వైభవంగా సినీ అవార్డుల ప్రదానం
పురస్కారాలు అందుకున్న అమితాబ్, కంగనా, రాజమౌళి
‘ఫాల్కే’ అందుకున్న మనోజ్‌కుమార్
న్యూఢిల్లీ: 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం కన్నులపండువగా జరిగింది. మంగళవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ ఉత్తమనటుడు పురస్కారాన్ని అమితాబ్‌బచ్చన్ (పికూ చిత్రం), ఉత్తమనటి అవార్డును కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) అందుకున్నారు. వీరికి రజత కమలంతోపాటు రూ.50 వేల చొప్పుననగదును అందించారు. అలాగే దేశ సినీ చరిత్రలో సంచలనం సృష్టించి ఈ ఏటి ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి చిత్రానికిగాను దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని పురస్కారం అందుకున్నారు.స్వర్ణకమలం, ప్రశంసాపత్రంతోపాటు రూ.2.5 లక్షల నగదును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.దేశ సినీ పురస్కారాల్లో అత్యున్నతమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ను బాలీవుడ్ అలనాటి నటుడు మనోజ్ కుమార్ స్వీకరించారు.
వీల్‌చైర్‌లో వచ్చిన ఆయన స్వర్ణ కమలంతోపాటు రూ.10 లక్షల నగదును అందుకున్నారు. కాగా, తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘కంచె’ చిత్రానికి దర్శకుడు క్రిష్ అవార్డు అందుకున్నారు.
హాలీవుడ్‌పై ఆసక్తి లేదు.. రాజమౌళి: బాహుబలిఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సొంతం చేసుకుంది. హాలీవుడ్ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్‌తో బాహుబలిని చిత్రించినప్పటికీ హాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదని రాజమౌళి చెప్పారు. తనకు ఇక్కడ సినిమాలు తీయడమే సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. అశోకా, అక్బర్, మహారానా ప్రతాప్ లాంటి రాజుల కథలతో సినిమాలు చేయాలని ఆసక్తి ఉందని తెలిపారు.