ఇయ్యాల రేపంట.. లష్కర్ బోనాలంట | today bonalu festival | Sakshi
Sakshi News home page

ఇయ్యాల రేపంట.. లష్కర్ బోనాలంట

Published Sun, Jul 13 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

ఇయ్యాల రేపంట.. లష్కర్ బోనాలంట

ఇయ్యాల రేపంట.. లష్కర్ బోనాలంట

- నేడు బోనాలు, రేపు రంగం
- విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్న ఆలయం
- పూర్తయిన ఏర్పాట్లు భారీ బందోబస్తు

రాంగోపాల్‌పేట్:లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. సోమవారం రంగం ఉంటుంది. ఇందులో జోగిని భవిష్య వాణి వినిపిస్తుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర జరగనుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పది లక్షలకుపైగా భక్తుల పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
 
మొదటి పూజ...

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఆదివారం తెల్లవారు జామున 4గంటలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మొదటి పూజ చేయనుంది. ఆపై మిగతా భక్తులను అనుమతిస్తారు. అంతకుముందు అభిషేకాలు, మహా మంగళహారతి పూజలు మొదలవుతాయి.

బోనాలకు ప్రత్యేక క్యూలైన్..
అమ్మవారిని దర్శించుకునేందుకు ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ (బాటా వైపు నుంచి) ఏర్పాటు చేశారు. వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ బోనాలతో వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలకు (ఎరుపు రంగు పాస్), సాధారణ భక్తులకు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ వైపు నుంచి రెండు వేర్వేరు క్యూ లైన్లు, టొబాకో బజార్ నుంచి ప్రత్యేక దర్శనం కోసం (నీలం రంగు పాస్) మరో క్యూలైన్, అంజలీ థియేటర్ వైపు నుంచి సాధారణ భక్తుల కోసం ఓ క్యూలైన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రొటోకాల్ అధికారులకు మహంకాళి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉండే ఆర్చ్‌గేట్ నుంచి నేరుగా అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు ఇక్కడి నుంచే నేరుగా లోపలికి పంపిస్తారు. క్యూలైన్లలో ఉండే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా వాటర్ ప్రూఫ్‌తో కొల్‌కత్తా డెకోరేషన్ షెడ్స్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు బిగించారు.
 
నిరంతం విద్యుత్ సరఫరా
దేవాలయంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్ సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా మొబైల్ ట్రా న్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. దేవాలయానికి చెందిన జనరేటర్‌ను సిద్ధంగా ఉంచారు.
 
జలమండలి...
జాతర కోసం జలమండలి మంచినీటి సరఫరా చేస్తుంది. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, బాటా, దేవాలయం వెనుక టెంట్లు వేసి డ్రమ్ములతోపాటు వాటర్ ప్యాకెట్లు భక్తులకు అందిస్తారు.
 
15 వందల మంది వలంటీర్లు..
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వివిధ శాఖలు, సంస్థలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పనిచేయనున్నారు. దక్కన్ మానవసేవా సమితి, వాసవి క్లబ్ సికింద్రాబాద్, మున్నూరు కాపు సంఘం, ఎన్‌సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నల్లగుట్ట అభివృద్ధి సంఘం తదితర సంఘాల వారు అమ్మవారి సేవలో పాలుపంచుకోనున్నారు.
 
బందోబస్తు ఏర్పాట్లు భారీగా..
ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి ఆధ్వర్యంలో జాతరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయం లోపల 16, బయట 16 సీసీ కెమెరాలను దేవాలయ అధికారులు బిగిం చారు. మరో 10 సీసీ కెమెరాలను పోలీసులు క్యూలైన్లలో ఏర్పాటు చేసి ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు పెద్ద పెద్ద ఎల్‌సీడీలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది ఏసీపీలు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 72 మంది ఎస్‌ఐలు, 66 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 296 మంది కానిస్టేబుళ్లు, 242 మంది హోం గార్డులు, 12 ప్లటూన్ల సాయుధ బలగాలను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఇందులో 132 మంది మహిళా సిబ్బంది కూడా ఉన్నారు.

పార్కింగ్ ప్రదేశాలు...
రాణిగంజ్‌లోని అడివయ్య చౌరస్తాలోని మైదానం, ఆర్పీ రోడ్‌లోని మహబూబ్ కళాశాల, ప్యారడైజ్ ప్రాంతంలోని పీజీ కళాశాల, ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉండే వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణాల్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement