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఆదాయం పొందారు. కొన్ని చోట్ల రైతులు పత్తిలో అంతరపంటగానూ సీతమ్మ జెడ పూల సాగు చేస్తున్నారు. చేను వద్దే విక్రయాలు.. కొందరు వ్యాపారులు ముందస్తుగానే సద్దుల బతుకమ్మ పండగ కోసం 20రోజుల ముందు నుంచే చేను వద్దకు వెళ్లి అడ్వాన్స్ ఇస్తున్నారు. గుత్త లెక్కన ఒ ప్పందం చేసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. ఒక్కో సా లుకు దూరాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.3,000 వేల వరకు రైతులు విక్రయిస్తున్నారు. పూలతోనే అందం బతకమ్మ పేర్చడానికి తంగెడుపూలు ఎంతో ప్రత్యేకం కాగా.. అలంకరణతో సీతమ్మజెడల పూలుకూడా ఎంతో అందాన్ని ఇస్తుంది. ఇతర పూలు ఎన్ని ఉన్నా సీతమ్మ పూలు ఆకర్శణీయంగా ఉంటాయి.పండుగ సమయంలో ధర ఎక్కువైనా సీతమ్మ పూలు తప్పనిసరి కొనుగోలు చేసి బతకమ్మను పేర్చుకుంటాం. – బీమరాజుల సరిత, మంచిర్యాల చదవండి: Sagubadi: కాసుల పంట డ్రాగన్! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా! బతుకమ్మ ప్రత్యేకం.. బంతి, చామంతి, గునుగు, లిల్లీ, పట్టుకుచ్చులకు భలే గిరాకీ... -
తొమ్మిది రోజులు.. 9 రకాలుగా.. విను వీధులు.. విరివనాలు
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్ కల్చరల్: ఎగిలివారంగ తొలిమంచు కురవంగా.. ఆ.. మంచు బిందువులతో గౌరమ్మ మురవంగా.. చలికి వణుకుతున్న చేతులతో గౌరమ్మను తెంపంగా.. తోడుగా రంగురంగుల పూలను కోయంగా.. కోసిన పూలను ఒక్కచోట చేర్చిన ఆడపడుచు.. పేర్చేను ఎంగిలిపూల బతుకమ్మను సంబరంగా.. ఆడబిడ్డలు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ.. బతుకమ్మ అంటూ.. ఆడిపాడేను ఉత్సాహంగా.. నేటి నుంచి బతుకమ్మ సంబరాల సందర్భంగా కథనం..!! చదవండి: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా? నిండిన చెరువులు, పండిన పంటలు, రాలిన చినుకులతో అలుకుపూత చేసుకుందా అన్నట్లు కనిపించే అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా కనిపించే సమయమే.. బతుకమ్మ సంబరానికి ప్రారంభం. అతివల హర్షం ఆకాశాన్ని తాకేలా బతుకమ్మ తన వైభవాన్ని చాటుతోంది. మహాలయ అమావాస్య నుంచి నవమి వరకు పూలతో బతుకమ్మను కొలవడం అనూచానంగా వస్తోంది. ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబరాలు ఆదివారంతో ప్రారంభం అవుతున్నాయి. తంగేడు, బంతి, గునుగు, చేమంతి, రుద్రాక్ష, కట్లపూలు, పట్టు కుచ్చులు, సీతమ్మ జడ వంటి పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. పట్ట ణాలు, పల్లెలనే తారతమ్యం లేకుండా వీధులన్నీ విరులవనాలుగా మారుతాయి. ఆదివారం సాయంత్రం ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. పాటల్లో పల్లె జీవితాలు బతుకమ్మ ఆరాధనలో పాటల పాత్ర ప్రత్యేకమైంది. అమ్మ ఆరాధనను స్ఫురించే పాటలతో పాటు తెలంగాణ పల్లె ప్రజల జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. శ్రామిక సౌందర్యాన్ని ప్రతిబింబించేవి కొన్నయితే, కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు అత్తవారింటి ఆదరాభిమానాలు, కుటుంబాల్లోని కలతలు, జీవితాల్లోని సంఘర్షణలను మరికొన్ని చాటుతాయి. విభిన్నం.. ఉమ్మడి జిల్లా బతుకమ్మ ఉమ్మడి జిల్లాలో విభిన్న సంస్కృతుల కారణంగా బతుకమ్మవేడుకను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవాయితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావిలాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుకమ్మ అనంతరం బావిని పూడ్చుతారు. పూల కొరత.. మార్కెట్ సందడి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల కొరత ఏర్పడింది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో బీళ్లుగా లేకపోవడంతో బతుకమ్మ పూలు దొరకడం ఈసారి గగనంగా మారింది. ఉన్న పూలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులు బతుకమ్మ పూలను సాగు చేస్తుండగా.. అధిక వర్షాలు నష్టాలను మూటగట్టాయని చెబుతున్నారు. ఉన్నకొద్ది పువ్వునే విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. అదే విధంగా నైవేద్యాలు.. పిండివంటలు చేసేందుకు ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎది కొనాలన్నా సామాన్యులు జేబులు చూసుకోవాల్సి వస్తోంది. అయినా ఏడాదికోసారి వచ్చే పండగ అంటూ ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అవుతున్నారు. 9 రోజులు.. తొమ్మిది రకాలుగా •తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ •రెండో రోజు అటుకుల బతుకమ్మ •మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ •నాలుగో రోజు నానే బియ్యం •ఐదో రోజు అట్ల బతుకమ్మ, •ఆరో రోజు అలిగిన బతుకమ్మ •ఏడో రోజు వేపకాయ బతుకమ్మ •ఎనిమిదో రోజు •వెన్నముద్దల బతుకమ్మ •తొమ్మిదో రోజు •సద్దుల బతుకమ్మ నైవేద్యాలు నవ విధాలు ఆడబిడ్డలంతా వీధి కూడలిలో బతుకమ్మ ఆడిన తరువాత సమీప నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. అనంతరం వాయినాలు ఇచ్చుకుంటారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు, అట్లు, పెరుగు అన్నం, చింతపండుతో చేసిన పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, మక్క కంకులు, జొన్నలు, మినుములు, శనగలు, పెసర్లు, గోధుమలు, బియ్యం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసిన పలు రకాల వంటకాలను బతుకమ్మకు నైవేద్యాలుగా వినియోగిస్తారు. ఎంగిలి పూలు అంటే.. తంగెడు, రుద్రాక్షలు, కట్లపూలు, పట్టుకుచ్చులు, చిట్టి చేమంతులు, పోకబంతులు, బంతి ఇలా సాధారణ రోజుల్లో ఎవరూ పట్టించుకోని పూవులన్నీ బతుకమ్మ పండుగ నాడు గుర్తింపును ఆపాదించుకుంటాయి. వీటన్నింటి కూర్పే బతుకమ్మ. సమీపంలోని చేనూ చెలకా తిరిగి ఒక రోజు ముందే అవసరమైన పూలన్నీ సేకరించుకుని వస్తారు. నీటిలో కానీ, తేమగా ఉన్న వస్త్రంలో కానీ కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఒక రోజు ముందు సేకరించిన పూలతో బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూలుగా భావిస్తారు. కీటకాల పరాగ సంపర్కంతో ఎంగిలి పడ్డాయని భావించి ఎంగిలిపూలుగా పిలుస్తారు. పండగ అంటే బతుకమ్మే పండగ అంటే బతుకమ్మనే అనిపిస్తుంది. మా స్కూల్ పిల్లలు అందరమూ ముందస్తుగా స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆటలు, పాటలు, గ్రౌండ్ నిండా మనుషులు చూడడానికి, ఆడడానికి కూడా చాలా బాగుంది. చిన్నబతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు మా వీధులన్నీ సందడిగా మారుతాయి. ఎంతైనా పండగ అంటే బతుకమ్మే. – బి.సంజన, విద్యార్థిని, సిరిసిల్ల ఆనందాల వేడుక మనరాష్ట్రంలో ఆడవాళ్లందరికీ వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే పండగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు పదిహేను రోజుల పాటు ఆడపిల్లలకు సంతోషాలను పంచుతుందీ పండగ. అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని చిన్నా పెద్దా పాటించడం వల్ల ఈ సంస్కృతి చిరకాలం నిలుస్తుంది. – మర్రిపెల్లి రమ, గృహిణి, సిరిసిల్ల లక్ష్మీదేవీ స్వరూపం బతుకమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవీ స్వరూపం అని పెద్దవాళ్లు అంటుంటారు. కాబట్టి పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం సంపదలకు మూల కారణం అవుతుందంటారు. అమ్మవారి అనుగ్రహం, దేవతల ఆశీర్వాదం కోసం బతుకమ్మ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇంటిల్లిపాది ఇందులో పాల్గొనడం పండుగకు ప్రత్యేకంగా భావించాలి. అందుకే గౌరమ్మను ప్రత్యేకంగా పూజిస్తాం మనం. – గడ్డం చందన, గృహిణి, సిరిసిల్ల సాయంకాలం సంతోషం రోజువారీ కార్యక్రమాలతో సతమతం అయ్యే ఆడవాళ్లందరికీ బతుకమ్మ పండగ మంచి రిలీఫ్. చిన్న, పెద్ద అందరికీ ఒకే చోట చేర్చడం బతుకమ్మకే సాధ్యం. ఆటపాటలు అన్నీ కూడా ఈ తరాన్ని ఆకర్షించేలా రూపుదిద్దుకున్నాయి. బతుకమ్మకు కొత్త అందాన్ని, ఆచారాన్ని ఆపాదించాయి. పది మందితో కలిసి జీవించే కల్చర్ కూడా అలవడుతుంది. అందుకే బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. – శివరాత్రి సౌమ్య, గ్రాడ్యుయేట్ కలర్‌ఫుల్ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పండుగ జరిగే తొమ్మిది రోజుల పాటు ఆడపిల్లలందరికీ గొప్ప రిలీఫ్. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు రోజూ కొత్త స్నేహితులు పెరిగే అవకాశం ఉంది. ఈ పది రోజులూ ఆడపిల్లలందరికీ ప్రత్యేకంగా గడిచిపోతుంది. ప్రతి సాయంత్రం ఓ సాటిస్ఫాక్షన్ తోడవుతుంది. వీధుల్లో హడావుడి.. ఒక్కచోటే కలిసే స్నేహితులు ఆ ఆనందమే వేరు. – శ్రీమంతుల సాత్విక, సిరిసిల్ల -
Bathukamma: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. అమ్మనే అడిగి.. ఆమెకిష్టమైన విధంగా!
తెలంగాణ ఆడబిడ్డల సంబురం బతుకమ్మ పండుగకు సమయం ఆసన్నమైంది. ఆదివారం(సెప్టెంబరు 25) ఎంగిపూల బతుకమ్మతో సందడి మొదలు కానుంది. తీరొక్క పూలతో సిబ్బిలో బతుకమ్మ పేర్చి.. గౌరమ్మను మధ్యలో పెడతారు. సాధారణంగా గుమ్మడిపువ్వు, తంగేడు, కట్లపూలు, గోరంట పూలు, పట్టుకుచ్చులు(సీతజడలు), రుద్రాక్షలు, పొన్నపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఈ పూల పండుగ అంటేనే ఆటపాటలు కదా! బతుకమ్మ ఆడేటపుడే కాదు పేర్చేటపుడు కూడా ఇలా పాట పాడుకుంటారు ఆడబిడ్డలు. ఏయే పూలతో నిన్ను కొలవాలమ్మా అంటూ గౌరమ్మనే అడిగి ఆమెకిష్టమైన విధంగా బతుకమ్మ పేర్చినట్లు మురిసిపోతారు. ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతల్లో పాటలు ప్రధానమైనవన్న సంగతి తెలిసిందే. ‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ... గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి చెట్టుకింద గౌరమ్మ... ఆట చిలకల్లారా ..పాట చిలకల్లారా బమ్మశ్రీమాడలూ గౌరమ్మ కందొమ్మ గడ్డలూ గౌరమ్మ... ఎనుగూల కట్టెలూ గౌరమ్మ తారు గోరంటాలు గౌరమ్మ... ఎర్రొద్దురాక్షలు గౌరమ్మ పోను తంగేడుపూలు గౌరమ్మ... రాను తంగేడుపూలు గౌరమ్మ ఘనమైన పొన్నపూలే గౌరమ్మ... గజ్జాల వడ్డాణమే గౌరమ్మ తంగేడు చెట్టుకింద గౌరమ్మ... ఆట చిలకల్లారా.. పాట చిలకల్లారా బమ్మశ్రీమాడలూ గౌరమ్మ కందొమ్మ గడ్డలు ఎనుగూల కట్టెలు గౌరమ్మ తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు పోను తంగేడుపూలురాను తంగేడుపూలు ఘనమైన పొన్నపూలేగజ్జాల వడ్డాణమే కాకర చెట్టుకింద ఆట చిలుకాలార పాట చిలుకాలార బమ్మశ్రీమడలూ తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు పోను తంగేడుపూలురాను తంగేడుపూలు ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే రుద్రాక్ష చెట్టుకింద ఆట చిలుకాలార పాట చిలుకాలార కలికి చిలుకాలార కందొమ్మ గడ్డలూ బమ్మశ్రీమాడలూ తారు గోరంటాలు తీరు గోరంటాలు ఎనుగూల కట్టె ఎర్రొద్దురాక్షలు రాను తంగెడు పువ్వు పోను తంగెడు పువ్వు ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే ఆ పూలు తెప్పించి పొందుగా పేరిచి గంధములు పూయించి పసుపు కుంకుమలు పెట్టి నీ నోము నీకిత్తునే గౌరమ్మ నా నోము నాకియ్యవే గౌరమ్మ’’ అంటూ పాడుకుంటారు తెలంగాణ ఆడపడుచులు! ఇక బతుకమ్మ పేర్చిన తర్వాత ఊరంతా ఒక్కచోట చేరి.. చప్పట్లూ కొడుతూ పాటలు పాడుతూ అమ్మవారిని కొలుస్తారు. చదవండి: Bathukamma: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? -
Bathukamma: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా?
బతుకమ్మ పండుగ పకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు. చదవండి: ఆ బంధాన్ని గుర్తు చేసేదే బతుకమ్మ రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. -
Bathukamma: ఆ బంధాన్ని గుర్తు చేసేదే బతుకమ్మ
ప్రకృతికి, మనిషికి ఉన్న సంబంధం ఎంత బలమైంది ? ఈ ప్రశ్నకు సమాధానమే బతుకమ్మ పండుగ. మట్టి నుంచి చెట్టు దాకా, నీటి నుంచి పూల దాకా...అన్నింటితోనూ మనకి వీడదీయ లేని బంధమే. ఇక పల్లె, కుటుంబం, తోబుట్టువులు, పుట్టినిల్లు, మెట్టినిల్లు ఇవన్నీ బలమైన మానవ సంబంధాలే. అటు ప్రకృతితో మన బంధాన్ని, ఇటు స్త్రీకి కుటుంబంతో ఉన్న బంధాన్ని గుర్తు చేసేదే బతుకమ్మ. నేలను ముద్దాడి, గంగను స్పర్శించి, పుట్టమన్నును పూజించే తెలంగాణ గట్టు పైన.. పూలను కొలిచే అరుదైన సంప్రదాయం బతకమ్మ. బతుకమ్మ పండగలో అణువణువునా స్త్రీతత్వం ఉట్టిపడుతుంది. బతుకమ్మ పాటల్లో స్త్రీల జీవితాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. అందుకే బతుకమ్మ అంటే స్త్రీ.. స్త్రీ అంటే బతుకమ్మ అన్నట్లుగా ఈ పండగ తెలంగాణ సంస్కృతిలో మమేకమైంది. ఆడేడో ఆడపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. పండక్కి తీసుకెళ్లేందుకు వచ్చే తండ్రి, మేన మామ, తోబుట్టువుల కోసం. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వేళ జరిగేది ఇదే. వానలొస్తే చెరువులు నిండుతాయి. పొలాలన్నీ పచ్చని చీర కట్టుకుంటాయి. అలానే బతుకమ్మ వస్తే.. అత్తింటి నుంచి ఆడబిడ్డలంతా పుట్టింటికొస్తారు. అయి నోళ్లను, పుట్టి, పెరిగిన పల్లెని చూసి మురిసిపోతారు. పుట్టింటితో ఉన్న బంధాన్ని తల్చుకుని పొంగిపోతారు. అందుకే బతుకమ్మ అంటే.. బతుకులోంచి పుట్టిన పండుగే కాదు. బతుక్కి ఇంత తృప్తినిచ్చే పండుగ కూడా. -
Bathukamma: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?
పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి.. చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈసారి సెప్టెంబరు 25(ఎంగిలిపూల బతుకమ్మ)న ఈ సంబరాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా పండుగ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలు బతుకమ్మ.. బతుకునీయవమ్మా! ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. సాధారణంగా గునుగు, గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, గోరంట్ల పూలు పట్టుకుచ్చులు(సీతజడ పూలు) స్థూపాకారంలో వరుసలుగా పేర్చి.. పైభాగం మధ్యలో ‘గౌరమ్మ’ను పెడతారు. గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు.. పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గరూపంగా.. బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మా(జీవించు అని అర్థం).. మాకు బతుకునీయవమ్మా(మమ్మల్ని చల్లగా చూడు తల్లీ) అని పాటలతో అమ్మను వేడుకుంటారు. బతుకమ్మ పండుగ నేపథ్యం బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాట ప్రకారం... ధర్మాంగధుడు అనే రాజుకు వంద మంది కుమారులు పుట్టి చనిపోయారు. దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపున ఆ లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు. వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది. ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు ‘నువ్వు ఎల్లకాలం బతుకమ్మ’ అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది. చిన్న కోడలు కథ ఇక బతుకమ్మ చుట్టూ చేరి.. పండుగకు కారణమైన కథను గానం చేసే పల్లె ప్రజల పదాల ఆధారంగా.. బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యం పొందింది. దాని ప్రకారం.. అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఓ చిన్న కోడలు. వారి ఊరికి జీవనాధారం చెరువు. ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడటంతో మత్తడి దుంకుతుంది. ఎడతెరిపి లేని వానల వల్ల చెరువు నిండి కట్టకు గండిపడుతుంది. గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే, చెరువు కట్ట అంటే అక్కడ మైసమ్మ(గ్రామ దేవత) కొలువు ఉంటుందని చాలా మంది నమ్మకం. ఆమే చెరువుకు రక్షణగా ఉంటుందని భావిస్తారు. అందుకే కట్ట నిలవాలంటే మైసమ్మను శాంతింపచేయాలని రాజు, ప్రజలు భావిస్తారు. కట్టను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు. ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకు కూడా బర్రెల మంద ఉందని సమాధానమిస్తుంది. ఆవుల మంద, గొర్రెల మంద, మేకల మంద.. ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయని చెబుతుంది. దీంతో ఆ రాజు.. తమ ఊరి బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెబుతాడు. కానీ.. ఆ గ్రామ దేవత శాంతించదు. ఎటూపాలుపోని స్థితిలో ఆ రాజు చిన్న కోడల్నిస్త ఉయ్యాలో.. కట్ట నిలుపే మైసు ఉయ్యాలో అని రాగం అందుకోగానే మైసమ్మ సంతృప్తి పడుతుంది. కట్ట తెగకుండా ఆపుతుంది. ఇక అన్న మాట ప్రకారం రాజు ఇంటికెళ్లి తన చిన్న కోడలిని చెరువు దగ్గరకు తీసుకువచ్చేందుకు పూనుకుంటాడు. కానీ.. ఆమెకు తను చేయాల్సిన త్యాగం గురించి చెప్పడు. అయితే, చిన్న కోడలి పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ.. అన్ని పనులు పూర్తయ్యాయని ఆమె చెప్పగానే చెరువుకు పోయి నీళ్లు తెమ్మని చెబుతాడు. మామ మాటను గౌరవించి ఆ చిన్న కోడలు బిందె పట్టుకుని చెరువు దగ్గరకు వెళ్తుంది. అయితే, ఎంత ముంచినా బిందె మునగదు. నడుము లోతు వరకు వెళ్లినా అదే పరిస్థితి. అంతలో ఆ రాజు కల్పించుకుని ఇంకొంచెం లోపలికి పొయ్యి నీళ్లు తే అని చెబుతాడు. అలా మరింత లోతుకు వెళ్లిన ఆమె బిందెతో పాటు చెరువులో మునిగిపోతుంది. తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న ఆ తల్లి.. తన తల్లిదండ్రులకు బిడ్డ లేదని, త బిడ్డకు తల్లి లేదని చెప్పమంటూ పాటు పాడుతూ పూర్తిగా మునిగిపోతుంది. బొడ్డెమ్మనై.. మళ్లీ వస్తానంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది. అయితే, ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్లలో తేలతాయి. ఊరి కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆడబిడ్డ తాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ.. బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే ఉంటుందని.. పూలతో ఆమెను పూజించుకుంటామని ఊరి వాళ్లంతా చెప్పినట్టు కథ సాగుతుంది. ఇవేగాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. -వెబ్‌డెస్క్