నాకు ఇంగ్లీష్ ఒక్కముక్క రాదు!
ఇవాళ దేశమంతటా చెప్పుకుంటున్న హీరోయిన్లలో రింగు రింగుల జుట్టు కంగనా రనౌత్ ఒకరు. ప్రస్తుతం ఆమెను అందరూ హిందీ సినీసీమకు ‘క్వీన్’ అంటున్నారు. కానీ, ఈ సక్సెస్ సాధించడం ఆమెకు అంత సులభమేమీ కాలేదు. ఆ సంగతే చెబుతూ, ‘‘నా జీవితమేమీ అంత హాయిగా, జానపదకథలా సాగిపోలేదు. దాదాపు పదేళ్ళ పాటు నానా కష్టాలు పడ్డాను. ఇవాళ నేను ఉంటున్నదానికీ, అప్పటికీ సంబంధమే లేదంటే నమ్మండి’’ అని కంగనా రనౌత్ అన్నారు. ‘‘అప్పట్లో నాకు అస్సలు ఒక్కముక్క కూడా ఇంగ్లీష్ రాదు. ఆ మాట చెబితే - ఇంగ్లండ్‌లోని జనమైనా సానుభూతితో అర్థం చేసుకుంటారేమో కానీ, ముంబయ్‌లో పరిస్థితి వేరు.
మీకు ఇంగ్లీష్ రాదంటే, ‘ఆమె హిందీ సినిమాల్లో ఇంకెలా పనిచేస్తుంది’ అని అంటారు. కానీ, వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డాను. నా మీద నాకున్న అవగాహన మారకపోవడం వల్లే నేనివాళ ఈ స్థితిలో ఉన్నా’’ అని కంగన చెప్పుకొచ్చారు. ఉత్తరాదిలో ఒక చిన్న పట్నంలో పెరిగిన ఈ అభినయ తారకు మొదటి నుంచీ ఆడవాళ్ళ పట్ల మన దేశంలో ఉన్న అభిప్రాయంతో విభేదాలున్నాయి. ‘‘ఆడపిల్ల అంటే, ఎర్రగా, బుర్రగా, అందంగా ఉండాలనీ, అలా పెరగాలనీ, అందుకు తగ్గ జీవిత భాగస్వామిని పొందితే చాలనీ పెద్దలు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది చెప్పుకోలేనంత బాధ. అందుకే, మన దేశపు తల్లితండ్రులు కోరుకొనే తరహా పిల్లను కాదు నేను’’ అని కంగన చెప్పుకొచ్చారు. మొత్తానికి, కంగన మాటల్లో నిజం ఎంత ఉందో, నివ్వెరపరిచే అంశాలూ అన్నే ఉన్నాయి కదూ!