నన్ను నాశనం చేయడానికి డబ్బు ఖర్చుపెట్టారు!
‘‘ఇప్పుడందరూ నన్ను ‘క్వీన్’ కంగనా అంటున్నారు. పొగడ్తలూ పూలదండలూ విరజిమ్ముతున్నారు. కానీ, నేను సినిమాల్లోకొచ్చిన కొత్తలో చాలామంది నన్ను పలకరించడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. ఎందుకంటే, హిమాచల్ ప్రదేశ్ వంటి చిన్న టౌన్ నుంచి వచ్చానని నన్ను చిన్న చూపు చూసేవాళ్లు. సినిమా పరిశ్రమకు సంబంధం లేనివాళ్లు ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. బయటివాళ్లను తొక్కేయాలనుకుంటారు. నన్ను నాశనం చేయడానికి చాలామంది డబ్బు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడలేదు.
దానికోసం ఎంతో సమయం కూడా కేటాయించారు. కానీ, ఒకరి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. వాస్తవానికి నా మీద కుట్రలు జరుగుతున్నాయని గ్రహించే వయసు, అనుభవం ఉండేది కాదు. నా పదహేడవ ఏట సినిమాల్లోకొచ్చాను. ఆ వయసులో ఎవరు తప్పు? ఎవరు సరి అని ఎలా తెలుస్తుంది? తప్పుడు వ్యక్తులెవరో తెలుసుకుని, వాళ్లకు దూరంగా ఉండటానికి నాకు చాలా సమయం పట్టింది. మనుషుల మనస్తత్వాలను గ్రహించేంత నేర్పు వచ్చేసింది. ఇప్పుడు నన్నెవరూ తప్పుదారి పట్టించలేరు. ఆ మాటకొస్తే ఏమీ చేయలేరు.’’
- కంగనా రనౌత్