రచన, దర్శకత్వం కూడా..
Published Thu, Apr 24 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM
ఇంతకుముందు విడుదలైన క్వీన్ సినిమా హిట్ కొట్టడం, తాజాగా విడుదలవుతున్న రివాల్వర్ రాణిపైనా భారీ అంచనాలు ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టీ కంగనా రనౌత్‌పైనే ఉంది. ఈ బ్యూటీ మనసు మాత్రం వేరే వాటిపై ఉంది. కేవలం కెమెరా ముందుకు వచ్చి ఆడిపాడటానికి బదులు రచన, దర్శకత్వం కూడా చేయాలని ఈమె అనుకుంటోంది. ‘నా జీవితమంతా నటనకే పరిమితం కాను. ఆమిర్‌ఖాన్, ఇర్ఫాన్‌ఖాన్ వంటి వాళ్లతో పని చే సిన తరువాత రచన, దర్శకత్వం చేస్తాను’ అని చెప్పిన కంగన ప్రస్తుతం అమెరికాలో స్క్రీన్‌ప్లే కోర్సు నేర్చుకుంటోంది కూడా.
బాలీవుడ్ రేసులో ముందున్నప్పటికీ, దానిపై తనకు పెద్దగా పట్టింపులేవీ లేవని చెప్పింది. నంబర్‌వన్‌పై మోజు లేదని, ఎక్కడ సుఖంగా ఉంటే అదే రంగంలో ఉంటానని వివరించింది. రివాల్వర్ రాణి ఇంకా విడుదల కాకున్నా, దీనిపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఈ సినిమా దాదాపుగా హిట్ సాధించినట్టేనని కంగన నమ్మకంగా చెబుతోంది. ‘మేం స్క్రిప్టు దశలో ఊహించినదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా పండితులు ఏమనుకున్నా, నాకు మాత్రం ఈ సినిమా భారీ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. చిత్రం యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతగానో శ్రమించారు.
సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్‌లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ఈ 27 ఏళ్ల బ్యూటీ తెలిపింది. హీరోయిన్ ఆధారిత సినిమా అయిన రివాల్వర్ రాణి ఈ శుక్రవారమే థియేటర్లకు వస్తోంది. ఇది అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని, ఫలానా రకం సినిమాగా వర్గీకరించడం సాధ్యం కాదని కంగనా రనౌత్ చెప్పింది. సాయి కబీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీర్‌దాస్ కూడా ముఖ్యపాత్రలో కనిపిస్తాడు.
Advertisement
Advertisement