నగర కొత్వాల్ ఆసక్తికర ట్వీట్లు
ఎక్స్ వేదికగా వైరల్‌గా మారిన చర్చ
నిజాం కాలేజీ జిందాబాద్ అంటూ ఎంపీ అసద్ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ వేడుకలు, దాండియాలకు సంబం«ధించి ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. ఓ నెటిజనుడు అడిగిన ప్రశ్నకు కొత్వాల్ సీవీ ఆనంద్ తనదైన శైలిలో స్పందించారు. దీనికి తన వ్యాఖ్యను జోడించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంభాషణను మరింత రక్తికట్టించారు. వందలాది స్పందనలతో ఈ ట్వీట్ ఆదివారం వైరల్‌గా మారింది. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం పాతబస్తీలోని పేట్లబుర్జులో ఉన్న సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లారు. అక్కడ పోలీసు విభాగం ఏర్పాటు చేసిన బతుకమ్మ, దాండియా వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు.
ఈ ఫొటోలు, వీడియోలను కొత్వాల్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజనుడు 1999 నాటి ‘ప్రేమికుల రోజు’ చిత్రంలోని ‘దాండియా ఆటలు ఆడ’ పాటలోని ఓ భాగాన్ని జోడించారు. దీంతో పాటు ‘నిజం చెప్పండి... మీ స్కూల్, కాలేజీ రోజుల్లో దాండియా, బతుకమ్మతో ముడిపడిన ప్రేమకథలు ఉన్నాయా? అప్పట్లో మీరు కవితలు కూడా రాసి ఉంటారని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. దీన్ని సానుకూలం దృక్పథంతో స్వీకరించిన ఆనంద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఎన్నో ప్రేమ కథలు.. అయితే బతుకమ్మ, దాండియాలతో సంబంధం లేదు. మీరు కాసేపు మనసారా నవ్వుకునేలా నా పోస్టు ఉన్నందుకు సంతోషం’ అంటూ ఆంగ్లంలో వ్యాఖ్యానించారు.
దీంతో పాటు ‘ఔర్ క్యా రహాహై జిందగీ మే! జరా హసీన్ మజాక్ హోజాయే హర్ దిన్’ (జీవితంలో ఇంకా ఏం మిగిలింది.. ప్రతిరోజూ అందంగా, ఆనందంగా నవ్వుకోవడం తప్ప) అనే వ్యాఖ్యను ఆయన జోడించారు. దీనిపై పలువురు నెటిజనులు పోస్టులు, ట్యాగ్‌లు చేస్తుండగా... హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రంగంలోకి వచ్చారు. సీవీ ఆనంద్‌ను ఉద్దేశిస్తూ ‘నిజాం కాలేజీ జిందాబాద్’ అంటూ పోస్టు చేశారు. కొత్వాల్ ఆనంద్, ఎంపీ అసదుద్దీన్ ఇద్దరూ క్లాస్‌మేట్స్ కావడమే కాదు.. నిజాం కాలేజీ పూర్వ విద్యార్థులు కావడం ఇక్కడ గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment