revolver rani
-
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి
న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్‌పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్‌స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్‌గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరో గ్యాంగ్‌స్టర్ ఆనంద్పాల్సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్‌కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌ను బుక్‌చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్‌ను బుక్‌చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్‌వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు. నాలుగు అంచెల రక్షణ ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్‌హాల్‌ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్‌ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్‌ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు. పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్‌చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్‌పై బయట ఉన్నంతసేపు సందీప్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్‌వార్‌ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు. -
పెళ్లిమండపంలో ప్రియుడిని కిడ్నాప్ చేసి..
ఏకంగా పెళ్లి మండపం నుంచి ప్రియుడిని కిడ్నాప్ చేసి.. చివరకు అతన్నే పెళ్లి చేసుకున్న ఓ 'రివాల్వర్ రాణి' ప్రేమకథ ఇది. అనేక మలుపుల తర్వాత ఆమె ప్రేమకథ సుఖాంతమైంది. ఇంతకు ఈ రివాల్వర్ రాణి ఎవరు? ఆమె ప్రేమకథ ఏమిటంటే.. వర్ష సాహు అలియాస్ 'రివాల్వర్ రాణి'.. రెండు నెలల కిందట ఈమె పేరు మీడియాలో మార్మోగిపోయింది. అందుకు కారణం తన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా.. ఏకంగా తుపాకీతో బెదిరించి అతన్ని పెళ్లిమండపం నుంచే వర్ష సాహు కిడ్నాప్ చేసింది. మే 15న ఉత్తరప్రదేశ్ బుందేల్‌ఖండ్‌లోని మౌదాహాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వర్ష సాహు-అశోక్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటంతో వర్ష ఈ సాహసానికి ఒడిగట్టింది. తుపాకీతో బెదిరించి మరీ పెళ్లి కొడుకును పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన అశోక్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఇంతలో తమ కూతురిని పెళ్లి పేరిట మోసం చేశాడంటూ అశోక్‌పై పెళ్లికూతురు కుటుంబసభ్యులు కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అశోక్ ఈ నెల 7న జైలు నుంచి విడులయ్యాడు. జైలు బయట అతనికి ఘనస్వాగతం పలికిన వర్ష అతన్నే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. హమిర్‌పూర్‌లోని మతా చౌరా ఆలయంలో వీరి పెళ్లి ఈ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి భోజనాలు సహా అన్ని ఏర్పాట్లను యూపీ శివసేన శాఖ దగ్గరుండి చేయించడం గమనార్హం. అంతేకాదు ప్రేమికులు మోసం చేసే యువతులను ఆదుకునేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేయనున్నట్టు యూపీ శివసేన అధ్యక్షుడు రతన్ బ్రహ్మచారి ప్రకటించారు. -
‘నేను తీసుకెళ్లలేదు.. అతడే నాతో వచ్చాడు’
బుందేల్‌ఖండ్: రివాల్వర్ రాణి(వర్షా సాహు)ని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియుడని చెప్పి అశోక్ యాదవ్ అనే ఓ పెళ్లి కొడుకు తలకు తుపాకీ గురిపెట్టి మరీ పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన ఆమెను బుందేల్‌ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను అసలు తుపాకీ తీసుకురాలేదని, అశోక్‌ను తాను బలవంతంగా తీసుకెళ్లలేదని, తనే స్వయంగా ఇష్టంతో తనతో వచ్చాడని చెప్పింది. ఎందుకంటే అతడు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని కూడా వివరించింది. ‘నేను అక్కడికి తుపాకీతో వెళ్లలేదు.. అదంతా కూడా అబద్ధం’ అని కుర్తా సల్వార్ ధరించి పోలీస్ స్టేషన్లో కూర్చున్న ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. మంగళవారం రాత్రి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుండగా ఎస్యూవీ వాహనంలో వచ్చి వర్షా నేరుగా పెళ్లి కొడుకు తుపాకీ గురిపెట్టి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, తమకు రహస్యంగా వివాహం కూడా జరిగిందని, అశోక్ తల్లిదండ్రులు అతడికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి బలవంతంగా కూర్చొబెట్టారంటూ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తల్లి, సోదరితో కలిసి ఉంటున్నా వర్షా పెళ్లి కొడుకు తనంతట తనే వచ్చి కారులో కూర్చున్నాడని, ఇష్ట పూర్తిగా వచ్చాడని తెలిపింది. ‘ఆ పెళ్లిపట్ల అతడు సంతోషంగా లేడు. ఆ అమ్మాయిని చేసుకునేందుకు అతడు సిద్ధంగా లేడు. ఆ అమ్మాయి కుటుంబానికి కూడా అతడు మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయం తెలుసు. అయితే, అన్నీ సర్దుకుపోతాయని వారు భావించారు’ అని కూడా పోలీసులకు వివరించింది. ఇదిలా ఉండగా అశోక్ యాదవ్ ఇప్పటికీ కనిపించడం లేదంట. -
రివాల్వర్ రాణి: వరుడి తలకు తుపాకీ పెట్టి..
బుందేల్‌ఖండ్: తనను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడంటూ ఓ యువతి రివాల్వర్‌తో పెళ్లి మండపానికి వచ్చి వరుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి సుమోలో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చిన యువతి..' ఇతను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమై నన్ను మోసగిస్తున్నాడు. నేను ఈ పెళ్లిని ఎట్టి పరిస్ధితుల్లో జరగనివ్వను' అంటూ వరుడి తలకు వెంట తెచ్చుకున్న తుపాకి గురి పెట్టి అతన్ని కిడ్నాప్ చేసింది. కళ్ల ముందు జరిగిన ఈ సంఘటనతో వివాహానికి హాజరైన బంధువులు షాక్‌కు గురయ్యారు. వెంటన్ దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలాంటి అమ్మాయిలు ఉంటేనే అబ్బాయిలకు బుద్ధి వస్తుందని ఓ పోలీస్ అధికారి కిడ్నాప్ చేసిన యువతిని 'రివాల్వర్ రాణి' వ్యాఖ్యానించారు. కాగా, పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోవడంపై స్పందించిన వధువు ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. వరుడు అశోక్ యాదవ్ కిడ్నాప్‌పై స్ధానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన యువతి అశోక్‌కు ముందే తెలుసని చెప్పారు. మరికొందరు వారు సీక్రెట్‌గా గతంలోనే పెళ్లి చేసుకున్నారని.. తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఈ పెళ్లికి అశోక్ ఒప్పుకున్నాడని తెలిపారు. పెళ్లిమండపంలో వివాహం ఆగిపోవడంపై స్పందించిన వరుడి తండ్రి.. తన కొడుకు ప్రవర్తన కొంతకాలంగా అనుమానాస్పదంగా ఉన్నట్లు చెప్పారు. పని చేసే నగరానికి కలవడానికి వెళ్తే ఇంటికి తీసుకెళ్లకుండా.. గుడికి రమ్మనేవాడని తెలిపారు. అక్కడే ఏదో ఒక రెస్టారెంట్లో భోజనం పెట్టించి తిరిగి బస్ ఎక్కించేసేవాడని చెప్పారు. -
పోలాండ్‌లో రివాల్వర్ రాణీ
టాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధదాస్ వరుస చిత్ర షూటింగులతో యమబిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం గుంటూరు టాకీస్. ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోలాండ్‌లో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఆమె రివాల్వర్ రాణీ పాత్ర పోషిస్తుంది. ఆ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అంతా పోలాండ్ తరలి వెళ్లింది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అనంతపురం జిల్లా హిందూపురంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు టాకీస్ చిత్రం అటు హిందీ, ఇటు తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. తెలుగు చిత్రంలో శ్రద్ధ సీఈవోగా నటిస్తుండగా... హిందీ చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలాండ్లోని క్రాకో నగరంలో దిగిన ఫోటోలను శ్రద్ధ తన మైక్రో బ్లాగ్‌లో ఉంచింది. -
అప్పుడు అవమానాలు...ఇప్పుడు గౌరవ మర్యాదలు!
‘‘బక్కపల్చని శరీరాకృతి.. చెప్పుకోదగ్గ అందగత్తె కూడా కాదు. అభినయం కూడా అంతంత మాత్రమే. మహా అయితే మూడు నాలుగేళ్లు ఉంటుందేమో.. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లిపోవాల్సిందే’’... కథానాయికగా కంగనా రనౌత్ వచ్చినప్పుడు చాలామంది చేసిన విమర్శలివి. అవి కంగన వరకూ వెళ్లాయి కూడా. ఆ సమయంలో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటే.. నిజంగానే తన ఊరు హిమాచల్‌ప్రదేశ్ వెళ్లిపోయేవారు కంగన. అయితే, తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్. తనదాకా వచ్చిన సినిమాలేవీ కాదనకుండా చేశారు. వాటిలో ఎక్కువ శాతం అపజయాలపాలైనవే ఉన్నాయి. అప్పుడెన్నో అవమానాలకు గురయ్యాయనని, అవే తన మనసుని రాటుదేలేలా చేశాయని కంగన అన్నారు. ‘తను వెడ్స్ మను, క్వీన్, రివాల్వర్ రాణి’ విజయాలతో కంగన సీన్ మారిపోయింది. ఎవరైతే విమర్శించారో వాళ్లే ‘కంగనలో అద్భుతమైన నటి ఉంది. మునుపటికన్నా చాలా అందంగా ఉంది’ అని అభినందించడం మొదలుపెట్టారు. దాని గురించి చెబుతూ - ‘‘ఒకప్పుడు హేళన చేసినవాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారు. ఈ మార్పుని నేనూహించలేదు. ‘మీరు మంచి ఆర్టిస్ట్ మేడమ్’ అని అభినందిస్తున్నారు. నిజానికి అపజయం సాధించిన సినిమాల్లోనూ బాగానే యాక్ట్ చేశాను. కానీ, అదెవరూ గుర్తించలేదు. ఇప్పుడు విజయాల శాతం ఎక్కువైంది కాబట్టి, అభినందిస్తున్నారు. బలమైన పాత్రలు పడ్డాయి కాబట్టే, నిరూపించుకోగలిగాను. ఆ పాత్రలు సృష్టించిన రచయితలు, దర్శకులకే ఈ ఘనత దక్కుతుంది. ఈ మధ్య కాలంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువయ్యాయి. ఈ మార్పు ఆహ్వానించదగ్గది. ఇలాంటి సినిమాల వల్ల కథానాయికలందరికీ గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నా’’ అన్నారు కంగన. -
ఓ పాతిక వదిలేశా!
‘క్వీన్’, రివాల్వర్ రాణి’లాంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి, తనలో హాట్ గాళ్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా ఉందని కంగనా రనౌత్ నిరూపించుకున్నారు. సినిమా మొత్తాన్ని సునాయాసంగా తన భుజాల మీద నడిపించేస్తారనే నమ్మకాన్ని దర్శక, నిర్మాతలకు కలగజేశారు ఈ హాట్ బ్యూటీ. దీని గురించి కంగనా మాట్లాడుతూ -‘‘ఎవరికైనా సరే బలమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ, దర్శక, నిర్మాతలు నమ్మాలి. నమ్మి అవకాశం ఇస్తే, ఎవరైనా నిరూపించుకుంటారు. నన్ను నమ్మి క్వీన్, రివాల్వర్ రాణి చిత్రాలకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి, నా ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. ఏదేమైనా ఈ చిత్రాలిచ్చిన ఉత్సాహంతో నాకిప్పుడు టైటిల్ రోల్స్‌తో రూపొందే చిత్రాలే ఎక్కువగా చేయాలని ఉంది. ఆ తరహా చిత్రాలు ఈ మధ్య కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కానీ, ఏది పడితే అది చేస్తే ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, దాదాపు 25 సినిమాలు తిరస్కరించా’’ అని చెప్పారు. మీరు అదృష్టాన్ని నమ్ముతారా అనే ప్రశ్నకు సమాధానంగా -‘‘అస్సలు నమ్మను. నా కష్టాన్ని మాత్రమే నమ్ముతాను. ఒకవేళ అదృష్టం కనుక నావైపు ఉండి ఉంటే నా మొదటి సినిమానే విజయం సాధించి ఉండేది. కానీ, అలా జరగలేదు కదా. విజయం తాలూకు రుచి ఎలా ఉంటుందో చూడటానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. అది కూడా నేను క్లిష్టమైన పాత్రలను కష్టపడి చేయడంవల్లే’’ అని చెప్పారు. -
రచన, దర్శకత్వం కూడా..
ఇంతకుముందు విడుదలైన క్వీన్ సినిమా హిట్ కొట్టడం, తాజాగా విడుదలవుతున్న రివాల్వర్ రాణిపైనా భారీ అంచనాలు ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టీ కంగనా రనౌత్‌పైనే ఉంది. ఈ బ్యూటీ మనసు మాత్రం వేరే వాటిపై ఉంది. కేవలం కెమెరా ముందుకు వచ్చి ఆడిపాడటానికి బదులు రచన, దర్శకత్వం కూడా చేయాలని ఈమె అనుకుంటోంది. ‘నా జీవితమంతా నటనకే పరిమితం కాను. ఆమిర్‌ఖాన్, ఇర్ఫాన్‌ఖాన్ వంటి వాళ్లతో పని చే సిన తరువాత రచన, దర్శకత్వం చేస్తాను’ అని చెప్పిన కంగన ప్రస్తుతం అమెరికాలో స్క్రీన్‌ప్లే కోర్సు నేర్చుకుంటోంది కూడా. బాలీవుడ్ రేసులో ముందున్నప్పటికీ, దానిపై తనకు పెద్దగా పట్టింపులేవీ లేవని చెప్పింది. నంబర్‌వన్‌పై మోజు లేదని, ఎక్కడ సుఖంగా ఉంటే అదే రంగంలో ఉంటానని వివరించింది. రివాల్వర్ రాణి ఇంకా విడుదల కాకున్నా, దీనిపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఈ సినిమా దాదాపుగా హిట్ సాధించినట్టేనని కంగన నమ్మకంగా చెబుతోంది. ‘మేం స్క్రిప్టు దశలో ఊహించినదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా పండితులు ఏమనుకున్నా, నాకు మాత్రం ఈ సినిమా భారీ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. చిత్రం యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతగానో శ్రమించారు. సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ఈ 27 ఏళ్ల బ్యూటీ తెలిపింది. హీరోయిన్ ఆధారిత సినిమా అయిన రివాల్వర్ రాణి ఈ శుక్రవారమే థియేటర్లకు వస్తోంది. ఇది అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని, ఫలానా రకం సినిమాగా వర్గీకరించడం సాధ్యం కాదని కంగనా రనౌత్ చెప్పింది. సాయి కబీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీర్‌దాస్ కూడా ముఖ్యపాత్రలో కనిపిస్తాడు. -
ఆ సినిమా చూస్తే... నన్నెవరు చేసుకుంటారు?
పెళ్లీడుకొచ్చిన ఏ అమ్మాయి, అబ్బాయి అయినా తమలో ఉన్న ప్లస్ పాయింట్స్‌ను బయటికి చెప్పుకుంటారు. మైనస్సులను మనసులోనే దాచేసుకుంటారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనివాళ్లు ఈ రెండింటిలో ఏ కోణాన్నయినా నిర్భయంగా బయటపెట్టేస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, పెళ్లీడులో ఉన్న కంగనా రనౌత్ మాత్రం తాను నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రాణి’ చూస్తే, తననెవరూ పెళ్లి చేసుకోరని ఓ ప్రకటన ఇచ్చేశారు. ఎందుకలా అంటున్నారు? అనడిగితే.. సినిమా చూడాల్సిందే అని పేర్కొన్నారు. సినిమా ప్రచారం కోసమే కంగనా ఇలా అంటున్నారేమో అనుకుంటే, తన వ్యక్తిగత జీవితానికి మైనస్ అయ్యేలా ఎందుకు మాట్లాడతారు? సో.. ఈ సినిమాలో కంగనా రొటీన్‌కి భిన్నంగా, చెయ్యకూడని పాత్ర ఏదో చేసి ఉంటారని ఊహించవచ్చు. బాలీవుడ్ టాక్ ప్రకారం.. ఇందులో ఆమె ఓ రాజకీయ నాయకురాలి పాత్ర చేశారని, ఓ సినిమా హీరో మీద మనసు పడతారని తెలిసింది. కంగనాపై పగ తీర్చుకోవడానికి ప్రత్యర్థులు ఆ సినిమా హీరోని కిడ్నాప్ చేస్తే, అతణ్ణి కాపాడుకోవడానికి ఆమె రంగంలోకి దిగుతారట. కాబట్టి, ఆమెది చాలా బోల్డ్ కేరక్టర్ అని అర్థమవుతుంది. ఈ పాత్రలో కంగన గ్లామరస్‌గా కనిపించడం మాత్రమే కాదు... వీరోచిత పోరాటాలు కూడా చేశారట. బహుశా కరడు గట్టిన వనితలా కనిపిస్తారేమో. అందుకే, ఈ సినిమా చూశాక తననెవరూ పెళ్లి చేసుకోవడా నికి ముందుకు రారని చెప్పి ఉంటారు. ఇటీవల కంగన నటించిన ‘క్వీన్’ విజయపథంలో దూసుకెళుతోంది. నటిగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టిందీ సినిమా. ‘రివాల్వర్ రాణి’ రెట్టింపు పేరు తెస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు కంగనా రనౌత్. -
'రివాల్వర్ రాణి'కి ఉషా ఉత్తుప్ పాట
విభిన్నమైన స్వరం.. నుదుట రూపాయి కాసంత బొట్టు, ఎప్పుడూ నవ్వుతూ గలగల మాట్లాడే ఉషా ఉత్తుప్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ సహా 24 భాషల్లో అలవోకగా లెక్కలేనన్ని పాటలు పాడిన ఆమె ఇప్పటికీ తన గొంతుకు విశ్రాంతి ఇవ్వట్లేదు. కంగనా రనౌత్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న 'రివాల్వర్ రాణి' చిత్రానికి టైటిల్ సాంగ్ పాడారు. కంగనా రనౌత్‌కు ఉషా ఉత్తుప్ తన గొంతు ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి టైటిల్ సాంగ్ ఉషాజీయే పాడారని, మంచి హస్కీ వాయిస్ కావాలనుకున్న తమకు ఉషా ఉత్తుప్ కంటే మంచి గాయని ఎవరూ దొరకలేదని ఈ సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం క్వీన్ చిత్రం విజయవంతం కావడంతో మంచి ఊపుమీదున్న కంగనా.. రివాల్వర్ రాణితో మరింత దూసుకెళ్లాలని అనుకుంటోంది. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది.