Telangana culture and traditions
-
తొమ్మిది రోజులు.. 9 రకాలుగా.. విను వీధులు.. విరివనాలు
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్ కల్చరల్: ఎగిలివారంగ తొలిమంచు కురవంగా.. ఆ.. మంచు బిందువులతో గౌరమ్మ మురవంగా.. చలికి వణుకుతున్న చేతులతో గౌరమ్మను తెంపంగా.. తోడుగా రంగురంగుల పూలను కోయంగా.. కోసిన పూలను ఒక్కచోట చేర్చిన ఆడపడుచు.. పేర్చేను ఎంగిలిపూల బతుకమ్మను సంబరంగా.. ఆడబిడ్డలు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ.. బతుకమ్మ అంటూ.. ఆడిపాడేను ఉత్సాహంగా.. నేటి నుంచి బతుకమ్మ సంబరాల సందర్భంగా కథనం..!! చదవండి: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా? నిండిన చెరువులు, పండిన పంటలు, రాలిన చినుకులతో అలుకుపూత చేసుకుందా అన్నట్లు కనిపించే అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా కనిపించే సమయమే.. బతుకమ్మ సంబరానికి ప్రారంభం. అతివల హర్షం ఆకాశాన్ని తాకేలా బతుకమ్మ తన వైభవాన్ని చాటుతోంది. మహాలయ అమావాస్య నుంచి నవమి వరకు పూలతో బతుకమ్మను కొలవడం అనూచానంగా వస్తోంది. ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబరాలు ఆదివారంతో ప్రారంభం అవుతున్నాయి. తంగేడు, బంతి, గునుగు, చేమంతి, రుద్రాక్ష, కట్లపూలు, పట్టు కుచ్చులు, సీతమ్మ జడ వంటి పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. పట్ట ణాలు, పల్లెలనే తారతమ్యం లేకుండా వీధులన్నీ విరులవనాలుగా మారుతాయి. ఆదివారం సాయంత్రం ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. పాటల్లో పల్లె జీవితాలు బతుకమ్మ ఆరాధనలో పాటల పాత్ర ప్రత్యేకమైంది. అమ్మ ఆరాధనను స్ఫురించే పాటలతో పాటు తెలంగాణ పల్లె ప్రజల జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. శ్రామిక సౌందర్యాన్ని ప్రతిబింబించేవి కొన్నయితే, కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు అత్తవారింటి ఆదరాభిమానాలు, కుటుంబాల్లోని కలతలు, జీవితాల్లోని సంఘర్షణలను మరికొన్ని చాటుతాయి. విభిన్నం.. ఉమ్మడి జిల్లా బతుకమ్మ ఉమ్మడి జిల్లాలో విభిన్న సంస్కృతుల కారణంగా బతుకమ్మవేడుకను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవాయితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావిలాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుకమ్మ అనంతరం బావిని పూడ్చుతారు. పూల కొరత.. మార్కెట్ సందడి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల కొరత ఏర్పడింది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో బీళ్లుగా లేకపోవడంతో బతుకమ్మ పూలు దొరకడం ఈసారి గగనంగా మారింది. ఉన్న పూలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులు బతుకమ్మ పూలను సాగు చేస్తుండగా.. అధిక వర్షాలు నష్టాలను మూటగట్టాయని చెబుతున్నారు. ఉన్నకొద్ది పువ్వునే విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. అదే విధంగా నైవేద్యాలు.. పిండివంటలు చేసేందుకు ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎది కొనాలన్నా సామాన్యులు జేబులు చూసుకోవాల్సి వస్తోంది. అయినా ఏడాదికోసారి వచ్చే పండగ అంటూ ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అవుతున్నారు. 9 రోజులు.. తొమ్మిది రకాలుగా •తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ •రెండో రోజు అటుకుల బతుకమ్మ •మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ •నాలుగో రోజు నానే బియ్యం •ఐదో రోజు అట్ల బతుకమ్మ, •ఆరో రోజు అలిగిన బతుకమ్మ •ఏడో రోజు వేపకాయ బతుకమ్మ •ఎనిమిదో రోజు •వెన్నముద్దల బతుకమ్మ •తొమ్మిదో రోజు •సద్దుల బతుకమ్మ నైవేద్యాలు నవ విధాలు ఆడబిడ్డలంతా వీధి కూడలిలో బతుకమ్మ ఆడిన తరువాత సమీప నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. అనంతరం వాయినాలు ఇచ్చుకుంటారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు, అట్లు, పెరుగు అన్నం, చింతపండుతో చేసిన పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, మక్క కంకులు, జొన్నలు, మినుములు, శనగలు, పెసర్లు, గోధుమలు, బియ్యం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసిన పలు రకాల వంటకాలను బతుకమ్మకు నైవేద్యాలుగా వినియోగిస్తారు. ఎంగిలి పూలు అంటే.. తంగెడు, రుద్రాక్షలు, కట్లపూలు, పట్టుకుచ్చులు, చిట్టి చేమంతులు, పోకబంతులు, బంతి ఇలా సాధారణ రోజుల్లో ఎవరూ పట్టించుకోని పూవులన్నీ బతుకమ్మ పండుగ నాడు గుర్తింపును ఆపాదించుకుంటాయి. వీటన్నింటి కూర్పే బతుకమ్మ. సమీపంలోని చేనూ చెలకా తిరిగి ఒక రోజు ముందే అవసరమైన పూలన్నీ సేకరించుకుని వస్తారు. నీటిలో కానీ, తేమగా ఉన్న వస్త్రంలో కానీ కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఒక రోజు ముందు సేకరించిన పూలతో బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూలుగా భావిస్తారు. కీటకాల పరాగ సంపర్కంతో ఎంగిలి పడ్డాయని భావించి ఎంగిలిపూలుగా పిలుస్తారు. పండగ అంటే బతుకమ్మే పండగ అంటే బతుకమ్మనే అనిపిస్తుంది. మా స్కూల్ పిల్లలు అందరమూ ముందస్తుగా స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆటలు, పాటలు, గ్రౌండ్ నిండా మనుషులు చూడడానికి, ఆడడానికి కూడా చాలా బాగుంది. చిన్నబతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు మా వీధులన్నీ సందడిగా మారుతాయి. ఎంతైనా పండగ అంటే బతుకమ్మే. – బి.సంజన, విద్యార్థిని, సిరిసిల్ల ఆనందాల వేడుక మనరాష్ట్రంలో ఆడవాళ్లందరికీ వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే పండగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు పదిహేను రోజుల పాటు ఆడపిల్లలకు సంతోషాలను పంచుతుందీ పండగ. అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని చిన్నా పెద్దా పాటించడం వల్ల ఈ సంస్కృతి చిరకాలం నిలుస్తుంది. – మర్రిపెల్లి రమ, గృహిణి, సిరిసిల్ల లక్ష్మీదేవీ స్వరూపం బతుకమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవీ స్వరూపం అని పెద్దవాళ్లు అంటుంటారు. కాబట్టి పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం సంపదలకు మూల కారణం అవుతుందంటారు. అమ్మవారి అనుగ్రహం, దేవతల ఆశీర్వాదం కోసం బతుకమ్మ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇంటిల్లిపాది ఇందులో పాల్గొనడం పండుగకు ప్రత్యేకంగా భావించాలి. అందుకే గౌరమ్మను ప్రత్యేకంగా పూజిస్తాం మనం. – గడ్డం చందన, గృహిణి, సిరిసిల్ల సాయంకాలం సంతోషం రోజువారీ కార్యక్రమాలతో సతమతం అయ్యే ఆడవాళ్లందరికీ బతుకమ్మ పండగ మంచి రిలీఫ్. చిన్న, పెద్ద అందరికీ ఒకే చోట చేర్చడం బతుకమ్మకే సాధ్యం. ఆటపాటలు అన్నీ కూడా ఈ తరాన్ని ఆకర్షించేలా రూపుదిద్దుకున్నాయి. బతుకమ్మకు కొత్త అందాన్ని, ఆచారాన్ని ఆపాదించాయి. పది మందితో కలిసి జీవించే కల్చర్ కూడా అలవడుతుంది. అందుకే బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. – శివరాత్రి సౌమ్య, గ్రాడ్యుయేట్ కలర్‌ఫుల్ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పండుగ జరిగే తొమ్మిది రోజుల పాటు ఆడపిల్లలందరికీ గొప్ప రిలీఫ్. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు రోజూ కొత్త స్నేహితులు పెరిగే అవకాశం ఉంది. ఈ పది రోజులూ ఆడపిల్లలందరికీ ప్రత్యేకంగా గడిచిపోతుంది. ప్రతి సాయంత్రం ఓ సాటిస్ఫాక్షన్ తోడవుతుంది. వీధుల్లో హడావుడి.. ఒక్కచోటే కలిసే స్నేహితులు ఆ ఆనందమే వేరు. – శ్రీమంతుల సాత్విక, సిరిసిల్ల -
Bathukamma: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా?
బతుకమ్మ పండుగ పకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు. చదవండి: ఆ బంధాన్ని గుర్తు చేసేదే బతుకమ్మ రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. -
వైభవంగా బతుకమ్మ
- పల్లె నుంచి పట్టణం దాకా.. - ఏడు రోజులపాటు కార్యక్రమాలు - నిర్వహణకు నాలుగు కమిటీ లు - 2న హైదరాబాద్‌లో ఉత్సవాలు - జిల్లా నుంచి 50 మంది ఎంపిక - ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష సాక్షి, కరీంనగర్ : ‘బతుకమ్మ బతకమ్మ ఉయాల్లో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఆడుకునే బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే ఈ పండుగను ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు అత్యంత వైభవంగా చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. పల్లె నుంచి పట్టణం దాకా రోజూ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కరీంనగర్లో నిర్వహించే సంబరాల కోసం రూ. 10 లక్షలు కేటారుుంచిన ప్రభుత్వం.. మండలాల్లో చేపట్టే ఉత్సవాల కోసం స్థానిక సంస్థల నిధులు వాడుకోవాలని అధికారులను ఆదేశించింది. కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య బుధవారం బతుకమ్మ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్లో జిల్లా అధికారులు, సాంస్కృతిక కళా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉత్సవాల నిర్వహణ కోసం నగర పాలక కమిషనర్ శ్రీకేశ్ లట్కర్, డీఆర్డీఏ, మెప్మా పీడీలు విజయ్‌గోపాల్, విజయలక్ష్మి, జిల్లా పౌరసంబంధాల అధికారి ప్రసాద్‌ను నియమించారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కమిషనర్లు, ప్రత్యేకాధికారులకు ఉత్సవ నిర్వహణ బాధ్యత అప్పగించారు. నియోజకవర్గస్థాయిలో సంబంధిత ఆర్డీవోలు, శాసన సభ్యులను భాగస్వామ్యం చేయూలని అధికారులను సూచించారు. గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఐకేపీ సంఘాలు, మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు కలిసి అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయూలని కోరారు. ఉత్సవ వారోత్సవాల్లో బతుకమ్మ పాటలు, ఆటల్లో ప్రతిభ కనబరిచే మహిళలు 50 మందిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఉత్సవ నిర్వహణ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 2న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు 50 మంది మహిళలను తరలించాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు చర్యలు ప్రారంభించారు. నిర్వహణకు కమిటీలు.. ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ, సాంస్కృతిక, ప్రచార, ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిర్వహణ బాధ్యతలు, సాంస్కృతిక కమిటీ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు, పబ్లిసిటీ కమిటీ ఆయా ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు, ఆహ్వాన కమిటీ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులను పిలిచే బాధ్యతను చూసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో స్థానిక సర్కస్ గ్రౌండ్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బతుకమ్మ నిర్వహణపై పోటీలు, 5 నుంచి రాత్రి 7 గంటల వరకు బతుకమ్మ ఆటలు, 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పాటల పుస్తకాలు.. సీడీలు అధికారులు బతుకమ్మ పాటలతో కూడిన 50 వేల పుస్తకాలు ముద్రించాలని నిర్ణయించారు. వీటిని జిల్లాలో పంపిణీ చేసి ఎవరికి వారే బతుకమ్మ పాటలు పాడుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సీడీలు తయారు చేసి ఉత్సవాల్లో ప్రదర్శించాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్డీ సుబ్బరాయుడు, నగరకమిషనర్ శ్రీకేశ్ లట్కర్, జెడ్పీ సీఈవో సదాన ందం, జిల్లా ప్రణాళిక అధికారి సుబ్బరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇయ్యాల రేపంట.. లష్కర్ బోనాలంట
- నేడు బోనాలు, రేపు రంగం - విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్న ఆలయం - పూర్తయిన ఏర్పాట్లు భారీ బందోబస్తు రాంగోపాల్‌పేట్:లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. సోమవారం రంగం ఉంటుంది. ఇందులో జోగిని భవిష్య వాణి వినిపిస్తుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర జరగనుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పది లక్షలకుపైగా భక్తుల పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మొదటి పూజ... ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఆదివారం తెల్లవారు జామున 4గంటలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మొదటి పూజ చేయనుంది. ఆపై మిగతా భక్తులను అనుమతిస్తారు. అంతకుముందు అభిషేకాలు, మహా మంగళహారతి పూజలు మొదలవుతాయి. బోనాలకు ప్రత్యేక క్యూలైన్.. అమ్మవారిని దర్శించుకునేందుకు ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ (బాటా వైపు నుంచి) ఏర్పాటు చేశారు. వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ బోనాలతో వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలకు (ఎరుపు రంగు పాస్), సాధారణ భక్తులకు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ వైపు నుంచి రెండు వేర్వేరు క్యూ లైన్లు, టొబాకో బజార్ నుంచి ప్రత్యేక దర్శనం కోసం (నీలం రంగు పాస్) మరో క్యూలైన్, అంజలీ థియేటర్ వైపు నుంచి సాధారణ భక్తుల కోసం ఓ క్యూలైన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రొటోకాల్ అధికారులకు మహంకాళి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉండే ఆర్చ్‌గేట్ నుంచి నేరుగా అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు ఇక్కడి నుంచే నేరుగా లోపలికి పంపిస్తారు. క్యూలైన్లలో ఉండే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా వాటర్ ప్రూఫ్‌తో కొల్కత్తా డెకోరేషన్ షెడ్స్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు బిగించారు. నిరంతం విద్యుత్ సరఫరా దేవాలయంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్ సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా మొబైల్ ట్రా న్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. దేవాలయానికి చెందిన జనరేటర్‌ను సిద్ధంగా ఉంచారు. జలమండలి... జాతర కోసం జలమండలి మంచినీటి సరఫరా చేస్తుంది. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, బాటా, దేవాలయం వెనుక టెంట్లు వేసి డ్రమ్ములతోపాటు వాటర్ ప్యాకెట్లు భక్తులకు అందిస్తారు. 15 వందల మంది వలంటీర్లు.. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వివిధ శాఖలు, సంస్థలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పనిచేయనున్నారు. దక్కన్ మానవసేవా సమితి, వాసవి క్లబ్ సికింద్రాబాద్, మున్నూరు కాపు సంఘం, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నల్లగుట్ట అభివృద్ధి సంఘం తదితర సంఘాల వారు అమ్మవారి సేవలో పాలుపంచుకోనున్నారు. బందోబస్తు ఏర్పాట్లు భారీగా.. ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి ఆధ్వర్యంలో జాతరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయం లోపల 16, బయట 16 సీసీ కెమెరాలను దేవాలయ అధికారులు బిగిం చారు. మరో 10 సీసీ కెమెరాలను పోలీసులు క్యూలైన్లలో ఏర్పాటు చేసి ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు పెద్ద పెద్ద ఎల్సీడీలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది ఏసీపీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 72 మంది ఎస్ఐలు, 66 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 296 మంది కానిస్టేబుళ్లు, 242 మంది హోం గార్డులు, 12 ప్లటూన్ల సాయుధ బలగాలను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఇందులో 132 మంది మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. పార్కింగ్ ప్రదేశాలు... రాణిగంజ్‌లోని అడివయ్య చౌరస్తాలోని మైదానం, ఆర్పీ రోడ్‌లోని మహబూబ్ కళాశాల, ప్యారడైజ్ ప్రాంతంలోని పీజీ కళాశాల, ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉండే వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణాల్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు.