
వరించి వచ్చిన పాత్ర
హిందీ రంగంలో ఇప్పుడు నటనకు అవకాశమున్న పాత్రలంటే చాలామంది దర్శక, నిర్మాతలు కంగనా రనౌత్‌ని ఎంపిక చేసుకుంటున్నారు. ‘తను వెడ్స్ మను, క్వీన్, రజ్జో’ చిత్రాల్లో కంగన ప్రదర్శించిన అభినయం అలాంటిది. ‘క్వీన్’లో నటనకు తాజాగా జాతీయ అవార్డునూ ఆమె అందుకున్నారు. అందుకు తగ్గట్లే తాజా అవకాశాల్లో అందాల అభినేత్రి మీనాకుమారి జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రం ఒకటి. ఈ చిత్రానికి తిగ్మాంషు ధూలియా దర్శకత్వం వహించనున్నారు. మీనాకుమారి పాత్రకు ముందు విద్యాబాలన్‌ను తీసుకోవాలనుకున్నారనే వార్త వినిపించింది. ఆ తర్వాత దీపికా పదుకొనే పేరు కూడా ప్రచారంలోకొచ్చింది.
చివరికి ఈ అవకాశం కంగనాను వరించింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే ధ్రువీకరించారు. ‘‘మీనాకుమారి జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో టైటిల్ రోల్ చేయనున్నా. అయితే ఆ చిత్రం ఇప్పుడే ఆరంభం కాదు. ఎందుకంటే ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. అవి పూర్తయ్యేసరికి మరో ఏడాది పడుతుంది. అందుకని మీనాకుమారి చిత్రం వచ్చే ఏడాది వేసవి తర్వాతే మొదలవుతుంది’’ అని కంగన పేర్కొన్నారు. ఈలోపు మీనాకుమారి జీవితం గురించి పూర్తిగా తెలుసు కోవాలనుకుంటున్నారామె.