Kangna Ranaut
-
సవాళ్లకు సై
కంగనా రనౌత్‌కు 80 ఏళ్లు. ఈ వయసులో సోలో లైఫ్ అంటే సో డిఫికల్ట్. సహాయం చేసేవాళ్లుండాలి. కానీ, కంగనా అందుకు ఇష్టపడదు. స్వయంగా తన పనులు తానే చేసుకుంటుంది. ఆగండాగండి.. కంగనా ఏంటి? 80 ఏళ్ల బామ్మ ఏంటి.. మొన్నీ మధ్యే కదా థర్టీ ఇయర్స్లోకి ఎంటరైంది అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. ‘తేజు’ అనే సినిమాలో కంగనా 80 ఏళ్ల వృద్ధురాలిగా నటించనున్నారట. 30 ఏళ్ల వయసులో 80 ఏళ్ల బామ్మగా నటించడం అంటే మాటలు కాదు. మేకప్వైజ్గా కష్టపడాలి. బాడీ లాంగ్వేజ్ కుదరాలి. డైలాగులు కూడా ఆ వయసుకి తగ్గట్టుగా పలకాలి. ఇన్ని సవాళ్లున్నప్పటికీ కంగనా మరో పెద్ద సవాల్‌ని ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు. అదేంటంటే.. ఈ సినిమాకి తనే దర్శకత్వం వహించనున్నారు. కథ కూడా తనే రాసుకున్నారు. -
కాశీలో క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్మెంట్
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన క్రిష్ తన నెక్ట్స్ సినిమాకు కూడా చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నాడు. బాహుబలి సినిమాతో భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన కథా రచయిత విజయేంద్ర ప్రసాధ్ అందించిన రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ గాథను మణికర్ణిక పేరుతో సినిమాగా తెరకెక్కించనున్నాడు. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తోంది. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ రోజు (గురువారం) కాశీలో ఎనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే యూనిట్ సభ్యులతో పాటు హీరోయిన్ కంగన కూడా కాశీ చేరుకుంది. సాయంత్రం దశాశ్వమేథ్ ఘాట్ లో జరగనున్న గంగ హారతిలో యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. తరువాత ప్రెస్ మీట్ లో సినిమా ఎనౌన్స్మెంట్ తో పాటు లక్ష్మీభాయ్ లుక్ లో కంగనా 20 అడుగుల పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ నిర్మాత కమల్ జైన్ భారీ బడ్జెట్ తో ఈ సినమాను నిర్మిస్తుండగా.. సక్సెస్ఫుల్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ ను సంగీతం అందిస్తున్నారు. ప్రసూన్ జోషి మాటలు పాటలు రాస్తున్నారు. మరాఠ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణీ లక్ష్మీభాయ్ 1828లో కాశీలోనే జన్మించింది. అందుకే సినిమా ఎనౌన్స్మెంట్ అక్కడే ప్లాన్ చేశారు చిత్రయూనిట్. -
తెలుగు సినిమా తర్వాత డైరెక్షన్?
ప్రస్తుతం కంగనా రనౌత్ గురించి రెండు వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకటి ఆమె క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ అనే సినిమా చేయనున్నారనే వార్త. రాణి లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని టాక్. ఈ సినిమా తర్వాత కంగనా డైరెక్షన్ చేయనున్నారన్నది మరో వార్త. ఈ రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో రానున్న రోజులు చెప్పేస్తాయ్. ఇదిలా ఉంటే.. గత బుధవారం కంగనా పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు తానే ఓ గిఫ్ట్ ఇచ్చుకున్నారు. ముంబైలోని ఓ ప్రముఖ ఏరియాలో మూడంతస్తుల బిల్డింగ్ కొన్నారట. దీన్ని పర్సనల్ ఆఫీస్‌లా మార్చాలనుకుంటున్నారని సమాచారం. బిల్డింగ్‌ని సౌకర్యవంతంగా మార్పించాక, తాను దర్శకత్వం వహించనున్న సినిమా కార్యక్రమాలను అక్కడ మొదలుపెట్టాలనుకుంటున్నారని బాలీవుడ్ భోగట్టా. -
బాలీవుడ్లో బ్లడ్డే!
బ్లడ్ రిలేషన్ ఉంటే కానీ బాలీవుడ్లో వర్కవుట్ అయ్యేట్టు కనిపించడం లేదు. హీరోలు, హీరోయిన్లు, విలన్లు, రైటర్లు, కొరియోగ్రాఫర్లు, కెమేరామేన్లు.. లిస్ట్ నెవర్ ఎండింగ్. బాలీవుడ్లో తెర మీద, తెర వెనకా, పక్కనా... అంతా బ్లడ్డే. రక్తం చిందిస్తున్నారనుకోకండి! మరి ఏం చిందిస్తున్నారు? బంధుప్రీతిని చిలకరిస్తున్నారు. దీంట్లో ఏమీ తప్పు లేదు. బంధువులుంటే మాత్రమే గొప్పవారు కాదు. కానీ అవకాశం మాత్రం ‘రిలేటీవ్’లీ ఈజీ.. ‘బ్యాగ్రౌండ్’ ఉంటే ఆ బలమే వేరు. ‘ఒక్క ఛాన్స్’ ఈజీగా వచ్చేస్తుంది. ప్రూవ్ చేసుకుంటే ‘స్టార్డమ్’ ఇట్టే వచ్చేస్తుంది. అందుకే ఇండస్ట్రీలో బంధువులున్నవాళ్లు అదృష్టవంతులు అంటుంటారు. ఇదే విషయాన్ని బాలీవుడ్ హాట్ గాళ్ కంగనా రనౌత్ పదే పదే అంటుంటుంది. డైరెక్ట్‌గా బాలీవుడ్ బడా నిర్మాత–దర్శకుడు కరణ్ జోహర్‌పై అతని షోలోనే నిర్మొహమాటంగా సెటైర్ కూడా వేసేసింది. ‘‘ఒక వేళ నా జీవితం ఆధారంగా సినిమా తీస్తే, అప్పుడు బయటివారు ఇండస్ట్రీకి రావడాన్ని భరించలేని బాలీవుడ్ పెద్దమనిషి పాత్రను నువ్వే చేయాల్సి ఉంటుంది. ‘నెపోటిజమ్ (బంధుప్రీతి) జెండా పట్టుకు తిరిగే వ్యక్తివి. మూవీ మాఫియా’’ అని ‘కాఫీ విత్ కరణ్’ షోలో కంగనా ఘాటుగా స్పందించింది. కరణ్ ఊరుకుంటారా? కంగనాకి గట్టి సమాధానమే చెప్పారు. ‘‘సొంత అభిప్రాయాలు ఉండటం తప్పు కాదు. కానీ, ఒకరి గురించి అభిప్రాయం చెప్పేటప్పుడు మాత్రం ఆలోచించాలి. బంధుప్రీతి జెండా పట్టుకు తిరిగేవాణ్ణి అని కంగనా నన్ను నిందించింది. అసలు బంధుప్రీతి జెండా పట్టుకు తిరగడం అనే వాక్యానికి తనకు అర్థం తెలుసో లేదో? నేనేమన్నా నా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా, బావమరుదులతో సినిమాలు చేస్తున్నానా? 15 మంది డైరెక్టర్లను పరిచయం చేశాను. వాళ్లకు ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదు. తరుణ్ మన్సుఖాని, పునీత్ మల్హోత్రా, శకున్ బత్రా, శశాంక్ ఖైతాన్.. ఇలా నేను పరిచయం చేసిన దర్శకులెవరూ పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవారు కాదే? ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ద్వారా నేను పరిచయం చేసిన వరుణ్ ధవాన్, ఆలియా భట్‌లకు బ్యాగ్రౌండ్ ఉన్న మాట నిజమే. కానీ, అదే సినిమా ద్వారా పరిచయం చేసిన సిద్ధార్థ్ మల్హోత్రా బయట నుంచి వచ్చిన వ్యక్తే కదా. ‘మూవీ మాఫియా’ అని కంగనా అనడానికి అర్థం ఏంటో తనకే తెలియాలి. నేను తనతో సినిమాలు చేయకపోతే అది మూవీ మాఫియానా? కంగనాతో సినిమా చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నాకుంటుంది. నా ‘కాఫీ విత్ కరణ్’లో కంగనా ఘాటుగా స్పందించింది. అది నా షో కాబట్టి, నేను అనుకుని ఉంటే తన మాటలను ఎడిట్ చేసి ఉండొచ్చు. కానీ, తన అభిప్రాయం చెప్పింది. తన మాటలను ప్రపంచానికి వినిపించాలనుకున్నా. అందుకే ఎడిట్ చేయలేదు’’ అన్నారు కరణ్. ఓ వివాదం చెలరేగడానికి ఈ మాత్రం చాలు. ఇప్పుడు బాల్ కంగనా, కరణ్‌ల కోర్ట్ నుంచి బయటికొచ్చేసింది. ఈ ఇద్దరి వ్యాఖ్యలకు ఇతర ప్రముఖులు స్పందించడం మొదలుపెట్టారు. కొంతమంది తారలు ‘బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం’ అంటున్నారు. కొంతమందేమో.. బయటివాళ్లకూ ఇక్కడ మంచి అవకాశాలు దక్కుతున్నాయంటున్నారు. అసలు బాలీవుడ్లో ‘ఫిల్మీ బ్యాగ్రౌండ్’, ‘నాన్ ఫిల్మీబ్యాగ్రౌండ్’కి చెందినవాళ్లెవరో తెలుసుకుందాం. ఎవరేమన్నారు? బంధుప్రీతి సహజమే ప్రతి ఒక్కరికీ బంధుప్రీతి అనేది సహజమే. మనం ఇష్టపడే వారికి సహాయం చేయాలనుకుంటాం. అది కుటుంబ సభ్యు లైనా, వేరేవాళ్లయినా కావచ్చు. ‘నెపోటిజమ్’ వివాదంలో నేను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. – హీరో ఆమిర్ ఖాన్ ప్రతిభ ఉంటే అవకాశాలు దక్కుతాయి బంధుప్రీతితో నాకు అవకాశాలు దూరమైన అనుభవాలు లేవు. నాకు బ్యాగ్రౌండ్ లేదు. కష్టపడితే ఇండస్ట్రీలో కొనసాగడం పెద్ద సమస్య కాదు. కంగనా ప్రతిదీ తనదే అన్నట్లు ఫీల్ అవుతుంది. అయితే అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండవు. బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. అయితే అది బయటివాళ్ల రాకకు ఆటంకం కాదనుకుంటున్నా. – హీరోయిన్ విద్యాబాలన్ బ్యాగ్రౌండ్ అవసరం లేదు టాలెంట్ ఉండి కష్టపడితే మనతో కలిసి పనిచేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. ఇందుకు బ్యాగ్రౌండ్ అవసరం లేదు. నన్ను లాంచ్ చేసిన ఆదిత్య చోప్రా అంటే గౌరవం. రణ్‌వీర్‌సింగ్, పరిణీతి చోప్రా, నేను ఇండస్ట్రీకి అవుట్సైడర్స్మే. నెపొటిజమ్ వల్ల నేను ఇబ్బంది పడిన సందర్భాలైతే ఇప్పటివరకూ లేవు. – అనుష్కా శర్మ ఎక్కడ ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి నాకు కంగనా గురించి పూర్తిగా తెలీదు. కరణ్ బాగా తెలుసు. ఇప్పుడు నేను స్పందిస్తే అవకాశవాదంగా ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. కంగనా స్త్రీవాదాన్ని బలంగా వాదిస్తుంది. ఆమె పాత్రలను ఎంపిక చేసుకునే విధానాన్ని నేను గౌరవిస్తాను. ‘కాఫీ విత్ కరణ్’ షోలో రెండు సార్లు పాల్గొన్నా. ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అవే మాట్లాడాలి. అందుకే ఆ షోలో చర్చించదగ్గ విషయాలనే మాట్లాడా. ఇతరులపై అభాండాలు వేయకుండా కూడా షో కంప్లీట్ చేయవచ్చు. – హీరోయిన్ సోనమ్ కపూర్ స్టార్ కిడ్ అయినా ప్రూవ్ చేసుకోవాల్సిందే బంధుప్రీతి వల్ల వారసులకు మొదటి అవకాశం సులభంగా వస్తుంది. ఆ తర్వాత వాళ్లు ప్రతిభను నిరూపించుకోవాలి. ఏం సాధించకుండా కనుమరుగైన వారసులు చాలామందే ఉన్నారు. మరి వాళ్ల గురించి ఎవ్వరూ నోరు మెదపరే? ప్రేక్షకులు యాక్టర్స్ నటన చూడడానికి మాత్రమే వస్తారు. అంతేగానీ ఆ యాక్టర్ కుంటుంబ గౌరవాన్ని చూసేందుకు కాదు. భట్ ఫ్యామిలీలో పుట్టడం నా చేతుల్లో లేదు. నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో నేను ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వలేదు. ఎంతో కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. – ఆలియా భట్ బంధుప్రీతి మెండుగానే ఉంది బాలీవుడ్లో బంధుప్రీతి మోతాదుకు మించే ఉంది. ప్రతిభ మీదే ఆధారపడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇక్కడ ఎవ్వరూ ప్రభుత్వ పరీక్షలు నిర్వహించడం లేదు. రాచరికం ఎప్పటినుంచో ఉంది. స్టార్ కిడ్స్‌కు రిలేషన్స్‌తో కాస్టింగ్ కాల్స్ వస్తాయి. అలాగని ఇండస్ట్రీ మొత్తం వాళ్లే లేరు. షారుక్ ఖాన్, ప్రియాంక, కంగనాలకు ఏ రిలేషన్స్ ఉన్నా యని ఇండస్ట్రీలో టాప్స్టార్లుగా ఉన్నారు? – హీరోయిన్ స్వర భాస్కర్ బ్లడ్ కాదు... ఫ్యామిలీ అండతో వస్తున్నవారే కాదు. ఎలాంటి అండ లేకుండా ప్రతిభనే నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి, సక్సెస్ అవుతున్నవాళ్లూ ఉన్నారు. ప్రతిభ ఉన్నోళ్లకు పరిచయాలు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్లు అవసరం లేదని షారుక్ ఖాన్, అక్షయ్‌కుమార్, జాన్ అబ్రహాం, ఇర్ఫాన్‌ఖాన్ వంటి స్టార్ హీరోలు నిరూపించారు. ప్రస్తుత స్టార్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా, విద్యాబాలన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, తాప్సీ, రాధికా ఆప్టే తదితరులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ దక్కించుకున్నవారే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్టార్స్ అయిన ప్రముఖులు మరెందరో ఉన్నారు. -
అవునా కంగనా?!
విశాల్ భరద్వాజ్ సినిమా ‘రంగూన్’ ఈ నెల 24న విడుదల అవుతోంది. అందులో కంగనా రనౌత్.. సైఫ్ అలీఖాన్ని, షాహిద్ కపూర్‌ని.. ఇద్దర్నీ ఒకేసారి ప్రేమిస్తుంది! ఎలా సాధ్యం ఏకకాలంలో ఇద్దర్ని ప్రేమించడం? ఎవరో ఒకరి మీదే కదా ప్రేమ ఉంటుంది. ఇద్దరి మీదో, ముగ్గురి మీదో ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది? మనకైతే.. ఇన్ని డౌట్స్ వస్తున్నాయి కానీ, కంగనాకు మాత్రం క్లారిటీ ఉంది. సినిమాలో.. సైఫ్‌కి కంగనా కావాలి. కంగనాకి సైఫ్ కావాలి. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేరింగ్‌తో ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడతారు. అతడిని ఆమె, అమెను అతడు కాపాడుకుంటూ ఉంటారు. ఆమెకు బాధ కలిగితే అతడు హర్ట్ అవుతాడు. అతడు బాధపడితే ఆమె హర్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంటుంది. లిప్ కిస్‌లు కూడా ఇచ్చుకుంటారు. ‘అయితే ఇదంతా లవ్ కాదు, బంధం మాత్రమే’ అంటుంది కంగనా.మరి, షాహిద్ కపూర్‌తో కంగనాకు ఉన్నదేమిటి? అదేనట ఒరిజినల్‌గా ప్రేమంటే!‘ప్రేమ తనకదే ఏ కారణం లేకుండానే పుడుతుంది. సహాయాల వల్లనో, కేరింగ్ కారణంగానో ప్రేమ పుట్టదు. ఒకవేళ పుట్టినా అది ప్రేమ కాదు. ప్రేమంటే.. మనల్ని మనకు కొత్తగా చూపించేది’ అంటోంది కంగనా! సో.. ప్రేమలో బంధం, బంధనం ఉండవని అనుకోవాలి.బంధం, బంధనం లేనివే ప్రేమ అనుకోవాలి... అవునా కంగనా? -
కాస్ట్లీ గురూ...
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె వార్తల్లో నిలవడం కామనే కదా? ఇందులో ప్రత్యేకత ఏంటి? అనుకునేరు. ఇప్పుడు నిలవడం ఓ ప్రత్యేకతే మరి. తన యోగా గురువు సూర్యనారాయణ సింగ్‌కు రెండు కోట్ల విలువైన ఫ్లాట్ గురుదక్షిణగా ఇచ్చి, బాలీవుడ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఈ బ్యూటీ. 18 ఏళ్ల కిందట జుహూ బీచ్‌లో జిమ్నాస్టిక్స్ నేర్పుతున్న సూర్యనారాయణ.. కంగనాను ఆకట్టుకున్నారు. అప్పటికి ఈ అమ్మడు బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టలేదు. అప్పడే ఆయన్ను తన యోగా గురువుగా స్వీకరించి, నాటి నుంచి నేటి వరకూ యోగా శిక్షణ తీసుకుంటున్నారు. తన నుంచి ఏమీ ఆశించకుండా, తనకోసం ఇంత చేస్తున్న గురువుకు దక్షిణగా ఏదైనా ఇవ్వాలని ఫిక్స్ అయిన ఈ భామ యోగా కేంద్ర నిర్వహణకు వీలుగా ఉండేందుకు రెండు కోట్లు విలువ చేసే రెండు పడక గదుల ఇల్లు బహుమానంగా ఇచ్చారట. అది కూడా సెలబ్రిటీలు, ధనవంతులు ఉండే ముబై లోని అంధేరీ ప్రాంతంలో. యోగా శిక్షణకు అనువుగా ఉండేలా విశాలమైన బాల్కనీతో పాటు సకల సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ రెడీ చేయించారట కంగనా. ఏదేమైనా కంగనా గురుభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. -
తమిళ రాణి తమన్నా! మరి తెలుగులో...?
‘‘తమిళంలో తమన్నా.. మలయాళంలో అమలాపాల్.. కన్నడంలో పరుల్ యాదవ్... ‘క్వీన్’గా సందడి చేయనున్నారు. తెలుగు ‘క్వీన్’ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు’’ అన్నారు త్యాగరాజన్. హిందీలో కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ సౌతిండియా రీమేక్ హక్కులను తమిళ నటుడు-దర్శక-నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా జి. రవికుమార్ దర్శకత్వంలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న ‘రోజ్ గార్డెన్’లో ఓ కాశ్మీర్ టీవీ ఛానల్ అధినేతగా త్యాగరాజన్ కీలక పాత్ర చేస్తున్నారు. గతంలో ‘అంతిమ తీర్పు’, ‘మగాడు’, ‘స్టేట్ రౌడీ’ల్లో నటించిన ఆయన మూడు దశాబ్దాల తర్వాత నటిస్తున్న తెలుగు చిత్రమిది. ప్రస్తుతం శంషాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. మీడియాతో త్యాగరాజన్ మాట్లాడుతూ - ‘‘తెలుగు ‘క్వీన్’ రీమేక్‌కి అనీశ్ కురువిల్లా... తమిళ, మలయాళ చిత్రాలకు రేవతి, కన్నడ చిత్రానికి ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహిస్తారు. నాలుగు భాషల్లోనూ నేనే నిర్మిస్తా. నాలుగు భాషల్లోనూ రెండో హీరోయిన్ అమీ జాక్సన్. ఇక, మా అబ్బాయి ప్రశాంత్ హీరోగా నా స్వీయ దర్శకత్వంలో ఓ హిందీ సినిమా నిర్మిస్తున్నా. త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేస్తాడు’’ అని తెలిపారు. -
రాళ్లల్లో.. రప్పల్లో..!
‘రాళ్లల్లో.. ఇసుకల్లో రాశాము ఇద్దరు పేర్లు...’ అంటూ బాలకృష్ణ, రజనీ పాడుకున్న డ్యూయెట్ గుర్తుండే ఉంటుంది. ‘రంగూన్’ సినిమా షూటింగ్ సమయంలో కంగనా రనౌత్ డ్యుయెట్ మినహా రాళ్లల్లో, రప్పల్లో చాలా పనులే చేశారు. చేసే పాత్ర నచ్చిందంటే చాలు, ఎలాంటి త్యాగాలకైనా ఈ హాట్ గాళ్ రెడీ అయిపోతారు. అందుకు ‘రంగూన్’ సినిమా ఓ ఉదాహరణ. ఈ సినిమా కోసం అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. రాళ్లూ రప్పలూ తప్ప పూరి గుడిసె కూడా లేని ప్రాంతంలో చిత్రీకరణ జరిపినప్పుడు కంగనా చాలా ఇబ్బంది పడ్డారట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం కదా అని ఎక్కడికెళితే అక్కడ ఇంట్లో ఉన్నట్లే అన్ని సౌకర్యాలూ ఉండాలనుకుంటే కుదరదు. సర్దుకుపోవాలి. ‘రంగూన్’ షూటింగ్ అప్పుడు లొకేషన్లో నాకు వ్యానిటీ వ్యాన్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. దాంతో పెద్ద పెద్ద రాళ్లు చూసుకుని, వాటి వెనకాల బట్టలు మార్చుకునేదాన్ని. రాళ్లు కనపడని చోట యూనిట్ సభ్యులందరూ ఒక దడిలా నిలబడేవాళ్లు. నేను కాస్ట్యూమ్స్ వేసుకునేదాన్ని. అంతెందుకండి.. ప్రకృతి అవసరానికి కూడా ఇబ్బంది అయ్యేది. రాళ్లల్లో.. రప్పల్లోనే. తప్పదు. అడ్జస్ట్ కావాల్సిందే. కాదు కూడదు.. నాకు వ్యానిటీ వ్యాన్ కావాల్సిందేనని మొండిగా వాదిస్తే.. నిర్మాత మాత్రం ఏం చేయగలుగుతారు? అలాంటి లొకేషన్లో ఎవరూ ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి కంగనాకి తలబిరుసుతనం ఎక్కువ అనే పేరుంది. అయితే.. షూటింగ్ విషయంలో మాత్రం ఇబ్బందిపెట్టరనే పేరు కూడా సంపాదించుకున్నారు. -
వైభవంగా సినీ అవార్డుల ప్రదానం
పురస్కారాలు అందుకున్న అమితాబ్, కంగనా, రాజమౌళి ‘ఫాల్కే’ అందుకున్న మనోజ్‌కుమార్ న్యూఢిల్లీ: 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం కన్నులపండువగా జరిగింది. మంగళవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ ఉత్తమనటుడు పురస్కారాన్ని అమితాబ్‌బచ్చన్ (పికూ చిత్రం), ఉత్తమనటి అవార్డును కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) అందుకున్నారు. వీరికి రజత కమలంతోపాటు రూ.50 వేల చొప్పుననగదును అందించారు. అలాగే దేశ సినీ చరిత్రలో సంచలనం సృష్టించి ఈ ఏటి ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి చిత్రానికిగాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని పురస్కారం అందుకున్నారు.స్వర్ణకమలం, ప్రశంసాపత్రంతోపాటు రూ.2.5 లక్షల నగదును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.దేశ సినీ పురస్కారాల్లో అత్యున్నతమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ను బాలీవుడ్ అలనాటి నటుడు మనోజ్ కుమార్ స్వీకరించారు. వీల్‌చైర్‌లో వచ్చిన ఆయన స్వర్ణ కమలంతోపాటు రూ.10 లక్షల నగదును అందుకున్నారు. కాగా, తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘కంచె’ చిత్రానికి దర్శకుడు క్రిష్ అవార్డు అందుకున్నారు. హాలీవుడ్‌పై ఆసక్తి లేదు.. రాజమౌళి: బాహుబలిఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సొంతం చేసుకుంది. హాలీవుడ్ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్‌తో బాహుబలిని చిత్రించినప్పటికీ హాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదని రాజమౌళి చెప్పారు. తనకు ఇక్కడ సినిమాలు తీయడమే సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. అశోకా, అక్బర్, మహారానా ప్రతాప్ లాంటి రాజుల కథలతో సినిమాలు చేయాలని ఆసక్తి ఉందని తెలిపారు. -
కంగనతో పెట్టుకుంటే అంతేనా?
గాసిప్ కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. కొంత మంది కంగనా రనౌత్‌ది తప్పంటే, మరికొందరు హృతిక్‌దే తప్పని వాదిస్తున్నారు. ఈ మాజీ ప్రేమికుల తాజా గొడవ రోజు రోజుకీ ముదురు పాకాన పడుతోంది. ఇప్పుడు ఈ గొడవలోకి నటుడు అధ్యయన్ సుమన్ ఎంటరయ్యాడు. ఇతగాడికీ ఈ గొడవకీ లింకేంటి అనుకుంటున్నారా? అధ్యయన్ సుమన్ కొన్నాళ్లు కంగనాతో ప్రేమాయణం సాగించాడు. ఈ ఇద్దరూ కలిసి ‘రాజ్’ అనే సినిమాలో కూడా న టించారు. ఆ తర్వాత ప్రేమకు టాటా చెప్పేసుకుని, ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అప్పట్నుంచీ కంగనాపై అధ్యయన్కి అక్కసు ఉందేమో ఇప్పుడు తీర్చేసుకున్నారు. అసలు కంగనా మామూలు అమ్మాయి కాదనీ, తనే హృతిక్ వెంటపడి ఉంటుందని అధ్యయన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అది మాత్రమే కాదు.. తామిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు తనను కొట్టి హింసించేదని కూడా దిమ్మ తిరిగిపోయే మరో స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంకా.. కంగన గురించి బోల్డన్ని రహస్యాలను విప్పేశాడు అధ్యయన్. సరే... వీటి సంగతెలా ఉన్నా కంగన చేతబడులను నమ్ముతుందని కూడా అన్నాడు. దాంతో కంగనకు ఆమడ దూరం మెయిన్టైన్ చేస్తే మంచిదని ఇరుగూ పొరుగూ అనుకుంటున్నారట. అమ్మడితో పెట్టుకుంటే చేతబడే అని బాలీవుడ్లో జోకులు కూడా వేసుకుంటున్నారని సమాచారం. ఇంతకీ.. అధ్యయన్ కావాలని అలా అన్నాడా? లేక కంగన నిజంగానే ఆ బ్లాక్ మేజిక్‌ని నమ్ముతుందా? -
57 సర్జరీలు... భరించలేని బాధ!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధాకరమైన సంఘటనలు ఉంటాయి. కొన్ని బాధలు తాత్కాలికం. కొన్ని మాత్రం జీవితాంతం వెంటాడతాయి. ఆ బాధ తాలూకు ఆనవాళ్లు మిగిలిపోతాయి. కంగనా రనౌత్ అక్క రంగోలి జీవితంలో అలా ఆనవాళ్లు మిగిల్చిన సంఘటన ఒకటి ఉంది. పెళ్లి కుదిరాక ఆమె మీద ఎవరో యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడి కారణంగా ఒక కంటికి 90 శాతం చూపు పోయింది. ఒక చెవి పని చేయడం మానేసింది. ఇక... చక్కని ముఖారవిందం కాలిపోయింది. మరోవైపు ఆహారం వెళ్ళే నాళం, శ్వాసకోశం కూడా దెబ్బ తిన్నాయి. దాంతో రంగోలి నరకం అనుభవించారు. పాడైపోయిన మొహాన్ని కొంతలో కొంత బాగు చేయడానికి 57 సర్జరీలు చేశారు. ఆ చర్మాన్ని తొడల దగ్గర్నుంచి తీసేవారు. మొత్తం మీద ప్రత్యక్ష నరకం చూశారామె. దేవుడు ఆ విధంగా కొంత పెయిన్ ఇచ్చినా.. ఎవరితో అయితే పెళ్లి కుదిరిందో ఆ యువకుడే రంగోలీని పెళ్లి చేసుకోవడంతో ఆమె జీవితం ఆనందంగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్లో జీవిత చరిత్రల నేపథ్యంలో సినిమాలు రావడం ఎక్కువైంది. క్రీడాకారులు, స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. కానీ, కంగన మాత్రం ‘మా అక్క జీవితానికి మించిన ఇన్స్పిరేషన్ లేదు’ అంటున్నారు. అందుకే, రంగోలీ జీవితం ఆధారంగా సినిమా చేయాలనుకుంటున్నారామె. ఈ విషయం గురించి కంగన మాట్లాడుతూ - ‘‘నా జీవితం కన్నా మా అక్క జీవితం చాలా బాగుంది. మా బావ తనను ఎంతగానో ప్రేమిస్తాడు. నాకు అలాంటి ప్రేమికుడు లేడు. మా అక్క జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టే, తన జీవితంతో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ, తన జీవితంతో సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుందని మా అక్క అంటోంది. నేను జయాపజయాల గురించి ఆలోచించడం లేదు. స్ఫూర్తిదాయకమైన ఒక సినిమా చేయాలన్నదే నా ఆశయం’’ అని చెప్పారు. -
కోలీవుడ్‌కు మళ్లీ క్వీన్
హిందీ చిత్రం క్వీన్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కోలీవుడ్ చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం.ఈ బ్యూటీకి కోలీవుడ్ కొత్తేమీ కాదు. చాలా కాలం క్రితం ధామ్ ధూమ్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేసింది.అయితే అప్పటి ఆమె స్థాయి వేరు ఇప్పటి క్రేజ్ వేరు. ప్రస్తుతం కంగనా రనౌత్ బాలీవుడ్లో ప్రముఖ నాయకిగా వెలుగొందుతోంది. అమ్మాయిలంతా మడ్డీ అంటూ అభిమానం కురిపించే నటుడు మాధవన్ నటించిన తనూ వెడ్స్ మను చిత్రం హిందీలో మంచి విజయం సాధించింది. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం సక్సెస్ అయ్యింది. ఈ రెండు చిత్రాల్లోనూ మాధవన్‌కు జంటగా కంగనా రనౌత్ నటించింది. ఇప్పుడు తనూ వెడ్స్ మను చిత్రానికి పార్టు-3కి కూడా తెరకెక్కడానికి రెడీ అవుతోంది. పార్టు-1,2 చిత్రాలను రూపొందించిన ఆనంద్ ఎల్.రాయ్‌నే పార్టుకు దర్శకత్వం వహించనున్నారు. తనూ వెడ్స్ మను చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతే కాదు దాని వరిజినల్లో నటించిన కంగనా రౌనౌత్నే తమిళంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సంచలన నటి రెండో సారి కోలీవుడ్‌కు రావడానికి సిద్ధం అవుతుందా? అన్నదే చర్చనీయాంశమైన విషయం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
నాకు ఇంగ్లీష్ ఒక్కముక్క రాదు!
ఇవాళ దేశమంతటా చెప్పుకుంటున్న హీరోయిన్లలో రింగు రింగుల జుట్టు కంగనా రనౌత్ ఒకరు. ప్రస్తుతం ఆమెను అందరూ హిందీ సినీసీమకు ‘క్వీన్’ అంటున్నారు. కానీ, ఈ సక్సెస్ సాధించడం ఆమెకు అంత సులభమేమీ కాలేదు. ఆ సంగతే చెబుతూ, ‘‘నా జీవితమేమీ అంత హాయిగా, జానపదకథలా సాగిపోలేదు. దాదాపు పదేళ్ళ పాటు నానా కష్టాలు పడ్డాను. ఇవాళ నేను ఉంటున్నదానికీ, అప్పటికీ సంబంధమే లేదంటే నమ్మండి’’ అని కంగనా రనౌత్ అన్నారు. ‘‘అప్పట్లో నాకు అస్సలు ఒక్కముక్క కూడా ఇంగ్లీష్ రాదు. ఆ మాట చెబితే - ఇంగ్లండ్‌లోని జనమైనా సానుభూతితో అర్థం చేసుకుంటారేమో కానీ, ముంబయ్‌లో పరిస్థితి వేరు. మీకు ఇంగ్లీష్ రాదంటే, ‘ఆమె హిందీ సినిమాల్లో ఇంకెలా పనిచేస్తుంది’ అని అంటారు. కానీ, వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డాను. నా మీద నాకున్న అవగాహన మారకపోవడం వల్లే నేనివాళ ఈ స్థితిలో ఉన్నా’’ అని కంగన చెప్పుకొచ్చారు. ఉత్తరాదిలో ఒక చిన్న పట్నంలో పెరిగిన ఈ అభినయ తారకు మొదటి నుంచీ ఆడవాళ్ళ పట్ల మన దేశంలో ఉన్న అభిప్రాయంతో విభేదాలున్నాయి. ‘‘ఆడపిల్ల అంటే, ఎర్రగా, బుర్రగా, అందంగా ఉండాలనీ, అలా పెరగాలనీ, అందుకు తగ్గ జీవిత భాగస్వామిని పొందితే చాలనీ పెద్దలు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది చెప్పుకోలేనంత బాధ. అందుకే, మన దేశపు తల్లితండ్రులు కోరుకొనే తరహా పిల్లను కాదు నేను’’ అని కంగన చెప్పుకొచ్చారు. మొత్తానికి, కంగన మాటల్లో నిజం ఎంత ఉందో, నివ్వెరపరిచే అంశాలూ అన్నే ఉన్నాయి కదూ! -
అతను పంపినవి డిలిట్ చేసేశాడు!
చినికి చినికి గాలివానగా మారినట్లు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం అలానే మారింది. ‘క్రిష్-3’లో నటించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్త ప్రచారమైంది. అయితే, ఆ సమయంలో తన భార్య సుజానే ఖాన్ నుంచి విడిపోవడానికి హృతిక్ ఇష్టపడకపోవడంతో కంగన, అతనికి దూరమయ్యారట. ఇటు హృతిక్ కానీ, అటు కంగన కానీ తమ గురించి వచ్చిన వార్తలకు అప్పట్లో స్పందించలేదు. అంత సెలైంట్‌గా ఉండిపోయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా రచ్చ... రచ్చ చేసుకుంటున్నారు. ఇద్దరూ పరస్పరంలీగల్ నోటీసులు పంపించుకునే దాకా వివాదం ముదిరిపోయింది. ఆ నోటీసుల్లో ఇద్దరూ చేసిన ఆరోపణల విషయానికొస్తే... హృతిక్‌కి దీటుగా సమాధానం చెప్పాలనుకున్న కంగనా రనౌత్ తన లాయర్ ద్వారా జవాబు నోటీసు పంపించారు. అందులో ఆమె కూడా ఘాటుగానే స్పందించారు. కంగన పంపించినదానిలో ఏముందంటే.. ♦ నా క్లయింట్ (కంగన) ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ కోసం మీ (హృతిక్ లాయర్ని ఉద్దేశించి) క్లయింట్ పేరుని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చారామె. ఈ నిజాన్ని ఒప్పుకుని, మీ క్లయింట్ నోటీసుని ఉపసంహరించుకోవాలి. ఆధారం లేని ఆరోపణలు, మితిమీరిన నిందలు చేయడం తగదు. ♦ నా క్లయింట్ అమాంతంగా ఆకర్షితురాలు కావడానికి టీనేజర్ కాదు. ఇద్దరి మధ్య ఏమేం జరిగాయో అవన్నీ ఇద్దరి సమ్మతంతోనే జరిగాయి. మీ క్లయింట్ అండదండలు నా క్లయింట్‌కి ఉన్నాయనడం ఆమోదనీయం కాదు. భార్యతో విడాకుల వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో మీ క్లయింటే ఒక కొత్త ఇ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసి, నా క్లయింట్‌తో కమ్యూనికేట్ కావాలనుకున్నారు. అలా చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలనుకున్నారు. చివరికి నా క్లయింట్ ఐడీని హ్యాక్ చేసి, ఆయన పంపించిన మెయిల్స్‌ను తొలగించేశారు. నా క్లయింట్ నుంచి వచ్చే ఇ-మెయి ల్స్‌ని నిరాకరిస్తున్నట్లు మీ క్లయింట్ నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు. నా క్లయింట్‌ను ‘బ్లాక్’ చేసే ప్రయత్నమూ చేయలేదు. ఇ- మెయిల్స్ మీ క్లయింట్ ఆమోదంతోనే అందాయనే ఋజువు అది. ♦ మీ క్లయింట్ (హృతిక్) తనదైన ఊహల్లో బతుకుతున్నారు. అందులో భాగంగానే తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటు న్నారు. ఇంటర్వ్యూలో నా క్లయింట్ ‘సిల్లీ ఎక్స్‌లు’ అని పేర్కొన్నారే తప్ప, మీ క్లయింట్ పేరెక్కడా ప్రస్తావించలేదు. ఆ మాట తనను ఉద్దేశించినదే అని మీ క్లయింటే తనకు ఆపాదించుకున్నారు. మీ క్లయింట్ ఆపాదించి నట్లు నా క్లయింట్ ‘యాస్పర్జెర్’తో బాధపడట్లేదు. ఆమెకు మానసిక రుగ్మత లేదు. -
రోజుకు 50 మెయిల్స్ పంపింది!
చినికి చినికి గాలివానగా మారినట్లు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం అలానే మారింది. ‘క్రిష్-3’లో నటించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్త ప్రచారమైంది. అయితే, ఆ సమయంలో తన భార్య సుజానే ఖాన్ నుంచి విడిపోవడానికి హృతిక్ ఇష్టపడకపోవడంతో కంగన, అతనికి దూరమయ్యారట. ఇటు హృతిక్ కానీ, అటు కంగన కానీ తమ గురించి వచ్చిన వార్తలకు అప్పట్లో స్పందించలేదు. అంత సెలైంట్‌గా ఉండిపోయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా రచ్చ... రచ్చ చేసుకుంటున్నారు. ఇద్దరూ పరస్పరంలీగల్ నోటీసులు పంపించుకునే దాకా వివాదం ముదిరిపోయింది. ఆ నోటీసుల్లో ఇద్దరూ చేసిన ఆరోపణల విషయానికొస్తే... ♦ ‘‘మన దృష్టిని ఆకర్షించడానికి ‘సిల్లీ ఎక్స్‌లు’ లేనిపోనివి ప్రచారం చేస్తారు?’’ అని రెండు నెలల క్రితం ప్రచురితమైన ఓ ఇంటర్వ్యూలో కంగన అన్నారు. ఆ మాట హృతిక్‌ను ఆగ్రహానికి గురి చేసింది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కంగనతో చట్టపరంగా డీల్ చేయాలనుకున్నారు. అంతే... కంగనా రనౌత్‌కు లాయర్ నోటీసు పంపించారు. ఆ నోటీసులో ఏముందంటే... ♦ కొంతకాలంగా ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా హృతిక్కీ, మీకూ (కంగన) మధ్య ఏదో ఉందని సంకేతం అందేలా మాట్లాడుతున్నారు. మీకు, తనకూ మధ్య ఏమీ లేదనీ, తనను అవమానాల పాలు చేయడానికీ, పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నా రనీ నా క్లయింట్ అంటున్నారు. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, హృతి క్కీ, మీకూ మధ్య ఏమీ లేదని బాహాటంగా స్పష్టం చేయాలి. ♦ ‘క్వీన్’ సినిమాలో మీరు అద్భుతంగా నటించారంటూ హృతిక్ నుంచి మీకు ఇ-మెయిల్ వచ్చిందంటూ కరణ్ జోహార్ (దర్శక- నిర్మాత) బర్త్‌డే పార్టీలో మీరు హృతిక్‌కి ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు హృతిక్ అది తన ఇ-మెయిల్ కాదనీ, తన అసలైన మెయిల్ ఐడీని మీకిచ్చారు. అంతకు ముందు మీరు పేర్కొన్న ఐడీ తనది కాదని అప్పట్లో ఆయన సిటీ పోలీసుల ‘సైబర్ సెల్’కి ఫిర్యాదు చేశారు. ఇక... హృతిక్ అసలు మెయిల్ ఐడీ తెలుసు కున్న మీరు అప్పట్నుంచీ ఆయనకు కుప్పలు తెప్పలుగా మెయి ల్స్ పంపారు. మొత్తం 1,439 మెయిల్స్ మీ నుంచి వచ్చాయి. రోజుకి 50 మెయిల్స్ పంపారని నా క్లయింట్ పేర్కొన్నారు. వాటిని పట్టించుకోకపోయినా ఆయన మానసిక ఒత్తిడికి గుర య్యారు. మెయిల్స్ పంపడమే కాక, నా క్లయింట్‌తో మీకు ఎఫైర్ ఉందని ప్రచారం చేశారు. పైగా ‘సిల్లీ ఎక్స్’ అని పేర్కొన్నారు. ♦ ‘క్రిష్ 3’ షూటింగ్ అప్పుడు మద్యం మత్తులో మీరు రచ్చ చేసి నప్పుడు మీ సిస్టర్ రంగోలీ క్షమాపణలు చెప్పడంతో పాటు, మీరు ‘యాస్పర్జెర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని పేర్కొన్నారని నా క్లయింట్ చెప్పారు. మీలోని ఆ లోపాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమె కోరుకున్నారు. ఇప్పటివరకూ నా క్లయింట్ ఆ మాట మీద నిలబడ్డారు. -
ఫ్యాషన్ కు సీక్వెల్
ఫ్యాషన్ రంగంలో చీకటి కోణాలను తెరపై ఆవిష్కరించిన చిత్రం ‘ఫ్యాషన్’. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కథానాయికలుగా నటించిన ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్‌లకు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇప్పుడీ సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే సన్నాహాల్లో మధుర్ ఉన్నారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో ప్రధాన పాత్రకు ఓ టాప్ హీరోయిన్ను తీసుకుంటున్నారని సమాచారం. ఈ మధ్య కాలంలో ఆయన రూపొందించిన ‘హీరోయిన్’, ‘క్యాలెండర్ గాళ్స్’ చిత్రాలు నిరాశ పరచడంతో మధుర్ ఈ సీక్వెల్ మీదే ఆశలు పెట్టుకున్నారు. -
వాళ్ల కంటే ఆమెకే ఎక్కువ!
‘‘హీరోల కన్నా మేమేం తీసిపోయాం? చెప్పాలంటే వాళ్లకన్నా మాకే ఎక్కువ పారితోషికం ఇవ్వాలి. లేదంటే ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి’’ అని హాలీవుడ్లో జెన్నిఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సెన్‌ల నుంచి బాలీవుడ్లో దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వరకూ అందరూ ముక్త కంఠంతో చాలా కాలంగా అంటున్న మాట ఇది. హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సెన్‌లు తమ మాట నెగ్గించుకుని ఇప్పుడు హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో కంగనా రనౌత్ వంతు వచ్చింది. హిందీ రంగంలో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ఉన్న కంగనా రనౌత్ తాజా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగూన్’. విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రం కోసం కంగనా ఏకంగా రూ.10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఇందులో విశేషమేమిటంటే సైఫ్, షాహిద్‌లకు ఒక్కొక్కొరికి రూ.5 కోట్ల మాత్రమే దక్కాయట. కంగనా రనౌత్ ఒక్కరికే రూ. 10 కోట్లు పారితోషికం ముట్టజెప్పడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
85 ఏళ్ల వృద్ధురాలిగానూ!
గాసిప్ తెరపై అందాలను ఒలికిస్తూ, గ్లామరస్‌గా చేయాల్సిన సమయంలో లేటు వయసు పాత్రలు చేయాలంటే చాలా మంది కథానాయికలు ‘అయ్య బాబోయ్’ అంటారు. కానీ పాత్రానుగుణంగా తమను తాము మలుచుకోవడానికి ఎంతకైనా సిద్ధపడే హీరోయిన్లు అతి కొద్ది మందే. వాళ్లలో కంగనా రనౌత్ ఒకరు. ఛాలెంజింగ్ రోల్స్‌ను అవలీలగా చేయడంలో ఆమెకు ఆమే సాటి. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగూన్’ చిత్రంలో చిత్రం కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారామె. తాజాగా మరో చిత్రంలో 85 ఏళ్ల వృద్ధురాలిగా నటించడానికి సుముఖత వ్యక్తం చేశారట. ‘మిస్టర్ ఇండియా’, ‘పానీ’, ‘బండిట్ క్వీన్’ లాంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన నటుడు శేఖర్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. దీని గురించి కంగన మాట్లాడుతూ-‘‘ కథ నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది. అన్నీ కుదిరితే ఆ పాత్ర కచ్చితంగా చేస్తాను. ఇది వరకు వయసు మళ్లిన పాత్రలు చేయాలన్న ఆలోచన ఉండేది కాదు. కానీ ఇటీవలే ‘అమోర్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ విషయంలో నా దృక్పథాన్ని మార్చింది. ముసలివాళ్ల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. నా హృదయాన్ని కదిలించిన సినిమా ఇది. ఆ ప్రేరణతోనే శేఖర్ సార్ ఈ పాత్ర గురించి చెప్పగానే ఓకే చెప్పాను’’ అని అన్నారు. -
కంగనా రనౌత్ ఓవర్ యాక్షన్
స్టార్డమ్ కే సైడ్ ఎఫెక్ట్స్! ఆ మధ్య ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ అని హిందీలో ఓ సినిమా వచ్చింది. పెళ్లయ్యాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఒక్క పెళ్లి అనే కాదు... ప్రేమలో పడితే కూడా ఓ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ్. శరీరం జీర్ణించుకోలేని తిండి తింటే, సైడ్ ఎఫెక్ట్స్ కామన్. అలాగే మాంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ హఠాత్తుగా మొదలవుతాయ్. అప్పటివరకూ మామూలుగా ఉన్నవాళ్లు సక్సెస్ తర్వాత విచిత్రంగా ప్రవర్తించేస్తారు. హఠాత్తుగా వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇతరులను ఎఫెక్ట్ చేస్తుంటాయ్. ఇప్పుడు బాలీవుడ్లో తన సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇతరులను తెగ ఇబ్బందిపెట్టేస్తున్నారట హీరోయిన్ కంగనా రనౌత్. అసలే కంగన అంటే చాలా కంగాళీ మనిషి అనే పేరుంది. ఎదుటి వ్యక్తి బాధపడతారేమోనని కూడా ఆలోచించకుండా ఏది అనిపిస్తే, అది మాట్లాడటం, ఎలా అనిపిస్తే అలా ప్రవర్తించడం కంగన స్టయిల్. ఇక, ఇప్పుడు సక్సెస్ తోడయ్యింది కాబట్టి, ఈవిడగారి ఆగడాలు హద్దులు దాటాయని చెప్పుకుంటున్నారు. ఇంతకీ కంగన ఏమైనా పదుల సంఖ్యలో విజయాలు చవిచూశారా? అంటే అదీ లేదు. ఓ నాలుగు విజయాలు చూశారు. ఆ మాత్రం దానికే ఇంత మిడిసిపడితే ఎలా? అని ఈవిడగారి సైడ్ ఎఫెక్ట్స్‌కి బలైనవాళ్లు అంటున్నారు. అంతలా కంగన ఏం చేస్తున్నారు? ‘తను వెడ్స్ మను, క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్’ విజయాలతో కంగనా రనౌత్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. దాన్నలా కొనసాగించాలంటే మంచి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నారామె. ఈ క్రమంలో కథ, తన పాత్ర గురించి మాత్రమే కాకుండా... కథా చర్చల్లో కూడా పాల్గొంటానని కంగన మొండిపట్టు పడుతున్నారట. పోన్లే అని రమ్మంటే.. కథలో ఏవేవో మార్పులు చెబుతున్నారట. చెయ్యకపోతే హీరోయిన్‌గారు అలుగుతారేమోనని టెన్షన్. మార్కెట్ ఉన్న హీరోయిన్‌తో సినిమా తీస్తే, లాభాలు చవిచూడొచ్చన్న ఆశ నిర్మాతకు ఉంటుంది కదా. అందుకని, కాదనకుండా ఆమె చెప్పిన మార్పుల్లో కొన్ని చేస్తున్నారట. ఓ సినిమా ప్రారంభమయ్యాక కంగనా రనౌత్ పెట్టే ఇబ్బందులు మామూలుగా ఉండవట. షూటింగ్స్‌కు సరిగ్గా హాజరు కారట. అందుకు నిదర్శనం గత ఏడాది విడుదలైన ‘ఉంగ్లీ’. ఈ చిత్రం షూటింగ్‌కి అరగంట, గంటా కాదు.. ఏకంగా మూడు, నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చేవారట. అది మాత్రమే కాకుండా తొలి ప్రచార చిత్రం తనకు నచ్చకపోవడంతో ప్రచార కార్యక్రమాలకు సహకరించలేదట. ‘వేరే సినిమాలతో బిజీగా ఉన్నా... తేదీల్లేవ్’ అని చెప్పి, తప్పించుకున్నారట. కంగనా రనౌత్‌కు మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం ఉందట. అడపా దడపా కథలు, కవితలు రాసుకుంటుంటారని సమాచారం. చివరికి తాను నటించే చిత్రాలకు సంభాషణలు రాసే అవకాశం ఇవ్వమని దర్శక, నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ‘ఇప్పుడొద్దులేమ్మా.. మరోసారి చూద్దాం’ అని కంగనకు నచ్చజెప్పడానికి వాళ్లు చాలా ట్రిక్కులే చేయాల్సి వస్తోందట. ‘ఐ లవ్ న్యూ ఇయర్’ అనే చిత్ర నిర్మాతలకు ఈ మధ్య కంగన చాలా చుక్కలే చూపించారు. సన్నీ డియోల్, కంగన జంటగా భూషణ్‌కుమార్, కృష్ణకుమార్ నిర్మించిన ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. ఏవో కొన్ని సమస్యలతో వాళ్లు విడుదల చేసుకోలేకపోయారు. ఇప్పుడు కంగనకు మార్కెట్ ఉంది కాబట్టి, విడుదల చేస్తే కొంతలో కొంత సేఫ్ అవ్వొచ్చన్నది నిర్మాతల తాపత్రయం. అందుకే గత శుక్రవారం విడుదల చేశారు. ఎప్పుడో తీసిన ఆ సినిమా ఇప్పుడు విడుదలైతే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన కంగనా రనౌత్ వాళ్ల మీద కేసు పెట్టి, సినిమా విడుదలను అడ్డుకుందామన్నా కుదర్లేదు. సినిమా విడుదలైంది. ఆమె ఊహించినట్లే జరిగింది. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అసలు కంగన కెరీర్లో ఇలాంటి సినిమా కూడా ఉందా? అని చూసినవాళ్ల మాట. పారితోషికం విషయంలో అయితే, నిర్మాతలకు ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వడం లేదట. ఆరు కోట్ల రూపాయలకు అరకోటి తగ్గినా, ‘ఊహూ..’ అంటున్నారట. పెద్ద నిర్మాతలని లేదు.. పెద్ద దర్శకులని లేదు... ఎవరినీ లెక్క చేయడం లేదని సమాచారం. ఆ రేంజ్లో సక్సెస్ కంగన నెత్తికెక్కిందని మాట్లాడుకుంటున్నారు. సక్సెస్‌లో ఉన్నంతవరకూ ఫరవాలేదు.. కానీ, ఒక్క ఫ్లాప్ పడిందా? ఖేల్ ఖతమ్... అని మాట్లాడుకుంటున్నారు. -
వాళ్లున్నారే... భలే కుళ్లుబోతులు!
గాసిప్ ‘క్వీన్’, ‘తనూ వెడ్స్ మనూ’ సినిమాలతో కంగనా రనౌత్ దశ తిరిగింది. ఒకప్పుడు ఆమెను పట్టించుకోని వాళ్లు, చిన్నచూపు చూసిన వాళ్లు కూడా ఇప్పుడు సందర్భం కలిపించుకొని మరీ కంగనాను పొగుడుతున్నారు. అయితే అలాంటివి కంగనా చెవికెక్కించుకుందో లేదో తెలియదు. ముక్కుసూటిగా మాట్లాడుతుందని కంగనాకు పేరు. ఎన్నో సార్లు ఈ విషయం రుజువైంది. ‘‘మిమ్మల్ని చూసి కుళ్లుకునే వాళ్లు ఉన్నారా?’’ అనే ప్రశ్నకు- ‘‘లేకేం... చాలామంది ఉన్నారు... నేను అంటే ఎక్కడ లేని కుళ్లు వాళ్లకి...’’ అని సమాధానం చెప్పింది. ఒక ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కంగనా ఆ మాట అన్నదని, అదేమీ కాదు... తన గురించి తేలిగ్గా మాట్లాడిన ఒక ప్రముఖ హీరో గురించి మాట్లాడిందని... ఇలా ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్లపైనే తన కోపాన్ని చాటుకుందని అత్యధికులు అంటున్నారు. నిజాలు మనకేం ఎరుక? కంగనాకే ఎరుక! -
నిస్సాన్ మైక్రా.. లిమిటెడ్ ఎడిషన్
నిస్సాన్ ఇండియా కంపెనీ మైక్రా మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ మైక్రా ఎక్స్-షిఫ్ట్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఆవిష్కరిస్తున్న ప్రముఖ హిందీ సినిమా నటి కంగనా రనౌత్. అంతర్జాతీయంగా ఈ మైక్రా కారును మార్కెట్లోకి తెచ్చి ఐదేళ్లైన సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని, 750 కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఈ కంపెనీ మైక్రా సీవీటీ ఆటోమేటిక్ హ్యాచ్‌బాక్ వేరియంట్(ధరలు రూ.6.39-6.67 లక్షలు)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు మైలేజీ 19.3కిమీ.ని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. -
కామన్ క్వీన్
‘క్వీన్’ సినిమాలో కంగనా రనౌత్ క్వీన్ కాదు. కానీ సినిమాల్లోకి రాకముందు, సినిమాల్లోకి వచ్చాకా ఆమె క్వీనే. కంగనా... రాజపుత్రుల వంశంలో ఒక రాజపుత్రిక. అక్కణ్ణుంచి ఒక మామూలు అమ్మాయిగా సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్లో ఇప్పుడు కొత్తగా వెలిగిపోతున్న క్వీన్ అయింది. అయినా మామూలు అమ్మాయిగానే కనిపిస్తుంది. అందుకే కంగనా రనౌత్ ఒక సాధారణ మహారాణి. కామన్ క్వీన్. 2014. వేసవి. ‘క్వీన్’ రిలీజ్ అయ్యింది. చిన్న బడ్జెట్‌తో దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. కథాంశం: పెళ్లి ఆగిపోయి తీవ్ర నిస్పృహల్లోకి వెళ్లిన ఒక అమ్మాయి ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఒక్కత్తే హనీమూన్‌కు యూరప్ వెళ్లడం. కన్నీరు మున్నీరు అవుతూ విమానం ఎక్కిన ఆ అమ్మాయి కొత్త స్నేహాలు, పరిచయాలు, ప్రపంచాలు చూసి ఆత్మవిశ్వాసం తెచ్చుకుని, జీవితాన్ని ఎదుర్కొనడం తెలుసుకొని, ఎవడైతే కాదన్నాడో వాడు ఆమె ముందు తనను తాను మరుగుజ్జుగా భావించేంతగా ఎదుగుతుంది. కథ గొప్పదే. కాని తెరకెక్కించడానికి డబ్బులే లేవు. అప్పుడొక లక్ష, అక్కడొక లక్ష దొరికినప్పుడే షూటింగ్ చేశారు. ప్రతి క్షణం సినిమా ఆగిపోతుందేమోనన్న భయం. కాని ప్రతి సందర్భంలోనూ కంగనా ఉందన్న ధైర్యం. తను ఉంటే ఎనర్జీ. మరేం పర్వాలేదనే ధైర్యం. తనే యూనిట్‌ని డ్రైవ్ చేస్తుంది. షెడ్యూల్స్ వేస్తుంది. అంతెందుకు, కొన్ని సీన్లకు స్క్రిప్ట్, డైలాగ్స్ కూడా రాసి డెరైక్టర్ చేతికిచ్చింది. ఇది ఆమె ప్రోడక్ట్. రిలీజ్ మీద భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది. అలాంటి ‘క్వీన్’ రిలీజయ్యింది. మొదటి రోజు నుంచే మీడియాలో రేటింగ్స్. హిట్ సూపర్ హిట్... అంటూ ప్రశంసలు. కొత్త ప్రొడ్యూసర్ల ఆఫర్లు. 100 కోట్ల కలెక్షన్లు. కంగనా ఫోన్‌కు ఊపిరే సలపడం లేదు. కాని అంతటి రద్దీలోనూ కంగనా ఒక ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అది రాలేదు. సంవత్సరం గడిచిపోయింది. 2015, వేసవి.నేషనల్ అవార్డ్స్ ప్రకటన వెలువడింది. కంగనా జాతీయ ఉత్తమ నటి. ‘క్వీన్’లో ఆమె నటన చూసి యునానిమస్‌గా ఓటేసిన జ్యూరీ. మళ్లీ కంగనాకు ఫోన్ల వరద. అన్ని ఫోన్లను కంగనా ఆన్సర్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నంబర్‌కు ఆమె గుండె గబగబా కొట్టుకుంది. తాను ఎదురు చూస్తున్న ఫోన్ అదే. ఆన్సర్ బటన్ నొక్కి ‘నాన్నా’.. అంది. అవతల వైపు ఏం మాట లేదు. బహుశా ఆయన కంఠం రుద్ధమై ఉండాలి. చాలా ప్రయత్నం మీద గొంతు పెగిలింది. ‘సాధించావమ్మా’.అంతే. కంగనా తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి సోఫాలో కూలబడి రెండు చేతులనూ ముఖానికి కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. 2003. వేసవి. సెలవులకు కంగనా చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న తన సొంత ఊరు భామ్బ్లా వచ్చింది. అప్పటికే ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. తాను కెమిస్ట్రీ తప్పింది. అది తండ్రికి పెద్ద వార్త కాదు. ఏదో నాలుగు ముక్కలు చదివించి పెళ్లి చేద్దామని ఆయన ఉద్దేశం. కాని కంగనా చదువు మానేసి సినిమాల్లో చేరదల్చుకుంది. ఇది మాత్రం పిడుగు. అసలే వాళ్లు కొండ ప్రాంతం వాళ్లు. సిమ్లాలో తప్ప ఎక్కడా సినిమా థియేటర్ కూడా చూసి ఎరగరు. అలాంటిది తన కూతురు వెళ్లి సినిమాల్లో చేరుతుందా? తండ్రి మాత్రమే కాదు, అన్న, చుట్టుపక్కల బంధువులు అందరూ పోగయ్యారు. ఇప్పుడు కంగనా నిర్ణయం మీద మొత్తం సమూహపు గౌరవమే ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్లు రాజపుత్రులు. ‘రాణులు, మహరాణులు ఉన్న క్షత్రియజాతి మనది. ఈ జాతి నుంచి వెళ్లి నువ్వు తెర మీద తైతక్కలాడతావా’ ఎవరో అన్నారు. ‘ఆడతాను’ ‘నోర్ముయ్’ తండ్రి గద్దించాడు. ఆ వెంటనే ఆమె చెంప ఛెళ్లుమంది. తండ్రిలో ప్రవహిస్తోంది క్షత్రియ రక్తం అయినప్పుడు కూతురిలో పరుగులెత్తేది క్షత్రియ రక్తం కాదా? కంగనా ఒక్క నిమిషం కూడా ఆగకుండా బ్యాగ్ సర్దుకుంది. ‘నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను’ ప్రకటించింది. గడప దాటుతూ తండ్రి వైపు చూసి అంది- ‘మనలో రాణులు మహరాణులు ఇప్పుడు లేరు. పోయారు. వెండితెర మీద నేనే కాబోయే మహరాణిని. నన్ను చూసి మీరు గర్వపడేరోజు త్వరలోనే వస్తుంది’...బంధువులు ఎగతాళిగా నవ్వారు.తండ్రి ఆమెకు ఇంటి గడప వైపు దారి చూపించాడు. అదంతా గుర్తుకు వచ్చి కంగనా ఏడ్చింది. ఇంతకాలం రచ్చ గెలిచింది. అది విజయం కాదు. ఇప్పుడు ఇంట గెలిచింది. అదే అసలైన విజయం. కాని అది అంత సులభంగా రాలేదు. ఆ సంవత్సరమే. అదే వేసవి. కంగనా ఢిల్లీ వచ్చింది. ఏం చేయాలో తెలియదు. ఎలా బతకాలో తెలియదు. యాక్టర్ అవ్వాలంటే ఎవరిని కలవాలో తెలియదు. అందుకని అక్కడ చురుగ్గా పని చేస్తున్న ‘అస్మిత’ అనే థియేటర్ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. దాని స్థాపకుడు అరవింద్ గౌర్ చాలా పెద్ద థియేటర్ పర్సనాలిటీ. కంగనాను చూసి అతడు ఒకటే ప్రశ్న అడిగాడు- నీకు యాక్టింగ్ గురించి ఏం తెలుసు? దానికి కంగనా జవాబు: ఏమీ తెలియదు. కాని నేను బ్లాటింగ్ పేపర్లాంటిదాన్ని. మీరు ఏది చూపించినా లాగేస్తాను. సరిగ్గా ఒక సంవత్సరానికి మించి కంగనా ఢిల్లీలో ఉండలేదు. పదిహేడేళ్ల అగ్గిబరాటా లాంటి అమ్మాయి. ముంబైని తగలెట్టడానికి బయలుదేరింది. 2006. వేసవి. కంగనా నటించిన తొలి సినిమా- గ్యాంగ్‌స్టర్ విడుదలయ్యింది. మహేష్‌భట్ ప్రొడ్యూసర్‌గా లాంచ్ చేస్తున్న హీరోయిన్. వేల మందిని ఆడిషన్లో ఫెయిల్ చేసి డెరైక్టర్ అనురాగ్ బాసు సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్. కాని మొదటి అడుగు అలా పడాల్సింది లేదా అంత బలంగా పడాల్సింది కాదు. స్క్రీన్ మీద ఆల్కహాలిక్‌గా గతంలో మీనాకుమారి వంటి అతి తక్కువ మందే మార్కులు కొట్టేశారు. కాని తాగుబోతు స్త్రీగా కంగనా చూపించిన నటన అందరికీ అద్భుతంగా అనిపించింది. ఒక మార్కు పడితే అదే మార్కు వెంటపడుతుంది. లైఫ్ ఇన్ ఏ మెట్రో, ఫ్యాషన్... రెండూ హిట్ సినిమాలే. కాని కంగనా చేసింది మాత్రం నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లు. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్... ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పాత్రల కోసం అందరూ కంగనాను అడగడం మొదలుపెట్టారు. అసలు నిజ జీవితంలో కూడా కంగనా అలాంటి అమ్మాయే అని బయట ప్రచారం. అంతా మబ్బుమబ్బుగా అనిపిస్తోంది. మూసుకు వస్తున్నట్టుగా భయమేస్తోంది. మళ్లీ వేసవి రావాలి. వచ్చింది. 2011. మరో వారంలో వేసవి మొదలవుతుంది. ‘తను వెడ్స్ మను’ రిలీజ్ అయ్యింది. ఆనంద్ రాయ్ అనే కుర్రాడు ఉత్తరప్రదేశ్ లైఫ్‌ని, అక్కడి మిడిల్‌క్లాస్ పెళ్లిళ్లని రియలిస్టిక్‌గా చూపించిన సినిమా. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకుంటూ దాదాపు జీవితం నాశనం చేసుకోబోయిన ఆరిందా అమ్మాయి పాత్రలో కంగనా నటన ఆమెలో ఉన్న డిప్రెసివ్ కోణాన్ని శాశ్వతంగా తుడిచి పెట్టేసింది. మరో రెండేళ్లకు వచ్చిన క్రిష్ 3- కంగనా సైఫై క్యారెక్టర్లు కూడా ఎంత బాగా చేయగలదో చూపించింది. క్వీన్ ఆమె స్థాయిని స్థిర పరిచింది. దాదాపు శిఖరం చేరినట్టే. కాని అక్కడ నిలబడే సత్తా ఆమెలో ఉందా లేదా అనే సందేహాన్ని తీరుస్తూ 2015 వేసవి ఆమె కోసం ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తీసుకొచ్చింది. గతంలో హేమమాలిని, శ్రీదేవి డ్యూయెల్ రోల్స్ చేసి మెప్పించారు. ఇంకెవ్వరికీ అది సాధ్యం కాలేదు. కంగనా ఈ సినిమాలో దానిని నమ్మశక్యం కాని రీతిలో చూపించింది. గృహిణిగా ఒకపాత్ర, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకున్న హర్యానా అమ్మాయిగా మరో పాత్ర.... ఒకే తెర మీద ఒకే సమయంలో ఇద్దరు వేరు వేరు వ్యక్తులు చేస్తున్నట్టుగా భ్రాంతి కలిగించింది. కలెక్షన్లు మోగిపోయాయి. మూడు వారాల్లో వందకోట్లు. కంగనా- ఇవాళ వెండితెర క్వీన్. అయితే అది వారసత్వంగా వచ్చిన సింహాసనం కాదు. ప్రేక్షకులు ప్రేమగా ఇచ్చిన సింహాసనం. తమను మెప్పించినందుకు కృతజ్ఞతగా ఇచ్చిన సింహాసనం. బహుశా- ఇప్పట్లో దానికి ఎండ తగలనట్టే. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి కంగనా ఉత్త నటి మాత్రమే కాదు. ఇవాళ ఆమె మాటకు ఒక విలువ ఉంది. సామాజిక పరిణామాల మీద, ధోరణుల మీద, వేళ్లూనుకున్న వ్యవస్థల మీద, ముఖ్యంగా స్త్రీల పట్ల ఉన్న చిన్నచూపు మీద ఆమె చేసే వ్యాఖ్యలను జాగ్రత్తగా వినేవాళ్లు ఉన్నారు. కొత్తతరం ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటోంది. పాతతరం ఆమెతో కలిసి పని చేయాలనుకుంటోంది. ‘నిన్ను నువ్వు నమ్ము’ అనే సూత్రానికి దక్కిన విజయం ఇది. -
అమ్మబాబోయ్!
గాసిప్ చాలామంది నటుల్లో ‘నటన’ మాత్రమే కాదు గానం కూడా ఉండొచ్చు. కొందరిలో రచనా సామర్థ్యం కూడా ఉండొచ్చు. కంగనా రనౌత్‌లో ‘ఉత్తమ నటి’ మాత్రమే కాదు...‘రచయిత్రి’ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ ‘రచయిత్రి’ని చూసి నిర్మాత, దర్శకులు జడుసుకుంటున్నారట. విషయమేమిటంటే, ‘క్వీన్’ సినిమా స్క్రిప్ట్‌లో కంగనా కూడా పాలుపంచుకుంది. డైలాగ్ రైటర్స్ జాబితాలో ఆమె పేరు కూడా తెర మీద కనిపించింది. ‘క్వీన్’ సినిమా హిట్ కావడంతో తనలోని రచయిత్రిపై కంగనాకు పూర్తిగా నమ్మకం వచ్చేసినట్లుంది. దీంతో తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ రచనలో తాను కూడా భాగం అవుతుంది. అంతేకాదు.. డైలాగ్ రైటర్‌గా తన పేరు తప్పనిసరిగా స్క్రీన్ మీద కనిపించాలని కోరుతుందట. స్క్రిప్ట్‌లో కంగనా పాలుపంచుకోవడంలో తప్పేమిటి? అనే డౌటు రావచ్చు. అయితే ఆమె సూచనలు, సలహాలు, డైలాగులు...సినిమాకు ప్లస్ అవ్వడం కంటే మైనస్సయ్యే అవకాశాలే ఎక్కువని దర్శక,నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. -
ఎందుకు తప్పుకుంది?
గాసిప్ సుజయ్ ఘోష్ డెరైక్షన్‌లో, సైఫ్ ఆలి ఖాన్ సరసన కంగనా రనౌత్ నటించనుంది అనే వార్తలు జోరుగా వినిపించాయి. ఒక జపాన్ నవల ఆధారంగా ఏక్తాకపూర్ నిర్మించనున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కెరీర్ పరంగా కంగనాను మరో మెట్టు పైకి తీసుకెళుతుందని ఆశించారు అభిమానులు. అయితే తాను ఆ సినిమాలో నటిస్తానని ఎప్పుడూ ప్రటించలేదని, కాంట్రాక్ట్ మీద సంతకమే చేయలేదని కంగనా చెబుతోంది. దర్శక,నిర్మాతలు కంగనాను సంప్రదించినప్పుడు సినిమాలో నటించడానికి ఆమె ఒప్పుకుందని, ఆ తరువాత ఏమైందో ఏమోగానీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని విశ్వసనీయ వర్గాల కథనం. పెద్ద బ్యానర్, పెద్ద హీరో... అయినప్పటికీ కంగనా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకుంది? నేషనల్ అవార్డ్ రావడం, ‘తను వెడ్స్ మను’ సీక్వెల్ హిట్ కావడం.. మొదలైనవి తన ప్రాధాన్యతలను మార్చాయని, స్క్రిప్ట్‌కు సంబంధించిన విభేదాలు, పర్ఫెక్షనిజం ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణమయ్యాని అంటున్నారు కొందరు. ఇంతకీ నిజమేమిటో! -
జస్ట్ రిలాక్స్!
బాలీవుడ్ నాయకానాయికలు సల్మాన్‌ఖాన్, కంగనా రనౌత్‌లు జస్ట్ రిలాక్స్ అనే మంత్రం జపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా షూటింగ్స్‌తోను, వ్యక్తిగత వ్యవహారాలతోనూ ఉక్కిరిబిక్కిరి అయిన ఈ ఇద్దరూ సేద తీరాలనుకున్నారు. సల్మాన్ ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. కంగనా మాత్రం రిలాక్స్ కావడానికి ఇంటికన్నా మిన్న ఏముంది అనుకున్నారో ఏమో. తన సొంత ఊరు హిమాచల్ ప్రదేశ్ వెళ్లిపోయారు. అక్కడికైతే అతిథుల రాకపోకలు ఉండవు. ఎంచక్కా సేద తీరొచ్చని అనుకున్నారు. ఇక, సల్మాన్ అయితే ఫామ్‌హౌస్‌లోకి ఇతరులకు ప్రవేశం లేదనే టైప్‌లో వ్యవహరిస్తున్నారట. ఎవరొచ్చినా అనుమతించవద్దని తన సిబ్బంది దగ్గర పేర్కొన్నారట. సల్మాన్, కంగనా ఈ రేంజ్లో రిలాక్స్ అవుతున్నారంటే.. షూటింగ్స్ ఒత్తిడి వాళ్ల మీద ఎంత ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. -
ఆ బాధ నాకు తెలుసు!
దీపికా పదుకొనే ‘పీకూ’ ఘనవిజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఇటీవలే ఆమె ఓ పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి షారుక్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా... ఇలా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను పార్టీకి ఆహ్వానించారు. కానీ ర ణ్బీర్ కపూర్, కత్రిన ఈ పార్టీకి హాజరుకాలేదు. దీని గురించి దీపిక స్పందిస్తూ- ‘‘రణ్‌బీర్, కత్రినాలు రాకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. కానీ అర్థం చేసుకోగలను. ‘తమాషా’ షూటింగ్ సమయంలో ‘బాంబే వెల్వెట్’ సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి రణ్‌బీర్ చెప్పేవాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడకపోవడం దురదృష్టమే. ఒక వేళ వాళ్లు పార్టీకి వచ్చినా నేను ఆ సినిమా గురించి అడిగి ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే నేను అలాంటి దశలను దాటుకునే వచ్చాను. ఆ బాధేంటో నాకు తెలుసు. ’’ అన్నారు. -
వాళ్లతో రొమాన్స్ చేయాలని ఉంది!
ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుసగా సినిమాలు చేసేస్తున్నారు అమితాబ్ బచ్చన్. అలాగే, యాడ్స్‌లోనూ నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న బచ్చన్‌కి ఓ అసంతృప్తి ఉందట. కథానాయికలతో రొమాన్స్ చేసే వయసులో లేకపోవడం అనే అసంతృప్తి వెంటాడుతోందని అమితాబ్ అంటున్నారు. ముఖ్యంగా విద్యాబాలన్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్, ఆలియా భట్ వంటి భామలతో హీరోగా నటించే వయసులో లేకపోవడం చాలా బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. వాళ్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న హీరోలను చూస్తే అసూయగా ఉందని బిగ్ బి సరదాగా అన్నారు. -
అంత కసి ఎందుకు కంగనా?!
గాసిప్ కంగనా రనౌత్ అంటే గ్లామర్ స్టార్ అనేవారు మొదట్లో. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్వీన్ అంటున్నారు. ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్ లాంటి చిత్రాలతో నటిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డును సైతం అందుకుంది కంగనా. అయితే అందుకు సంతోషపడాల్సింది పోయి... అనవసరంగా పాత విషయాలన్నీ తవ్వుతోంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న నాటి నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనూ తనను చాలామంది ఎదగనివ్వలేదని, అయినా కష్టపడి ఎదిగానని చెప్పుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అయితే... నన్ను వెన్నుపోటు పొడవాలని చూసినవాళ్లు, వెనక్కి లాగాలని చూసినవాళ్లు అంటూ ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద తలకాయలను టార్గెట్ చేసి మాట్లాడింది. దాంతో ఆ పెద్దలు రుసరుసలాడుతున్నారని సమాచారం. ఇక్కడ నటించడం తెలిస్తే చాలదు, ప్రవర్తించడం కూడా తెలియాలి అని కొందరు కంగనాకి సలహా కూడా ఇస్తున్నారట. కంగనా ఆ సలహాను పాటిస్తుందో లేదో మరి! -
నన్ను నాశనం చేయడానికి డబ్బు ఖర్చుపెట్టారు!
‘‘ఇప్పుడందరూ నన్ను ‘క్వీన్’ కంగనా అంటున్నారు. పొగడ్తలూ పూలదండలూ విరజిమ్ముతున్నారు. కానీ, నేను సినిమాల్లోకొచ్చిన కొత్తలో చాలామంది నన్ను పలకరించడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. ఎందుకంటే, హిమాచల్ ప్రదేశ్ వంటి చిన్న టౌన్ నుంచి వచ్చానని నన్ను చిన్న చూపు చూసేవాళ్లు. సినిమా పరిశ్రమకు సంబంధం లేనివాళ్లు ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. బయటివాళ్లను తొక్కేయాలనుకుంటారు. నన్ను నాశనం చేయడానికి చాలామంది డబ్బు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడలేదు. దానికోసం ఎంతో సమయం కూడా కేటాయించారు. కానీ, ఒకరి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. వాస్తవానికి నా మీద కుట్రలు జరుగుతున్నాయని గ్రహించే వయసు, అనుభవం ఉండేది కాదు. నా పదహేడవ ఏట సినిమాల్లోకొచ్చాను. ఆ వయసులో ఎవరు తప్పు? ఎవరు సరి అని ఎలా తెలుస్తుంది? తప్పుడు వ్యక్తులెవరో తెలుసుకుని, వాళ్లకు దూరంగా ఉండటానికి నాకు చాలా సమయం పట్టింది. మనుషుల మనస్తత్వాలను గ్రహించేంత నేర్పు వచ్చేసింది. ఇప్పుడు నన్నెవరూ తప్పుదారి పట్టించలేరు. ఆ మాటకొస్తే ఏమీ చేయలేరు.’’ - కంగనా రనౌత్ -
8 పాయింట్స్ కంగనా రనౌత్
సంతోషం ‘నేను ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను’ అని అసంతృప్తి పడేవాళ్లను, ‘నాది సొంత ఇల్లు’ అనే గర్వంగా చెప్పుకొని మురిసిపోయేవాళ్లను చూస్తుంటాం. అయితే సొంతదైనా 2 అద్దెదయినా... ఎంత సంతోషంగా ఉన్నామన్నదే, ఎంత మనశ్శాంతితో ఉన్నామన్నదే ముఖ్యం. సీరియస్ లైఫ్‌ను, వర్క్‌లైఫ్‌ను సీరియస్‌గా తీసుకోను. తీసుకుంటే... ఏదీ సాఫీగా సాగదు. చిన్న విషయం కూడా భారం అనిపిస్తుంది. జీవితంలో ప్రాథమిక విషయాలు... ఆరోగ్యం, స్నేహం, అనుబంధం. వీటికిచ్చే ప్రాధాన్యత మీదే మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్‌జోన్ ‘కంఫర్ట్‌జోన్’ ఎప్పుడూ ‘కంఫర్ట్’గానే ఉండకపోవచ్చు. ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. అందుకే ఎప్పటికప్పడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తూ ఉండాలి. ‘నాకేది తెలియదు’ అనుకుంటే అక్కడే ఉండి పోతాము. ‘తెలుసుకోవాలనుకుంటాను’ అనుకుంటే ముందుకు పోతాము. కలలు ‘ఇలా జరుగుతుంది’ ‘ఇలా జరగాలి’ అని కలలు కంటే... ఏదీ నిజం కాదు. ఎంత గొప్ప ఊహలు, కలలు అయినా ఇంట్లో కూర్చుంటే నిజం కావు. ఎంతో కొంత కష్టపడాలి. కలలు మాత్రమే కాదు కష్టం కూడా బలంగా ఉండాలి. నచ్చిన పని నచ్చిన పనిని ఎంచుకునేప్పుడు మనం లాభనష్టాల గురించి పెద్దగా ఆలోచించం. నష్టం ఎదురైనా...అది పెద్దగా మనల్ని కదలించదు. ‘తృప్తి’ మాత్రం మిగులుతుంది. ఇది కూడా ఒక విధంగా లాభమే కదా! అన్ని సందర్భాల్లో డబ్బు ‘తృప్తి’ ఇవ్వపోవచ్చు. ‘తృప్తి’ మాత్రం డబ్బుకన్నా విలువైనదాన్ని ఇస్తుంది. వంద డిగ్రీలు ‘నీకు పది డిగ్రీలు కావాలా? పది ఎక్స్పీరియన్సెస్ కావాలా?’ అని అడిగితే రెండోదే ఎంచుకుంటాను. అడగక పోయినా అనుభవం అనేది ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అందుకే ఒక్కో అనుభవం వంద డిగ్రీలతో సమానం! వంద శాతం నేను వంద శాతం అంతర్ముఖురాలిని. చాలామందికి అంతర్ముఖులు ‘మూడీ ఫెలోస్’గా కనిపిస్తారు. అది అందరికీ నచ్చకపోవచ్చు కూడా. అయినప్పటికీ నేను అంతర్ముఖురాలిగా ఉండడానికి ఇష్టపడతాను. అంత్మర్ముఖం అంటే మనలోకి మనం తొంగి చూసుకోవడం, మనతో మనం విలువైన సంభాషణ చేయడం. విజయం విజయం అంటే... మన శక్తి ఏమిటో, అది ఎక్కడో ఉందో, అది ఏ సందర్భాల్లో వినియోగించుకోవాలో తెలుసుకోవడం. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడం. నిరంతర నిరాశను నిరంతర ఆశగా మార్చుకోవడం. ప్రతి అడుగును గుర్తు పెట్టుకోవడం. -
వరించి వచ్చిన పాత్ర
హిందీ రంగంలో ఇప్పుడు నటనకు అవకాశమున్న పాత్రలంటే చాలామంది దర్శక, నిర్మాతలు కంగనా రనౌత్‌ని ఎంపిక చేసుకుంటున్నారు. ‘తను వెడ్స్ మను, క్వీన్, రజ్జో’ చిత్రాల్లో కంగన ప్రదర్శించిన అభినయం అలాంటిది. ‘క్వీన్’లో నటనకు తాజాగా జాతీయ అవార్డునూ ఆమె అందుకున్నారు. అందుకు తగ్గట్లే తాజా అవకాశాల్లో అందాల అభినేత్రి మీనాకుమారి జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రం ఒకటి. ఈ చిత్రానికి తిగ్మాంషు ధూలియా దర్శకత్వం వహించనున్నారు. మీనాకుమారి పాత్రకు ముందు విద్యాబాలన్‌ను తీసుకోవాలనుకున్నారనే వార్త వినిపించింది. ఆ తర్వాత దీపికా పదుకొనే పేరు కూడా ప్రచారంలోకొచ్చింది. చివరికి ఈ అవకాశం కంగనాను వరించింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే ధ్రువీకరించారు. ‘‘మీనాకుమారి జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో టైటిల్ రోల్ చేయనున్నా. అయితే ఆ చిత్రం ఇప్పుడే ఆరంభం కాదు. ఎందుకంటే ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. అవి పూర్తయ్యేసరికి మరో ఏడాది పడుతుంది. అందుకని మీనాకుమారి చిత్రం వచ్చే ఏడాది వేసవి తర్వాతే మొదలవుతుంది’’ అని కంగన పేర్కొన్నారు. ఈలోపు మీనాకుమారి జీవితం గురించి పూర్తిగా తెలుసు కోవాలనుకుంటున్నారామె. -
జాతీయ అవార్డుల్లో మెరిసిన ‘క్వీన్’!
కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్ ఉత్తమ తెలుగు చిత్రంగా చందమామ కథలు న్యూఢిల్లీ: అరవై రెండో జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెంగాలీ చిత్రాలకు పంట పండింది. ఏడుకు పైగా బెంగాలీ సినిమాలు అవార్డుకు ఎంపికయ్యాయి. షేక్స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా హైదర్‌కు ఐదు అవార్డులు లభించాయి. - హిందీ సినిమా క్వీన్‌లో అద్భుతంగా నటించిన కంగనా రనౌత్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. నాను అవనాళ్ల అవలు(నేను అతడు కాదు, ఆమెను) సినిమాలో హిజ్రాపాత్రలో ఒదిగిపోయిన కన్నడ నటుడు సంచారి విజయ్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందారు. న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ చైతన్య తమానే రూపొందించిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రియాంక చోప్రా నటించిన హిందీ సినిమా ‘మేరీ కోమ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ‘62వ జాతీయ చలన చిత్ర అవార్డులు-2014’ను మంగళవారం ఢిల్లీలో అవార్డుల జ్యూరీ చైర్మన్ జి. భారతీరాజా ప్రకటించారు. ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగుచిత్రంగా ‘చందమామ కథలు’, సినీ రచయిత పసుపులేటి పూర్ణచంద్రారావు ‘సెలైంట్ సిని మా (1895-1930)’గ్రంథానికి గాను ఉత్తమ సినీగ్రంథ అవార్డు, ఉత్తమ ప్రచురణ సంస్థగా ‘ఎమెస్కో’ బుక్స్, అలాగే, నల్లమూతు సుబ్బయ్య దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఫోర్స్- ఇండియాస్ వెస్టర్న్ ఘాట్స్’ సినిమా ఉత్తమ పరిశోధనాత్మక చిత్రంగా ఎంపికైంది. -
అద్వితీయ నటనకు రెండోసారి గుర్తింపు
ఉత్తమ నటి - కంగనా రనౌత్ (హిందీ చిత్రం ‘క్వీన్’) ‘క్వీన్’ చిత్రం ద్వారా జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన కంగనా రనౌత్ మరోసారి దేశమంతటా వార్తల్లో నిలిచారు. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో రాజౌరీ ప్రాంతానికి చెందిన రాణిగా ఆమె చేసిన అభినయం తాజాగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డు రావడం ఇది రెండోసారి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యాషన్’ (2008) చిత్రంలో మాదక ద్రవ్యాలకు బానిసైన మోడల్‌గా చూపిన అభినయానికి గతంలో ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెల్చుకున్నారు. ఇప్పుడు ‘క్వీన్’తో ఏకంగా ఉత్తమ నటి కిరీటం అందుకోనున్నారు. సర్వసాధారణంగా హిందీ సినీ అవార్డు షోలకు హాజరయ్యే అలవాటు లేని కంగన ఈ సారి జాతీయ అవార్డు రేసులో తాను ఉన్న సంగతే తెలియదన్నారు. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చినా, పురస్కారం అందుకోవడానికి వెళ్ళని ఆమె జాతీయ అవార్డును తీసుకోవడానికి వ్యక్తిగతంగా హాజరవుతానన్నారు. -
రాణీకే కిరీటం!
నటిగా కంగనా రనౌత్ ఏ స్థాయిలో విజృంభించగలుగుతారో నిరూపించిన చిత్రం ‘క్వీన్’. అప్పటివరకూ ‘ఆ ఏముంది.. గ్లామర్ ఆర్టిస్టే కదా’ అన్నవాళ్లు సైతం కంగనాని అద్భుతమైన నటి అని అభినందించేశారు. నటిగా తన గౌరవాన్ని పెంచిన చిత్రం ఇది. ఇప్పటికే ఈ చిత్రానికి, కంగనాకి పలు అవార్డులు వచ్చాయి. తాజాగా, ముంబయ్‌లో జరిగిన 60వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో కూడా ‘క్వీన్’కే కిరీటం దక్కింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి (కంగనా రనౌత్), ఉత్తమ దర్శకత్వం (వికాస్ బాల్), ఉత్తమ ఛాయాగ్రహణం (బాబీసింగ్, సిద్ధార్ధ్ దివాన్), ఉత్తమ నేపథ్య సంగీతం (అమిత్ త్రివేది), ఉత్తమ ఎడిటింగ్ (అభిజిత్ కొకాటె, అనురాగ్ కశ్యప్).. ఇలా ఆరు విభాగాల్లో ‘క్వీన్’ అవార్డులు దక్కించకోవడం విశేషం. ఇంకా ‘హైదర్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా షాహిద్‌కపూర్, ఉత్తమ సహాయ నటిగా టబు, సహాయ నటుడిగా కేకే మీనన్‌లకు అవార్డులు దక్కాయి. -
నాట్ ఎలోన్!
ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న బాలీవుడ్ సెక్సీ తార కంగనా రనౌత్ ఎట్టకేలకూ జతగాడిని వెతుక్కుంది. ఈ సీక్రెట్‌ను ఆమె విప్పి చెప్పింది. అయితే అతగాడెవరనేది ప్రస్తుతానికి సస్పెన్సట! ఇంత అద్భుతమైన బాయ్‌ఫ్రెండ్ దొరికినందుకు తనకెంతో ఆనందంగా ఉందంటోంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్‌తో ‘కట్టి బత్తి’ సినిమాలో చేస్తున్న కంగనా... ‘అతడెవరో బయటపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. సందర్భం వచ్చినప్పుడు అందరికీ చెబుతా. నిజానికి బంధాలు ఎంతో క్లిష్ట మైనవి. కాదంటారా! అవి ఆరోగ్యకరంగా లేకపోతే తరువాత బాధపడాల్సి వస్తుంది. ఆ విషయంలో నేను లక్కీ. మంచి జతగాడిని పొందగలిగా’ అంటూ చెప్పుకొచ్చిందీ చిన్నది. -
అవార్డులతో పనిలేదంటున్న కంగనా
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తనకు అవార్డులతో పని లేదంటోంది. అందుకే అవార్డుల కార్యక్రమాలకు తాను హాజరు కానని చెబుతోంది. కెరీర్లో తాను సాధించాల్సిందిగా ఇంకా చాలా ఉందని, అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రశంసలే తనకు ముఖ్యమని అంటోంది. అయితే, అవార్డులకు నామినేట్ కాకపోవడం వల్లనే ఆమె ఇలాంటి మాటలు చెబుతోందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. -
సోనమ్ అదుర్స్ కంగన కితాబు
కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తుండడం తెలిసిందే. కంగన మాత్రం సోనమ్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లలో అందరికంటే సోనమ్ దుస్తులు చాలా బాగుంటాయని కితాబిచ్చింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ అందంగా లేని వాళ్లకు కూడా మంచి నటులని పేరు వస్తోందని చెప్పింది. కంగన తాజా సినిమాలు రివాల్వర్ రాణి, క్వీన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అందని చాలా మంది అనుకున్నారు. కంగన మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోకుండా బాగా కనిపించేవాళ్లలో సోనమ్ ఒకరని మెచ్చుకుంది. ‘ఈమధ్య హీరోయిన్లంతా మంచి దుస్తుల్లో కనిపిస్తున్నారు. జాక్వెలిన్ చాలా చక్కని దుస్తులు ఎంచుకుంటుంది. సోనమ్ కూడా అంతే. దీపికా పదుకొణే వస్త్రాల ఎంపిక కూడా అత్యద్భుతంగా ఉంటుంది’ అని వివరించింది. ఢిల్లీలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఇండియా కోషర్ వీక్ ఫ్యాషన్ షోలో డిజైనర్ అంజూ మోడీ వస్త్రాల్లో కంగన మెరిసింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పైమాటలు చెప్పింది. సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న బాజీరావు మస్తానీ కంగన తదుపరి సినిమా. -
ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?
ఒక మంచి చిత్రం ఏ భాషలో వచ్చినా దాన్ని ఇతర భాషల్లో రూపొందించడం తప్పు కాదంటారు సినీ విజ్ఞులు. అయితే ప్రస్తుతం సినిమాలన్నీ రీమేక్‌ల మయంగా మారాయి. సొంత కథలతో రిస్క్ చేసేకంటే ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేసుకోవడం సేఫ్ అనే భావన దర్శక నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. ఇంతకుముందు దక్షి ణాది చిత్రాలు హిందీలో వరుసగా రీమేక్ అయ్యాయి. గజిని, పోకిరి, కిక్, విక్రమార్కుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యాయి. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది బాలీవుడ్ హిట్ చిత్రాలకు దక్షిణాది దర్శక నిర్మాతలు రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య విద్యాబాలన్ నటించిన హిందీ చిత్రం కహాని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయగా నయనతార నటించారు. ఓమైగాడ్ చిత్రం తెలుగులో వెంకటేష్, పవన్‌కల్యాణ్ హీరోలుగాపునర్నిర్మాణం కానుంది. కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు త్యాగరాజన్ పొందారు. ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నటించడానికి ప్రముఖ హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందనేది త్వరలోనే తేలనుంది. అయితే తాజాగా మరో బాలీవుడ్ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కుల కోసం పోటీ నెలకొందని సమాచారం. హిందీలో సంచలన నటి విద్యాబాలన్ నటించిన బాబి జసూస్ ఈ జూలై4న విడుదల కానుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని దియ మిర్జ్జా నిర్మించారు. ఇందులో విద్యాబాలన్ లేడీ డిటె క్టివ్‌గా విభిన్న పాత్రను పోషించారు. ఆమె ఈ చిత్రంలో పలు గెటప్పుల్లో అలరిస్తారట. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నెంబర్ వన్ డిటెక్టివ్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశించే బాబిగా విద్యాబాలన్ నటనహైలెట్గా ఉంటుందట. మరి అలాంటి పాత్రకు దక్షిణాదిలో పోషించే లక్కీ హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. -
వాళ్లు ఏడిస్తేనే నాకు ఆనందం!
‘‘వెండితెరపై మనం చూసే రెండున్నర గంటల సినిమా నిజం కాదు. కేవలం ఓ కథ. కానీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, ‘నిజంగా జరుగుతోంది’ అని ఫీలైతే, ఆ సినిమా సక్సెస్ కిందే లెక్క’’ అంటున్నారు కంగనా రనౌత్. క్వీన్, రజ్జో, రివాల్వర్ రాణి.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. పైగా... అన్నీ కథానాయిక పాత్ర ప్రాధాన్యంగా సాగే సినిమాలు కావడంతో కంగన చాలా ఆనందంగా ఉన్నారు. ఓ సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమాలోని పాత్రగా తాను మారిపోతానని చెబుతూ -‘‘కెమెరా ముందుకెళ్లిన తర్వాత నేను కంగన అనే విషయం మర్చిపోతాను. అది ఎలాంటి సన్నివేశం అయినా వంద శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తాను. ఉదాహరణకు... ఏడ్చే సన్నివేశాన్ని తీసుకుందాం. గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చేస్తాను. నేను యాక్ట్ చేసిన చిత్రాల్లో కొన్నింటిని పబ్లిక్ థియేటర్లో చూస్తాను. అప్పుడు ప్రేక్షకుల హావభావాలు క్షుణ్ణంగా గమనిస్తాను. తెరపై నేను ఏడవడం చూసి, థియేటర్లో ప్రేక్షకులు కంట తడిపెట్టుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను నవ్వినప్పుడు వాళ్లూ నవ్వితే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ఇలాంటి ఆనందాలు నాకు చాలానే మిగిలాయి. సో.. నటిగా నేను సక్సెస్ అయినట్లేగా. ఇంకో విషయం ఏంటంటే.. ‘కంగన ఇటు గ్లామరస్ అటు పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న పాత్రలు చేస్తుంది. మనం కూడా అలానే చేయాలి. కేవలం గ్లామర్‌కి పరిమితం అయిపోకూడదు’ అని కొత్త తారలు నన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నది నా ఆకాంక్ష. సినిమాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటా’’ అని చెప్పారు కంగనా. -
‘క్వీన్’గా ఎవర్నీ ఖరారు చేయలేదు
కంగనా రనౌత్ కథానాయికగా వికాస్ బాల్ దర్శకత్వటంలో రూపొంది, ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం ‘క్వీన్’ దక్షిణాది రీమేక్ హక్కుల్ని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ చేజిక్కించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించనున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ -‘‘కథానాయికలుగా అనుష్క. కాజల్, తమన్నాలను పరిశీలిస్తున్నాం అనే వార్త ప్రచారంలో ఉంది. వాస్తవానికి త్రిష పేరుని పరిశీలిస్తున్నాం. హిందీలో కంగనా అద్భుతంగా నటించింది. దక్షిణాది రాణిగా ఎవరు నప్పుతారు? అనే విషయాన్ని చర్చిస్తున్నాం. త్వరలో కథానాయికను ఖరారు చేస్తాం’’ అన్నారు. ఈ రీమేక్‌లో మీ అబ్బాయి, హీరో ప్రశాంత్ నటిస్తారా? అనడిగితే -‘‘తను నటిస్తానంటే నాకభ్యతరం లేదు. ప్రస్తుతం తను ‘జులాయి’ రీమేక్‌లో నటిస్తున్నాడు’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘జీన్స్ 2’కి సన్నాహాలు చేస్తున్నానని, ఆ చిత్రవిశేషాలు కూడా త్వరలో తెలియజేస్తానని త్యాగరాజన్ తెలిపారు. -
దక్షిణాది రాణి!
ఏ నటికైనా సవాల్ లాంటి పాత్ర వస్తే.. నటనాపరంగా విజృంభించేస్తారు. ‘క్వీన్’ చిత్రంలో కంగనా రనౌత్ అదే చేశారు. మొదట్లో గ్లామర్ డాల్ అనిపించుకున్నప్పటికీ రాను రాను తనలో ఎంత మంచి నటి ఉందో నిరూపించుకుంటున్నారు కంగనా. ముఖ్యంగా ‘క్వీన్’లో ఆమె ప్రదర్శించిన నటనను అమితాబ్ బచ్చన్ వంటివారే సైతం మెచ్చుకున్నారు. ఈ సినిమా కంగనా తప్ప ఎవరూ చేయలేరు? అని కూడా చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఎంతో పోటీ మధ్య తమిళ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ (హీరో ప్రశాంత్ తండ్రి) ‘క్వీన్’ దక్షిణాది రీమేక్ హక్కులు సాధించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించాలనుకుంటున్నారు. కంగనా స్థాయిలో దక్షిణాదిన నటించే సత్తా ఎవరికుంది? అంటూ.. రకరకాల తారల పేర్లు అనుకున్నారు. ఎంతమందిని అనుకున్నా ఎక్కువ శాతం మార్కులు త్రిషకే వేస్తున్నారట. త్యాగరాజన్ మనసులో కూడా త్రిషానే ఉందని సమాచారం. ఈ చిత్రానికి రాధామోహన్ లేక అహ్మద్ దర్శకత్వం వహిస్తారని వినికిడి. రాధామోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘అభియుమ్ నానుమ్’ అనే చిత్రంలో త్రిష అద్భుతంగా నటించారు. అలాగే, అహ్మద్ దర్శకత్వం వహించిన ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’లో కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశారామె. ఆ విధంగా ఈ ఇద్దరు దర్శకులకు త్రిష నటనపై మంచి అభిప్రాయం ఉంది. అందుకని, తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన ‘క్వీన్’ రీమేక్‌లో త్రిషకే ఎక్కువ అవకాశం ఉంది. మరి.. క్వీన్‌గా ఎవరు ఒదిగిపోతారో వేచి చూడాలి. -
దక్షిణాది తెరపై క్వీన్ ఎవరు?
దక్షిణాది వెండితెరపై క్వీన్ అవతారమెత్తాలని చాలా మంది కథానాయికలు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ క్వీన్ ఎవరు? ఆ అదృష్టం ఎవరిని వరించనుంది? అన్నది త్వరలోనే తేలనుంది. అసలు ఈ క్వీన్ సంగతేమిటంటారా. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. క్రేజీ నటి కంగనా రనౌత్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయూలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఈ సంచలన చిత్రం దక్షిణాది హక్కులను సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఈయన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ క్వీన్ చిత్రం కంటెంట్ తనకు బాగా నచ్చిందన్నారు. ఒక యువతి జీవితంలో తనకెదురైన అవాంతరాలను ఎలా ఎదురొడ్డి పోరాడిందన్నదే చిత్ర కథ అన్నారు. ఇది యూనివర్శిటీ సబ్జెక్ట్. దక్షిణాది భాషలన్నింటిలోనూ నిర్మించడానికి హక్కులు పొందినట్లు వెల్లడించారు. కంగనా పాత్రను ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ పోషించనున్నారని తెలిపారు. ఇక కంగనాకు ఫ్రెండ్‌గా నటించిన లిసా హైడన్ దక్షిణాదిలోనూ నటించనున్నారని చెప్పారు. ‘‘మీ అబ్బాయి నటుడు ప్రశాంత్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందా?’’ అన్న ప్రశ్నకు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక వైవిధ్యభరిత పాత్రను ప్రశాంత్‌తో నటింప జేయాలనుకుంటున్నట్లు త్యాగరాజన్ తెలిపారు. అయితే ఇది ప్రశాంత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తను ప్రస్తుతం తమిళ చిత్రం సాహసంలో నటిస్తున్నారని తదుపరి ఒక భారీ బాలీవుడ్ చిత్రం చేయనున్నారని వివరించారు. నాలుగు భాషల్లోనూ ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్‌ను ప్యారిస్, ఆమ్స్టర్డమ్, స్పెయిన్ దేశంలో నిర్వహించనున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు. -
ఆలస్యంగా అర్థం చేసుకున్నాను!
లైఫ్ బుక్ ‘జీవితానికి ఏదో ఒక అర్థం ఉండాలి’ అనే ఆలోచనతో మెడిసిన్‌ను మధ్యలోనే వదిలేశాను. నా జీవితానికి ఒక అర్థం ఉండాలంటే అది కళలతోనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు... ఇలా సినిమాల్లోకి వచ్చాను. చిత్రసీమకు వచ్చిన కొత్తలో మిగతా వాళ్లతో పోల్చితే... నాకు పెద్దగా ఏమీ తెలిసేది కాదు. అర్థమయ్యేది కాదు. కెమెరా ఒకవైపు ఉంటే మరొక వైపున నిల్చొని నటించేదాన్ని. చీవాట్లు తినేదాన్ని. ఇలాంటివి సాంకేతిక విషయాలే అనుకుంటాంగానీ వాటి ప్రభావం ఇతర విషయాల మీద కూడా పడుతుంది. అయితే కాలక్రమంలో లోపాలను సరిదిద్దుకున్నాను. చుట్టూ సరైన వాళ్లు లేకపోవడం వల్ల మనం ఏంచేస్తున్నామో మనకు అర్థం కాదు. నేను కూడా సరైన సలహాలు ఇచ్చే మంచివాళ్లు నా చుట్టూ లేకపోవడం వల్ల మంచి సినిమాల్లో చేసే అవకాశం పోగొట్టుకున్నాను. ‘ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. అహాన్ని తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసం నుంచి అహాన్ని మైనస్ చేయడం నేర్చుకోవాలి. ఏ సమస్య వచ్చినా ‘సబ్ ఠీక్ హోజాయేగా’ ‘ఎవ్రీథింగ్ విల్ బి ఓకే’ అనుకుంటాను. అదృష్టం బాగుంటే ఆశించింది జరుగుతుంది. అలా కాని పక్షంలో దాని గురించి అయిదు నిమిషాలు కూడా ఆలోచించను. ఆరోగ్యకరం కాని పోటీలో ఉండడం కంటే, అసలు పోటీలో ఉండక పోవడమే క్షేమం అనుకుంటాను. సినిమా మాత్రమే నా ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో అది కూడా ఒకటి అని మాత్రమే అనుకుంటాను. వంట నేర్చుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, కొత్త భాషలు నేర్చుకోవాలి...ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి. - కంగనా రనౌత్, హీరోయిన్ -
అప్పుడు అవమానాలు...ఇప్పుడు గౌరవ మర్యాదలు!
‘‘బక్కపల్చని శరీరాకృతి.. చెప్పుకోదగ్గ అందగత్తె కూడా కాదు. అభినయం కూడా అంతంత మాత్రమే. మహా అయితే మూడు నాలుగేళ్లు ఉంటుందేమో.. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లిపోవాల్సిందే’’... కథానాయికగా కంగనా రనౌత్ వచ్చినప్పుడు చాలామంది చేసిన విమర్శలివి. అవి కంగన వరకూ వెళ్లాయి కూడా. ఆ సమయంలో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటే.. నిజంగానే తన ఊరు హిమాచల్‌ప్రదేశ్ వెళ్లిపోయేవారు కంగన. అయితే, తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్. తనదాకా వచ్చిన సినిమాలేవీ కాదనకుండా చేశారు. వాటిలో ఎక్కువ శాతం అపజయాలపాలైనవే ఉన్నాయి. అప్పుడెన్నో అవమానాలకు గురయ్యాయనని, అవే తన మనసుని రాటుదేలేలా చేశాయని కంగన అన్నారు. ‘తను వెడ్స్ మను, క్వీన్, రివాల్వర్ రాణి’ విజయాలతో కంగన సీన్ మారిపోయింది. ఎవరైతే విమర్శించారో వాళ్లే ‘కంగనలో అద్భుతమైన నటి ఉంది. మునుపటికన్నా చాలా అందంగా ఉంది’ అని అభినందించడం మొదలుపెట్టారు. దాని గురించి చెబుతూ - ‘‘ఒకప్పుడు హేళన చేసినవాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారు. ఈ మార్పుని నేనూహించలేదు. ‘మీరు మంచి ఆర్టిస్ట్ మేడమ్’ అని అభినందిస్తున్నారు. నిజానికి అపజయం సాధించిన సినిమాల్లోనూ బాగానే యాక్ట్ చేశాను. కానీ, అదెవరూ గుర్తించలేదు. ఇప్పుడు విజయాల శాతం ఎక్కువైంది కాబట్టి, అభినందిస్తున్నారు. బలమైన పాత్రలు పడ్డాయి కాబట్టే, నిరూపించుకోగలిగాను. ఆ పాత్రలు సృష్టించిన రచయితలు, దర్శకులకే ఈ ఘనత దక్కుతుంది. ఈ మధ్య కాలంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువయ్యాయి. ఈ మార్పు ఆహ్వానించదగ్గది. ఇలాంటి సినిమాల వల్ల కథానాయికలందరికీ గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నా’’ అన్నారు కంగన. -
‘డివైన్ లవర్స్’గా కంగనా, ఇర్ఫాన్
మొన్న ‘క్వీన్’గా..., నిన్న ‘రివాల్వర్ రాణీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించిన ‘ఫ్యాషన్ డాల్’ కంగనా రనౌత్ మరో ప్రత్యేక చిత్రంతో అభిమానులకు కనువిందు చేయనుంది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో దూసుకుపోతున్న కంగనా ఈసారి మాత్రం నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌తో జతకడుతోంది. తాను తెరకెక్కిస్తున్న ‘డివైన్ లవర్స్’ సినిమాలో వీరిద్దరు నటిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు సాయి కబీర్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ విషయమై దర్శకుడు సాయి కబీర్ మాట్లాడుతూ... ‘కంగనా రనౌత్, ఇర్ఫాన్‌ఖాన్‌లతో కలిసి ‘డివైన్ లవర్స్’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాను. ఇప్పటికే ఈ పేరుతో వచ్చిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకున్నాయి. ‘క్వీన్’ సినిమా తర్వాత దాదాపుగా కథానాయిక ప్రధాన్యమున్న చిత్రం ‘రివాల్వర్ రాణీ’లోనే కంగనా నటించింది. మరోసారి అటువంటి చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ భావించారు. అయితే కంగనా మాత్రం అటువంటి కట్టుబాట్లతో గిరిగీసుకోకుండా ఇర్ఫాన్‌తో కలిసి తెరను పంచుకోవడానికి పచ్చజెండా ఊపింది. కంగనా నటించిన మిగతా చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. భారతీయ కళకు అద్దం పట్టేలా చిత్రాన్ని నిర్మిస్తాం. ముంబై, అలీగఢ్ వంటి ప్రదేశాల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మధ్యతరగతి జీవితాల్లోని నీతి, నిజాయతీలను కథావస్తువుగా తీసుకున్నామ’ని చెప్పారు. కంగనాతో భవిష్యత్తులో భారీ చిత్రాలు నిర్మిస్తానని చెప్పిన కబీర్ అంతవరకు వచ్చిన ఈ గ్యాప్‌లో ‘డివైన్ లవర్స్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. సయీద్ మీర్జా, కుందన్ షాల తాను ఎంతో స్ఫూర్తిని పొందానని, అదే స్ఫూర్తితో సినిమాలను తెరకెక్కిస్తున్నానని చెప్పాడు. -
ఓ పాతిక వదిలేశా!
‘క్వీన్’, రివాల్వర్ రాణి’లాంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి, తనలో హాట్ గాళ్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా ఉందని కంగనా రనౌత్ నిరూపించుకున్నారు. సినిమా మొత్తాన్ని సునాయాసంగా తన భుజాల మీద నడిపించేస్తారనే నమ్మకాన్ని దర్శక, నిర్మాతలకు కలగజేశారు ఈ హాట్ బ్యూటీ. దీని గురించి కంగనా మాట్లాడుతూ -‘‘ఎవరికైనా సరే బలమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ, దర్శక, నిర్మాతలు నమ్మాలి. నమ్మి అవకాశం ఇస్తే, ఎవరైనా నిరూపించుకుంటారు. నన్ను నమ్మి క్వీన్, రివాల్వర్ రాణి చిత్రాలకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి, నా ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. ఏదేమైనా ఈ చిత్రాలిచ్చిన ఉత్సాహంతో నాకిప్పుడు టైటిల్ రోల్స్‌తో రూపొందే చిత్రాలే ఎక్కువగా చేయాలని ఉంది. ఆ తరహా చిత్రాలు ఈ మధ్య కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కానీ, ఏది పడితే అది చేస్తే ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, దాదాపు 25 సినిమాలు తిరస్కరించా’’ అని చెప్పారు. మీరు అదృష్టాన్ని నమ్ముతారా అనే ప్రశ్నకు సమాధానంగా -‘‘అస్సలు నమ్మను. నా కష్టాన్ని మాత్రమే నమ్ముతాను. ఒకవేళ అదృష్టం కనుక నావైపు ఉండి ఉంటే నా మొదటి సినిమానే విజయం సాధించి ఉండేది. కానీ, అలా జరగలేదు కదా. విజయం తాలూకు రుచి ఎలా ఉంటుందో చూడటానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. అది కూడా నేను క్లిష్టమైన పాత్రలను కష్టపడి చేయడంవల్లే’’ అని చెప్పారు. -
రాణి జోలికి వెళ్లకూడదు!
కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రంలో కంగనా నటన చూసి, ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం కంగనాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంకా పలువురు సినిమా తారలు కంగనాని అభినందనలతో ముంచెత్తారు. ఆ జాబితాలో సమంత కూడా ఉన్నారు. ‘క్వీన్’ సినిమా చూశానని, బాగా నచ్చిందని, కంగనా నటన అద్భుతం అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు సమంత. దాంతో ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో అవకాశం వస్తే, సమంత కచ్చితంగా చేస్తారని ఎవరికి వారు ఊహించుకున్నారు. ఆ ఊహ నిజం కాదని సమంత ట్వీట్ తెలియజేసింది. ఆదివారం సాయంత్రం అభిమానులతో ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా తన మనోభావాలను పంచుకున్నారు సమంత. ఓ అభిమాని ‘క్వీన్’ సినిమాలో అవకాశం వస్తే చేస్తారా? అని అడిగితే - ‘‘ఈ సినిమాని రీమేక్ చేస్తే న్యాయం జరగదని నా ఫీలింగ్. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్సవుతుందనుకుంటున్నా. అందుకే ‘క్వీన్’ జోలికి వెళ్లకూడదు’’ అని పేర్కొన్నారు సమంత. -
ఆ లేఖ చదువుతుంటే పెదవులు వణికాయి!
గత పదిహేను రోజులుగా కంగనా రనౌత్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అభినందనల సముద్రంలో తడిసి ముద్దయిపోతున్నారు. దానికి కారణం ‘క్వీన్’ చిత్రం. కంగనా నాయికగా నటించిన ఈ చిత్రం విజయవిహారం చేయడంతో పాటు నటిగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. నిన్న మొన్నటివరకు కంగనా ఓ మోస్తరు నటి మాత్రమే అన్నవాళ్లు సైతం ‘క్వీన్’ చూసి కంగనా ‘అద్భుతమైన నటి’ అని ప్రశంసించేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏకంగా ఓ ఫ్లవర్ బొకే, స్వహస్తాలతో రాసిన ఓ అభినందన లేఖ కంగనాకి పంపించారు. ఆ విషయం గురించి చెబుతూ -‘‘ఆ రోజు మా ఇంటి కాలింగ్ బెల్ మోగితే, నా సోదరి రంగోలి వెళ్లి తీసింది. నా పేరుతో ఉన్న ఓ బొకే, లెటర్ని డెలివరీ బోయ్ అందజేశాడు. ‘నీ కోసం ప్రత్యేకంగా వచ్చిన బహుమతి ఇది’ అంటూ రంగోలి నా చేతికిచ్చింది. పూల బొకే చాలా అందంగా ఉంది. దాన్ని పక్కన పెట్టి, లెటర్ విప్పాను. నన్ను ప్రశంసిస్తూ అమితాబ్‌గారు రాసిన ఆ ఉత్తరం చదువుతుంటే పెదాలు వణికాయి. భారతీయ సినిమా చరిత్రలో భేష్ అనదగ్గ నటుల్లో అమితాబ్‌గారు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన ‘రాణీగా నువ్వు జీవించావు’ అంటూ.. ఇంకా నా నటన గురించి అద్భుతమైన పదాలతో ప్రశంసిస్తూ రాశారు. నాకైతే అంతా కలలా అనిపించింది. సినిమా పరిశ్రమలో గౌరవంతో పాటు ప్రేమాభిమానాలను కూడా పొందగలుగుతానని నేనూహించలేదు. అమితాబ్‌గారు మాత్రమే కాదు... సల్మాన్, షారుక్, ఆమిర్‌ఖాన్ ఇలా అందరూ అభినందించారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. -
కంగనా గౌను అదరహో!
కంగనా రనౌత్‌ని ‘ఫ్యాషన్ ఐకాన్’ అంటారు. కాస్ట్యూమ్స్ మొదలుకుని కాలి చెప్పుల వరకు చాలా ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారామె. దానికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనకాడరు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఓ సంఘటనను చెప్పుకోవచ్చు. ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు కంగనా. ఆ వేదికపై పొడవాటి గౌనులో మిలమిలా మెరిసిపోయారు ఈ హాట్ గాళ్. అది ఓ విదేశీ బ్రాండ్‌కి చెందిన గౌను. దాని ఖరీదు ఐదు లక్షల రూపాయలని విని చాలామంది నోళ్లు వెళ్లబెట్టారు. ఈ గౌనుని కంగనాకి పంపించడంతో పాటు, దాన్ని ఎలా తొడుక్కోవాలో కూడా ఆ ఉత్పత్తిదారులు వివరాలు పంపించారట. ఎలా తొడుక్కోవాలో కూడా సూచించారంటే.. అది ఎంత క్లిష్టమైన గౌనో అర్థం చేసుకోవచ్చు. అది తొడుక్కోవడానికి ఏం పాట్లు పడ్డారో కంగనాకే తెలుసు కానీ, ‘బ్యూటిఫుల్’ అంటూ బోల్డన్ని కాంప్లిమెంట్స్ మాత్రం కొట్టేశారట. -
కంగనతో కటీఫ్
న్యూఢిల్లీ: ఏమైందో ఏమో తెలియదు కానీ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్, ప్రియాంకాచోప్రా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటొంది. క్రిష్3లో వీరిద్దరూ హృతిక్ రోషన్‌కు జోడీగా కనిపించడం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రచారానికి భారీ ఏర్పాట్లు చేసిన నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ కంగన, ప్రియాంకను ఆహ్వానించాడు. అయితే కంగనతో కలిసి ప్రచారంలో పాల్గొనే ప్రసక్తే లేదని ప్రియాంక కుండబద్దలు కొట్టడంతో ఆయన కంగు తిన్నాడు. ‘ఈ సినిమా మ్యూజిక్ సీడీని ఆవిష్కరించినప్పుడు ప్రియాంక ముంబైలో లేదు. మిగతా వాళ్లంతా ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రచార కార్యక్రమాలకు నిర్మాత ఏర్పాట్లు చేసి నటులంతా పాల్గొనాలని కోరారు. ఆమె లాస్ఏంజిలిస్ నుంచి రాగానే పరిస్థితి మారిపోయింది. కంగనతో బహిరంగంగా కనిపించే ప్రసక్తే లేదని చెప్పింది’ అని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి రోషన్ ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ దిగిరావడం లేదు. వచ్చే నెల ఒకటిన విడు దలయ్యే క్రిష్ 3 ప్రచారం కోసం నిర్వహించే టీవీ షోల్లో ఈ ఇద్దరు విడివిడిగానే కనిపిస్తారు. ప్రియాంక, కంగన ఇంటర్వ్యూలు నిర్వహించే ఓ టీవీ చానెల్ అధికారి మాట్లాడుతూ ‘మా చానెల్‌కు వాళ్లిద్దరూ ముఖ్యమే. సల్మాన్‌ఖాన్ ఈ వారం నిర్వహించే షోలో కంగన కనిపిస్తుంది. ఇందులో ఆమె క్రిష్ 3 ప్రచారం కోసం పాల్గొనడం లేదు. అతిథిగానే పిలిచాం. వచ్చే వారం షోకు ప్రియాంక వస్తుంది’ అని ఆయన వివరించారు. ఈ వివాదంపై మాట్లాడడానికి అటు కంగన, ఇటు ప్రియాంక ముందుకు రావడం లేదు. -
పాదరక్షల విలువ లక్షా పాతిక వేలు!
విలాసవంతమైన జీవితం రాసి పెట్టి ఉంటే.. విలువైన వస్తువులు సైతం కాళ్ల దగ్గరకొస్తాయి. అవి దక్కించుకున్నవాళ్లు ఆనందంలో తేలిపోతే, పరాయివాళ్లు మాత్రం కుళ్లుకుంటారు. ప్రస్తుతం కంగనా రనౌత్ కాళ్లను అలంకరించిన పాదరక్షలు చూసి, కొంతమంది అసూయపడుతున్నారు. కారణం వాటి విలువ అక్షరాలా లక్షా పాతికవేల రూపాయలు. మీరు చదివింది నిజమే. అయితే అవి కంగనా సొంత డబ్బుతో కొనుక్కున్నవి కాదు. ‘క్రిష్ 3’ సినిమా కోసం కొన్నవి. హృతిక్‌రోషన్, ప్రియాంకచోప్రా, కంగనా రనౌత్ తదితరుల కాంబినేషన్లో స్వీయ దర్శకత్వంలో రాకేష్ రోషన్ రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇందులో కంగనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారట. ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తారట కంగనా.డ్రెస్‌లు, నగలు, పాదరక్షలు.. ఇలా అన్నీ వెరైటీగా ఉంటాయని సమాచారం. ఈ చిత్రంలో కంగనా రకరకాల పాదరక్షలతో కనిపిస్తారట. వాటిలో లక్షా పాతిక వేల పాదరక్షలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని ఊహించవచ్చు. ఇప్పటికే ఇవి బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి.