ఆలస్యంగా అర్థం చేసుకున్నాను!
లైఫ్ బుక్
‘జీవితానికి ఏదో ఒక అర్థం ఉండాలి’ అనే ఆలోచనతో మెడిసిన్‌ను మధ్యలోనే వదిలేశాను. నా జీవితానికి ఒక అర్థం ఉండాలంటే అది కళలతోనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు... ఇలా సినిమాల్లోకి వచ్చాను.
చిత్రసీమకు వచ్చిన కొత్తలో మిగతా వాళ్లతో పోల్చితే... నాకు పెద్దగా ఏమీ తెలిసేది కాదు. అర్థమయ్యేది కాదు. కెమెరా ఒకవైపు ఉంటే మరొక వైపున నిల్చొని నటించేదాన్ని. చీవాట్లు తినేదాన్ని. ఇలాంటివి సాంకేతిక విషయాలే అనుకుంటాంగానీ వాటి ప్రభావం ఇతర విషయాల మీద కూడా పడుతుంది. అయితే కాలక్రమంలో లోపాలను సరిదిద్దుకున్నాను.
చుట్టూ సరైన వాళ్లు లేకపోవడం వల్ల మనం ఏంచేస్తున్నామో మనకు అర్థం కాదు. నేను కూడా సరైన సలహాలు ఇచ్చే మంచివాళ్లు నా చుట్టూ లేకపోవడం వల్ల మంచి సినిమాల్లో చేసే అవకాశం పోగొట్టుకున్నాను. ‘ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది.
అహాన్ని తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసం నుంచి అహాన్ని మైనస్ చేయడం నేర్చుకోవాలి.
ఏ సమస్య వచ్చినా ‘సబ్ ఠీక్ హోజాయేగా’ ‘ఎవ్రీథింగ్ విల్ బి ఓకే’ అనుకుంటాను. అదృష్టం బాగుంటే ఆశించింది జరుగుతుంది. అలా కాని పక్షంలో దాని గురించి అయిదు నిమిషాలు కూడా ఆలోచించను.
ఆరోగ్యకరం కాని పోటీలో ఉండడం కంటే, అసలు పోటీలో ఉండక పోవడమే క్షేమం అనుకుంటాను.
సినిమా మాత్రమే నా ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో అది కూడా ఒకటి అని మాత్రమే అనుకుంటాను. వంట నేర్చుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, కొత్త భాషలు నేర్చుకోవాలి...ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి.
- కంగనా రనౌత్, హీరోయిన్