
రాణీకే కిరీటం!
నటిగా కంగనా రనౌత్ ఏ స్థాయిలో విజృంభించగలుగుతారో నిరూపించిన చిత్రం ‘క్వీన్’. అప్పటివరకూ ‘ఆ ఏముంది.. గ్లామర్ ఆర్టిస్టే కదా’ అన్నవాళ్లు సైతం కంగనాని అద్భుతమైన నటి అని అభినందించేశారు. నటిగా తన గౌరవాన్ని పెంచిన చిత్రం ఇది. ఇప్పటికే ఈ చిత్రానికి, కంగనాకి పలు అవార్డులు వచ్చాయి. తాజాగా, ముంబయ్‌లో జరిగిన 60వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో కూడా ‘క్వీన్’కే కిరీటం దక్కింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి (కంగనా రనౌత్), ఉత్తమ దర్శకత్వం (వికాస్ బాల్), ఉత్తమ ఛాయాగ్రహణం (బాబీసింగ్, సిద్ధార్ధ్ దివాన్), ఉత్తమ నేపథ్య సంగీతం (అమిత్ త్రివేది), ఉత్తమ ఎడిటింగ్ (అభిజిత్ కొకాటె, అనురాగ్ కశ్యప్).. ఇలా ఆరు విభాగాల్లో ‘క్వీన్’ అవార్డులు దక్కించకోవడం విశేషం. ఇంకా ‘హైదర్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా షాహిద్‌కపూర్, ఉత్తమ సహాయ నటిగా టబు, సహాయ నటుడిగా కేకే మీనన్‌లకు అవార్డులు దక్కాయి.