న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్‌పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్‌స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్‌గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు.
మరో గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్‌సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్‌కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌ను బుక్‌చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్‌ను బుక్‌చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్‌వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు.
నాలుగు అంచెల రక్షణ
ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్‌హాల్‌ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్‌లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్‌యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్‌ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్‌ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు.
పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్‌ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు.
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్‌చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్‌పై బయట ఉన్నంతసేపు సందీప్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్‌వార్‌ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment