తెలుగు కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు
ముంబై పరిసర ప్రాంతాలనుంచి మూడు వేలమంది మహిళల హాజరు
తీరొక్క పూలతో కనువిందుగా బతుకమ్మల కూర్పు
డప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు కాలుకదిపిన అతివలు
ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
బోరివలి: బోరివలి తూర్పులోని సుకూర్‌వాడి, గోపాల్ హేమ్‌రాజ్ హైస్కూల్ లో సుమారు రెండెకరాల సువిశాల స్థలంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారు. వేడుకల కోసం ఉత్తర ముంబై ప్రాంతాలైన దహిసర్, బోరివలి, కాందివలి, మలాడ్, గోరేగావ్, మాల్వా నీ, శివాజీ నగర్, దౌలత్ నగర్, నవగాం తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది కుటుంబ సమేతంగా తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి డప్పు చప్పుళ్ల మధ్య ఆటపాటలతో వాటి చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించారు.
ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు...
బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కమిటీ ముందే ప్రకటించడంతో మహిళలు ఒకరికొకరు పోటీపడుతూ తమ బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మనీషా కొమ్ము న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ బతుకమ్మ పోటీల్లో మొదటి బహుమతి లాల్ జీ పాడ, కాందివలి ప్రాంత మహిళలు, ద్వితీయ బహుమతి సాయిబాబా నగర్, బోరివలికి చెందిన మహిళలకు అదేవిధంగా తృతీయ బహుమతి మలాడ్ పద్మశాలీ సంఘానికి చెందిన మహిళలకు లభించాయి. ఈ సందర్భంగా మైదానంలో వివిధ రకాల రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది తెలుగు సంస్కృతిని జ్ఞప్తికి తెచ్చిన శారదరెడ్డి అనే మహిళను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, అతిధులు ఉత్తర ముంబై మాజీ లోక్‌సభ సభ్యుడు గోపాల్ శెట్టి, భాస్కర్ నాయుడు, స్థానిక కార్పోరేటర్ సంధ్య విపుల్ జోషి, బహుజన సాహిత్య అకాడమీ మహా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ నాగెల్ల తెలంగాణ ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ బతుకమ్మ వేడుకలను గురించి ప్రసంగించారు. అనంతరం వీరందరినీ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడు సునీల్ అంకం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తెర శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ఎలిజాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మదుసుదన్ రావు, మేకల హనుమంతు, కోశాధికారి గాజుల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మనగర్‌లో బతుకమ్మ, దాండియా వేడుకలు
పద్మనగర్ మహిళ సాంస్కృతిక సేవ మండలి నిర్వహించిన బతుకమ్మ, దాండియా వేడుకలకు మహిళలనుంచి విశేష స్పందన లభించింది. అదివారం సాయంత్రం స్థానిక పార్లమెంటు సభ్యురాలు ప్రణతి శిందే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపాలి కాలే లాంఛనంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక తెలుగు మహిళలతో కలిసి వారు కూడా బతుకమ్మ పాటలకు కాలు కదిపి కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో భాగంగా ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు, అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి వెండి వస్తువులను బహూకరించారు. అదేవిధంగా దాదాపు 50 మంది మహిళలకు చీరలు, ఇతర రకాల దుస్తులను బహుమతులుగా అందించారు. అలాగే ఉత్తమంగా దాండియా ఆడిన మహిళలకు నిర్వాకులు నగదు బహుమతులపే అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మేయర్ శ్రీ కాంచన యన్నం, మాజీ కార్పొరేటర్ దేవేంద్ర కోటే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మహిళా మండలి అధ్యక్షురాలు లీనా ఆకేన్, సెక్రటరీ మంజుశ్రీ వల్లకాటి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న రవ్వ, కోశాధికారి అర్చన వల్లకాటి, సహాయ కోశాధికారి పల్లవి కనకట్టి, స్వాతి అడం, వందన గంజి పాల్గొన్నారు.
థానేలో ఉత్సాహంగా ‘బతుకమ్మ’
థానేలో స్థిరపడిన తెలంగాణకు చెందిన గౌడ సమాజం సభ్యులు ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. థానే లూయిస్‌వాడీలోని షెహనాయి హాల్‌లో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికి విచ్చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. తమను చల్లగా చూడాలని బతుకమ్మను వేడుకున్నారు.అనంతరం బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నవారందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. గౌడ సమాజానికి చెందిన మహిళలందరినీ ఐక్యం చేసేందుకు గత రెండేళ్ల నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో సంఘ ప్రముఖులు, పదాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment