బాలీవుడ్‌లో బ్లడ్డే!
బ్లడ్ రిలేషన్ ఉంటే కానీ బాలీవుడ్‌లో వర్కవుట్ అయ్యేట్టు కనిపించడం లేదు. హీరోలు, హీరోయిన్లు, విలన్లు, రైటర్లు, కొరియోగ్రాఫర్లు, కెమేరామేన్లు.. లిస్ట్ నెవర్ ఎండింగ్. బాలీవుడ్‌లో తెర మీద, తెర వెనకా, పక్కనా... అంతా బ్లడ్డే. రక్తం చిందిస్తున్నారనుకోకండి! మరి ఏం చిందిస్తున్నారు? బంధుప్రీతిని చిలకరిస్తున్నారు. దీంట్లో ఏమీ తప్పు లేదు. బంధువులుంటే మాత్రమే గొప్పవారు కాదు. కానీ అవకాశం మాత్రం ‘రిలేటీవ్’లీ ఈజీ..
‘బ్యాగ్రౌండ్’ ఉంటే ఆ బలమే వేరు. ‘ఒక్క ఛాన్స్’ ఈజీగా వచ్చేస్తుంది. ప్రూవ్ చేసుకుంటే ‘స్టార్‌డమ్’ ఇట్టే వచ్చేస్తుంది. అందుకే ఇండస్ట్రీలో బంధువులున్నవాళ్లు అదృష్టవంతులు అంటుంటారు. ఇదే విషయాన్ని బాలీవుడ్ హాట్ గాళ్ కంగనా రనౌత్ పదే పదే అంటుంటుంది. డైరెక్ట్‌గా బాలీవుడ్ బడా నిర్మాత–దర్శకుడు కరణ్ జోహర్‌పై అతని షోలోనే నిర్మొహమాటంగా సెటైర్ కూడా వేసేసింది.
‘‘ఒక వేళ నా జీవితం ఆధారంగా సినిమా తీస్తే, అప్పుడు బయటివారు ఇండస్ట్రీకి రావడాన్ని భరించలేని బాలీవుడ్ పెద్దమనిషి పాత్రను నువ్వే చేయాల్సి ఉంటుంది. ‘నెపోటిజమ్ (బంధుప్రీతి) జెండా పట్టుకు తిరిగే వ్యక్తివి. మూవీ మాఫియా’’ అని ‘కాఫీ విత్ కరణ్’ షోలో కంగనా ఘాటుగా స్పందించింది. కరణ్ ఊరుకుంటారా? కంగనాకి గట్టి సమాధానమే చెప్పారు.
‘‘సొంత అభిప్రాయాలు ఉండటం తప్పు కాదు. కానీ, ఒకరి గురించి అభిప్రాయం చెప్పేటప్పుడు మాత్రం ఆలోచించాలి. బంధుప్రీతి జెండా పట్టుకు తిరిగేవాణ్ణి అని కంగనా నన్ను నిందించింది. అసలు బంధుప్రీతి జెండా పట్టుకు తిరగడం అనే వాక్యానికి తనకు అర్థం తెలుసో లేదో? నేనేమన్నా నా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా, బావమరుదులతో సినిమాలు చేస్తున్నానా? 15 మంది డైరెక్టర్లను పరిచయం చేశాను. వాళ్లకు ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదు. తరుణ్ మన్‌సుఖాని, పునీత్ మల్హోత్రా, శకున్ బత్రా, శశాంక్ ఖైతాన్.. ఇలా నేను పరిచయం చేసిన దర్శకులెవరూ పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవారు కాదే? ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ద్వారా నేను పరిచయం చేసిన వరుణ్ ధవాన్, ఆలియా భట్‌లకు బ్యాగ్రౌండ్ ఉన్న మాట నిజమే.
కానీ, అదే సినిమా ద్వారా పరిచయం చేసిన సిద్ధార్థ్ మల్హోత్రా బయట నుంచి వచ్చిన వ్యక్తే కదా. ‘మూవీ మాఫియా’ అని కంగనా అనడానికి అర్థం ఏంటో తనకే తెలియాలి. నేను తనతో సినిమాలు చేయకపోతే అది మూవీ మాఫియానా? కంగనాతో సినిమా చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నాకుంటుంది. నా ‘కాఫీ విత్ కరణ్’లో కంగనా ఘాటుగా స్పందించింది. అది నా షో కాబట్టి, నేను అనుకుని ఉంటే తన మాటలను ఎడిట్ చేసి ఉండొచ్చు. కానీ, తన అభిప్రాయం చెప్పింది. తన మాటలను ప్రపంచానికి వినిపించాలనుకున్నా. అందుకే ఎడిట్ చేయలేదు’’ అన్నారు కరణ్.
ఓ వివాదం చెలరేగడానికి ఈ మాత్రం చాలు. ఇప్పుడు బాల్ కంగనా, కరణ్‌ల కోర్ట్ నుంచి బయటికొచ్చేసింది. ఈ ఇద్దరి వ్యాఖ్యలకు ఇతర ప్రముఖులు స్పందించడం మొదలుపెట్టారు. కొంతమంది తారలు ‘బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం’ అంటున్నారు. కొంతమందేమో.. బయటివాళ్లకూ ఇక్కడ మంచి అవకాశాలు దక్కుతున్నాయంటున్నారు. అసలు బాలీవుడ్‌లో ‘ఫిల్మీ బ్యాగ్రౌండ్’, ‘నాన్ ఫిల్మీబ్యాగ్రౌండ్’కి చెందినవాళ్లెవరో తెలుసుకుందాం.
ఎవరేమన్నారు?
బంధుప్రీతి సహజమే
ప్రతి ఒక్కరికీ బంధుప్రీతి అనేది సహజమే. మనం ఇష్టపడే వారికి సహాయం చేయాలనుకుంటాం. అది కుటుంబ సభ్యు లైనా, వేరేవాళ్లయినా కావచ్చు. ‘నెపోటిజమ్’ వివాదంలో నేను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. – హీరో ఆమిర్ ఖాన్
ప్రతిభ ఉంటే అవకాశాలు దక్కుతాయి
బంధుప్రీతితో నాకు అవకాశాలు దూరమైన అనుభవాలు లేవు. నాకు బ్యాగ్రౌండ్ లేదు. కష్టపడితే ఇండస్ట్రీలో కొనసాగడం పెద్ద సమస్య కాదు. కంగనా ప్రతిదీ తనదే అన్నట్లు ఫీల్ అవుతుంది. అయితే అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండవు. బాలీవుడ్‌లో నెపోటిజమ్ ఉంది. అయితే అది బయటివాళ్ల రాకకు ఆటంకం కాదనుకుంటున్నా.
– హీరోయిన్ విద్యాబాలన్
బ్యాగ్రౌండ్ అవసరం లేదు
టాలెంట్ ఉండి కష్టపడితే మనతో కలిసి పనిచేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. ఇందుకు బ్యాగ్రౌండ్ అవసరం లేదు. నన్ను లాంచ్ చేసిన ఆదిత్య చోప్రా అంటే గౌరవం. రణ్‌వీర్‌సింగ్, పరిణీతి చోప్రా, నేను ఇండస్ట్రీకి అవుట్‌సైడర్స్‌మే. నెపొటిజమ్ వల్ల నేను ఇబ్బంది పడిన సందర్భాలైతే ఇప్పటివరకూ లేవు.
– అనుష్కా శర్మ
ఎక్కడ ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి
నాకు కంగనా గురించి పూర్తిగా తెలీదు. కరణ్ బాగా తెలుసు. ఇప్పుడు నేను స్పందిస్తే అవకాశవాదంగా ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. కంగనా స్త్రీవాదాన్ని బలంగా వాదిస్తుంది. ఆమె పాత్రలను ఎంపిక చేసుకునే విధానాన్ని నేను గౌరవిస్తాను. ‘కాఫీ విత్ కరణ్’ షోలో రెండు సార్లు పాల్గొన్నా. ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అవే మాట్లాడాలి. అందుకే ఆ షోలో చర్చించదగ్గ విషయాలనే మాట్లాడా. ఇతరులపై అభాండాలు వేయకుండా కూడా షో కంప్లీట్ చేయవచ్చు.
– హీరోయిన్ సోనమ్ కపూర్
స్టార్ కిడ్ అయినా ప్రూవ్ చేసుకోవాల్సిందే
బంధుప్రీతి వల్ల వారసులకు మొదటి అవకాశం సులభంగా వస్తుంది. ఆ తర్వాత వాళ్లు ప్రతిభను నిరూపించుకోవాలి. ఏం సాధించకుండా కనుమరుగైన వారసులు చాలామందే ఉన్నారు. మరి వాళ్ల గురించి ఎవ్వరూ నోరు మెదపరే? ప్రేక్షకులు యాక్టర్స్ నటన చూడడానికి మాత్రమే వస్తారు. అంతేగానీ ఆ యాక్టర్ కుంటుంబ గౌరవాన్ని చూసేందుకు కాదు. భట్ ఫ్యామిలీలో పుట్టడం నా చేతుల్లో లేదు. నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో నేను ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వలేదు. ఎంతో కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.
– ఆలియా భట్
బంధుప్రీతి మెండుగానే ఉంది
బాలీవుడ్‌లో బంధుప్రీతి మోతాదుకు మించే ఉంది. ప్రతిభ మీదే ఆధారపడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇక్కడ ఎవ్వరూ ప్రభుత్వ పరీక్షలు నిర్వహించడం లేదు. రాచరికం ఎప్పటినుంచో ఉంది. స్టార్ కిడ్స్‌కు రిలేషన్స్‌తో కాస్టింగ్ కాల్స్ వస్తాయి. అలాగని ఇండస్ట్రీ మొత్తం వాళ్లే లేరు. షారుక్ ఖాన్, ప్రియాంక, కంగనాలకు ఏ రిలేషన్స్ ఉన్నా యని ఇండస్ట్రీలో టాప్‌స్టార్లుగా ఉన్నారు?
– హీరోయిన్ స్వర భాస్కర్
బ్లడ్ కాదు...
ఫ్యామిలీ అండతో వస్తున్నవారే కాదు. ఎలాంటి అండ లేకుండా ప్రతిభనే నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి, సక్సెస్ అవుతున్నవాళ్లూ ఉన్నారు. ప్రతిభ ఉన్నోళ్లకు పరిచయాలు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌లు అవసరం లేదని షారుక్ ఖాన్, అక్షయ్‌కుమార్, జాన్ అబ్రహాం, ఇర్ఫాన్‌ఖాన్ వంటి స్టార్ హీరోలు నిరూపించారు. ప్రస్తుత స్టార్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా, విద్యాబాలన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, తాప్సీ, రాధికా ఆప్టే తదితరులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ దక్కించుకున్నవారే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్టార్స్ అయిన ప్రముఖులు మరెందరో ఉన్నారు.