‘మెంటల్‌’ వారిదేనట.... | Ekta Uses Salmans Mental Title | Sakshi
Sakshi News home page

‘మెంటల్‌’ వారిదేనట....

Published Mon, Mar 12 2018 12:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Ekta Uses Salmans Mental Title - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో ఉండే వారెవరైనా ఈ మధ్యకాలంలో వచ్చిన కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ల ‘మెంటల్‌ హై క్యా’ సినిమా పోస్టర్లను చూడకుండా ఉండరు. పోస్టర్లతోనే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటే... బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, అతని సోదరుడు సోహాలి ఖాన్‌ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. విషయమేంటంటే ‘మెంటల్‌’ టైటిల్‌ను ఈ బాలీవుడ్‌ బ్రదర్స్‌ చాలా కాలం క్రితమే తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఏక్తాకపూర్‌ ఈ పేరుకు దగ్గరగా ఉండేలా ‘మెంటల్‌ హై క్యా’ టైటిల్‌ను పెట్టడం వీరి అసంతృప్తికి కారణమైంది.

గతంలో సోహాలి తీసిన ‘జయ హో’(2014)కు, కబీర్ ఖాన్‌ తీసిన ‘ట్యూబ్‌లైట్‌’కు  ముందుగా ‘మెంటల్‌’ టైటిల్‌నే అనుకున్నారు. ఖాన్‌ బ్రదర్స్‌ ఈ టైటిల్‌ను వాడుకునే లోపే ఏక్తా తన సినిమా పేరు ‘మెంటల్‌ హై క్యా’ అని ప్రకటించింది. అంటే ఆమె వీరి టైటిల్‌ను దొంగిలించిందనే చెప్పవచ్చు. అందుకే వారు ఏక్తాపై అసహనంగా ఉన్నారని, కనీసం ఏక్తా వారిని అడిగి వుంటే ఆమెకు ఇచ్చేవారు అని ఖాన్‌ కుంటుంబ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇదే విషయం గురించి సోహాలి ఖాన్‌ను అడగ్గా ‘మేము ‘మెంటల్‌’ టైటిల్‌ను ఏక్తాకు ఇవ్వలేదు, ఆమె కనీసం మమ్మల్ని అడగలేదు’ అన్నారు.

‘క్విన్‌’(2014) సినిమా తర్వాత కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ నటిస్తున్న చిత్రం ‘మెంటల్‌ హై క్యా’. మానసిక అనారోగ్యం, భ‍్రమల చూట్టూ తిరిగే ఈ థ్రిల్లర్‌ చిత్రానికి జాతీయ అవార్డు విజేత ప్రకాశ్‌ రావ్‌ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement