అప్పుడు అవమానాలు...ఇప్పుడు గౌరవ మర్యాదలు!
‘‘బక్కపల్చని శరీరాకృతి.. చెప్పుకోదగ్గ అందగత్తె కూడా కాదు. అభినయం కూడా అంతంత మాత్రమే. మహా అయితే మూడు నాలుగేళ్లు ఉంటుందేమో.. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లిపోవాల్సిందే’’... కథానాయికగా కంగనా రనౌత్ వచ్చినప్పుడు చాలామంది చేసిన విమర్శలివి. అవి కంగన వరకూ వెళ్లాయి కూడా. ఆ సమయంలో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటే.. నిజంగానే తన ఊరు హిమాచల్‌ప్రదేశ్ వెళ్లిపోయేవారు కంగన. అయితే, తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్.
తనదాకా వచ్చిన సినిమాలేవీ కాదనకుండా చేశారు. వాటిలో ఎక్కువ శాతం అపజయాలపాలైనవే ఉన్నాయి. అప్పుడెన్నో అవమానాలకు గురయ్యాయనని, అవే తన మనసుని రాటుదేలేలా చేశాయని కంగన అన్నారు. ‘తను వెడ్స్ మను, క్వీన్, రివాల్వర్ రాణి’ విజయాలతో కంగన సీన్ మారిపోయింది. ఎవరైతే విమర్శించారో వాళ్లే ‘కంగనలో అద్భుతమైన నటి ఉంది. మునుపటికన్నా చాలా అందంగా ఉంది’ అని అభినందించడం మొదలుపెట్టారు. దాని గురించి చెబుతూ - ‘‘ఒకప్పుడు హేళన చేసినవాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారు. ఈ మార్పుని నేనూహించలేదు.
‘మీరు మంచి ఆర్టిస్ట్ మేడమ్’ అని అభినందిస్తున్నారు. నిజానికి అపజయం సాధించిన సినిమాల్లోనూ బాగానే యాక్ట్ చేశాను. కానీ, అదెవరూ గుర్తించలేదు. ఇప్పుడు విజయాల శాతం ఎక్కువైంది కాబట్టి, అభినందిస్తున్నారు. బలమైన పాత్రలు పడ్డాయి కాబట్టే, నిరూపించుకోగలిగాను. ఆ పాత్రలు సృష్టించిన రచయితలు, దర్శకులకే ఈ ఘనత దక్కుతుంది. ఈ మధ్య కాలంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువయ్యాయి. ఈ మార్పు ఆహ్వానించదగ్గది. ఇలాంటి సినిమాల వల్ల కథానాయికలందరికీ గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నా’’ అన్నారు కంగన.