విలేకరిపై హీరోయిన్ పూజా హెగ్డే ఫైర్ అయింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్‌గా ఉండే పూజా ఇంతలా ఫైర్ అవ్వడానికి గల కారణం..విలేకరి ఓ ప్రశ్నను పదే పదే అడగడమే. ఎన్నిసార్లు సమాధానం చెప్పినా.. మళ్లీ అదే ప్రశ్న అడగడంతో పూజా ఫైర్ అయింది. ఇంతకీ విలేకరి అడిగిన ప్రశ్న ఏంటి?
అదృష్టం అనుకుంటే అనుకోండి
వరుస అపజయాలతో సతమతమవుతున్న పూజా హెగ్డే(Pooja Hegde )కి ‘దేవా’ (Deva)మూవీ మంచి ఉపశమనం ఇచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో షాహిద్‌తో కలిసి పూజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అయితే ఇంటర్వ్యూలో మధ్యలో విలేకరి.. ‘బాలీవుడ్ అగ్ర హీరోలైన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడాన్ని అదృష్టంగా భావిస్తారా? ఆయా చిత్రాలకు మీరు అర్హులేనని అనుకుంటున్నారా?’ అని అడిగారు. దీనికి పూజా కూల్‌గానే సమాధానం చెప్పింది. ‘ఆ సినిమాలకు నేను కచ్చితంగా అర్హురాలినే. ఆయా సినిమాల్లో నన్ను ఎంచుకోవడానికి దర్శకనిర్మాతలకు కొన్ని కారణాలు ఉంటాయి. ఒక అవకాశం వచ్చినప్పడు దానికి అనుగుణంగా పని చేసి ఆ పాత్రకు న్యాయం చేయాలి. నేను అదే పని చేశాను. దాన్ని మీరు అదృష్టం అనుకుంటే అనుకోండి. నేను ఏ మాత్రం బాధపడను’ అని పూజా సమాదానం ఇచ్చింది.
ఫైర్ అయిన పూజా.. కూల్ చేసిన సాహిద్
పూజా సమాధానం చెప్పిన తర్వాత కూడా సదరు విలేకరి ‘మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల చిత్రాలైతేనే చేస్తారా?’అని మళ్లీ అడిగాడు. ఇలా స్టార్ హీరోలపైనే వరుస ప్రశ్నలు వేయడంతో పూజా హెగ్డే సహనాన్ని కోల్పోయింది. ‘అసలు మీ సమస్య ఏంటి? ఏం సమాధానం కావాలి’ అంటూ ఫైర్ అయింది. దీంతో షాహిద్ వెంటనే కలగజేసుకొని మ్యాటర్‌ని డైవర్ట్ చేశాడు.‘నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతడికి ఇష్టం అనుకుంటా. అతడు కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ అని చెప్పాడు.
‘దేవా’లో హిట్ ట్రాక్
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలలో అలరించింది పూజా హెగ్డే. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఆమె ఖాతాలో సరైన హిట్టే పడలేదు. అయినా కూడా స్టార్స్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో పూజాకి ఇక్కడ ఆఫర్స్ తగ్గాయి. దీంతో బాలీవుడ్‌నే నమ్ముకుంది ఈ పొడుగు కాళ్ల సుందరీ. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. దీంతో పూజా కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పూజాకి మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘దేవా’ మంచి టాక్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం పూజా రెండు భారీ సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి దళపతి విజయ్ ‘జన నాయగన్’ కాగా, మరొకటి సూర్య హీరోగా నటిస్తున్న 'రెట్రో'. ఈ రెండింటిపై పూజా చాలా ఆశలు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment