వైభవంగా బతుకమ్మ | grad celebration in telangana state | Sakshi
Sakshi News home page

వైభవంగా బతుకమ్మ

Published Thu, Sep 18 2014 2:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

వైభవంగా  బతుకమ్మ - Sakshi

వైభవంగా బతుకమ్మ

- పల్లె నుంచి పట్టణం దాకా..  
- ఏడు రోజులపాటు కార్యక్రమాలు
- నిర్వహణకు నాలుగు కమిటీ లు  
- 2న హైదరాబాద్‌లో ఉత్సవాలు
- జిల్లా నుంచి 50 మంది ఎంపిక   
- ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
 సాక్షి, కరీంనగర్ :
‘బతుకమ్మ బతకమ్మ ఉయాల్లో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఆడుకునే బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే ఈ పండుగను ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు అత్యంత వైభవంగా చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. పల్లె నుంచి పట్టణం దాకా రోజూ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కరీంనగర్‌లో నిర్వహించే సంబరాల కోసం రూ. 10 లక్షలు కేటారుుంచిన ప్రభుత్వం.. మండలాల్లో చేపట్టే ఉత్సవాల కోసం స్థానిక సంస్థల నిధులు వాడుకోవాలని అధికారులను ఆదేశించింది.

కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య బుధవారం బతుకమ్మ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, సాంస్కృతిక కళా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉత్సవాల నిర్వహణ కోసం నగర పాలక కమిషనర్ శ్రీకేశ్ లట్కర్, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు విజయ్‌గోపాల్, విజయలక్ష్మి, జిల్లా పౌరసంబంధాల అధికారి ప్రసాద్‌ను నియమించారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కమిషనర్లు, ప్రత్యేకాధికారులకు ఉత్సవ నిర్వహణ బాధ్యత అప్పగించారు. నియోజకవర్గస్థాయిలో సంబంధిత ఆర్డీవోలు, శాసన సభ్యులను భాగస్వామ్యం చేయూలని అధికారులను సూచించారు.

గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఐకేపీ సంఘాలు, మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు కలిసి అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయూలని కోరారు. ఉత్సవ వారోత్సవాల్లో బతుకమ్మ పాటలు, ఆటల్లో ప్రతిభ కనబరిచే మహిళలు 50 మందిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఉత్సవ నిర్వహణ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 2న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు 50 మంది మహిళలను తరలించాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు చర్యలు ప్రారంభించారు.
 
నిర్వహణకు కమిటీలు..
ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ, సాంస్కృతిక, ప్రచార, ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిర్వహణ బాధ్యతలు, సాంస్కృతిక కమిటీ  కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు, పబ్లిసిటీ కమిటీ ఆయా ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు, ఆహ్వాన కమిటీ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులను పిలిచే బాధ్యతను చూసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో స్థానిక సర్కస్ గ్రౌండ్‌లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బతుకమ్మ నిర్వహణపై పోటీలు, 5 నుంచి రాత్రి 7 గంటల వరకు బతుకమ్మ ఆటలు, 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
 
పాటల పుస్తకాలు.. సీడీలు
అధికారులు బతుకమ్మ పాటలతో కూడిన 50 వేల పుస్తకాలు ముద్రించాలని నిర్ణయించారు. వీటిని జిల్లాలో పంపిణీ చేసి  ఎవరికి వారే బతుకమ్మ పాటలు పాడుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సీడీలు తయారు చేసి ఉత్సవాల్లో ప్రదర్శించాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్డీ సుబ్బరాయుడు, నగరకమిషనర్ శ్రీకేశ్ లట్కర్, జెడ్పీ సీఈవో సదాన ందం, జిల్లా ప్రణాళిక అధికారి సుబ్బరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement