కామన్ క్వీన్ | Common Queen .. | Sakshi
Sakshi News home page

కామన్ క్వీన్

Published Sat, Jun 13 2015 10:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కామన్ క్వీన్ - Sakshi

కామన్ క్వీన్

‘క్వీన్’ సినిమాలో కంగనా రనౌత్ క్వీన్ కాదు. కానీ సినిమాల్లోకి రాకముందు,  సినిమాల్లోకి వచ్చాకా ఆమె క్వీనే. కంగనా... రాజపుత్రుల వంశంలో  ఒక రాజపుత్రిక. అక్కణ్ణుంచి ఒక మామూలు అమ్మాయిగా సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్‌లో ఇప్పుడు కొత్తగా వెలిగిపోతున్న క్వీన్ అయింది. అయినా మామూలు అమ్మాయిగానే కనిపిస్తుంది. అందుకే కంగనా రనౌత్ ఒక సాధారణ మహారాణి. కామన్ క్వీన్.
 
 2014. వేసవి.

 ‘క్వీన్’ రిలీజ్ అయ్యింది. చిన్న బడ్జెట్‌తో దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. కథాంశం: పెళ్లి ఆగిపోయి తీవ్ర నిస్పృహల్లోకి వెళ్లిన ఒక అమ్మాయి ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఒక్కత్తే హనీమూన్‌కు యూరప్ వెళ్లడం. కన్నీరు మున్నీరు అవుతూ విమానం ఎక్కిన ఆ అమ్మాయి కొత్త స్నేహాలు, పరిచయాలు, ప్రపంచాలు చూసి ఆత్మవిశ్వాసం తెచ్చుకుని, జీవితాన్ని ఎదుర్కొనడం తెలుసుకొని, ఎవడైతే కాదన్నాడో వాడు ఆమె ముందు తనను తాను మరుగుజ్జుగా భావించేంతగా ఎదుగుతుంది. కథ గొప్పదే. కాని తెరకెక్కించడానికి డబ్బులే లేవు. అప్పుడొక లక్ష, అక్కడొక లక్ష దొరికినప్పుడే షూటింగ్ చేశారు. ప్రతి క్షణం సినిమా ఆగిపోతుందేమోనన్న భయం. కాని ప్రతి సందర్భంలోనూ కంగనా ఉందన్న ధైర్యం. తను ఉంటే ఎనర్జీ. మరేం పర్వాలేదనే ధైర్యం. తనే యూనిట్‌ని డ్రైవ్ చేస్తుంది. షెడ్యూల్స్ వేస్తుంది. అంతెందుకు, కొన్ని సీన్లకు స్క్రిప్ట్, డైలాగ్స్ కూడా రాసి డెరైక్టర్ చేతికిచ్చింది. ఇది ఆమె ప్రోడక్ట్. రిలీజ్ మీద భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది.

 అలాంటి ‘క్వీన్’ రిలీజయ్యింది. మొదటి రోజు నుంచే మీడియాలో రేటింగ్స్. హిట్ సూపర్ హిట్... అంటూ ప్రశంసలు. కొత్త ప్రొడ్యూసర్ల ఆఫర్లు. 100 కోట్ల కలెక్షన్లు. కంగనా ఫోన్‌కు ఊపిరే సలపడం లేదు. కాని అంతటి రద్దీలోనూ కంగనా ఒక ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అది రాలేదు. సంవత్సరం గడిచిపోయింది. 2015, వేసవి.నేషనల్ అవార్డ్స్  ప్రకటన వెలువడింది. కంగనా జాతీయ ఉత్తమ నటి. ‘క్వీన్’లో ఆమె నటన చూసి యునానిమస్‌గా ఓటేసిన జ్యూరీ. మళ్లీ కంగనాకు ఫోన్ల వరద. అన్ని ఫోన్లను కంగనా ఆన్సర్ చేస్తూ ఉంటే  స్క్రీన్ మీద కనిపించిన నంబర్‌కు ఆమె గుండె గబగబా కొట్టుకుంది. తాను ఎదురు చూస్తున్న ఫోన్ అదే. ఆన్సర్ బటన్ నొక్కి ‘నాన్నా’.. అంది.
 
అవతల వైపు ఏం మాట లేదు.
 బహుశా ఆయన కంఠం రుద్ధమై ఉండాలి.
 చాలా ప్రయత్నం మీద గొంతు పెగిలింది.
 ‘సాధించావమ్మా’.అంతే. కంగనా తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి సోఫాలో కూలబడి రెండు చేతులనూ ముఖానికి కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
           
 2003. వేసవి.
 సెలవులకు కంగనా చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న తన సొంత ఊరు భామ్‌బ్లా వచ్చింది.
 అప్పటికే ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. తాను కెమిస్ట్రీ తప్పింది. అది తండ్రికి పెద్ద వార్త కాదు. ఏదో నాలుగు ముక్కలు చదివించి పెళ్లి చేద్దామని ఆయన ఉద్దేశం. కాని కంగనా చదువు మానేసి సినిమాల్లో చేరదల్చుకుంది. ఇది మాత్రం పిడుగు. అసలే వాళ్లు కొండ ప్రాంతం వాళ్లు. సిమ్లాలో తప్ప ఎక్కడా సినిమా థియేటర్ కూడా చూసి ఎరగరు. అలాంటిది తన కూతురు వెళ్లి సినిమాల్లో చేరుతుందా? తండ్రి మాత్రమే కాదు, అన్న, చుట్టుపక్కల బంధువులు అందరూ పోగయ్యారు. ఇప్పుడు కంగనా నిర్ణయం మీద మొత్తం సమూహపు గౌరవమే ఆధారపడి ఉంది.

 ఎందుకంటే వాళ్లు రాజపుత్రులు.
 ‘రాణులు, మహరాణులు ఉన్న క్షత్రియజాతి మనది. ఈ జాతి నుంచి వెళ్లి నువ్వు తెర మీద తైతక్కలాడతావా’ ఎవరో అన్నారు.
 ‘ఆడతాను’ ‘నోర్ముయ్’ తండ్రి గద్దించాడు. ఆ వెంటనే ఆమె చెంప ఛెళ్లుమంది. తండ్రిలో ప్రవహిస్తోంది క్షత్రియ రక్తం అయినప్పుడు కూతురిలో పరుగులెత్తేది క్షత్రియ రక్తం కాదా? కంగనా ఒక్క నిమిషం కూడా ఆగకుండా బ్యాగ్ సర్దుకుంది. ‘నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను’ ప్రకటించింది. గడప దాటుతూ తండ్రి వైపు చూసి అంది-  ‘మనలో రాణులు మహరాణులు ఇప్పుడు లేరు. పోయారు. వెండితెర మీద నేనే కాబోయే మహరాణిని. నన్ను చూసి మీరు గర్వపడేరోజు త్వరలోనే వస్తుంది’...బంధువులు ఎగతాళిగా నవ్వారు.తండ్రి ఆమెకు ఇంటి గడప వైపు దారి చూపించాడు. అదంతా గుర్తుకు వచ్చి కంగనా ఏడ్చింది. ఇంతకాలం రచ్చ గెలిచింది. అది విజయం కాదు. ఇప్పుడు ఇంట గెలిచింది. అదే అసలైన విజయం. కాని అది అంత సులభంగా రాలేదు.
           
 ఆ సంవత్సరమే. అదే వేసవి.
 కంగనా ఢిల్లీ వచ్చింది. ఏం చేయాలో తెలియదు. ఎలా బతకాలో తెలియదు. యాక్టర్ అవ్వాలంటే ఎవరిని కలవాలో తెలియదు. అందుకని అక్కడ చురుగ్గా పని చేస్తున్న ‘అస్మిత’ అనే థియేటర్ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. దాని స్థాపకుడు అరవింద్ గౌర్ చాలా పెద్ద థియేటర్ పర్సనాలిటీ. కంగనాను చూసి అతడు ఒకటే ప్రశ్న అడిగాడు- నీకు యాక్టింగ్ గురించి ఏం తెలుసు? దానికి కంగనా జవాబు: ఏమీ తెలియదు. కాని నేను బ్లాటింగ్ పేపర్‌లాంటిదాన్ని. మీరు ఏది చూపించినా లాగేస్తాను. సరిగ్గా ఒక సంవత్సరానికి మించి కంగనా ఢిల్లీలో ఉండలేదు. పదిహేడేళ్ల అగ్గిబరాటా లాంటి అమ్మాయి. ముంబైని తగలెట్టడానికి బయలుదేరింది.
           
 2006. వేసవి.
 కంగనా నటించిన తొలి సినిమా- గ్యాంగ్‌స్టర్ విడుదలయ్యింది. మహేష్‌భట్ ప్రొడ్యూసర్‌గా లాంచ్ చేస్తున్న హీరోయిన్. వేల మందిని ఆడిషన్‌లో ఫెయిల్ చేసి డెరైక్టర్ అనురాగ్ బాసు సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్. కాని మొదటి అడుగు అలా పడాల్సింది లేదా అంత బలంగా పడాల్సింది కాదు. స్క్రీన్ మీద ఆల్కహాలిక్‌గా గతంలో మీనాకుమారి వంటి అతి తక్కువ మందే మార్కులు కొట్టేశారు. కాని తాగుబోతు స్త్రీగా కంగనా చూపించిన నటన అందరికీ అద్భుతంగా అనిపించింది. ఒక మార్కు పడితే అదే మార్కు వెంటపడుతుంది. లైఫ్ ఇన్ ఏ మెట్రో, ఫ్యాషన్... రెండూ హిట్ సినిమాలే. కాని కంగనా చేసింది మాత్రం నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లు. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్... ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పాత్రల కోసం అందరూ కంగనాను అడగడం మొదలుపెట్టారు. అసలు నిజ జీవితంలో కూడా కంగనా అలాంటి అమ్మాయే అని బయట ప్రచారం. అంతా మబ్బుమబ్బుగా అనిపిస్తోంది. మూసుకు వస్తున్నట్టుగా భయమేస్తోంది. మళ్లీ వేసవి రావాలి. వచ్చింది.
           
2011. మరో వారంలో వేసవి మొదలవుతుంది.
‘తను వెడ్స్ మను’ రిలీజ్ అయ్యింది.
 ఆనంద్ రాయ్ అనే కుర్రాడు ఉత్తరప్రదేశ్ లైఫ్‌ని, అక్కడి మిడిల్‌క్లాస్ పెళ్లిళ్లని రియలిస్టిక్‌గా చూపించిన సినిమా. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకుంటూ దాదాపు జీవితం నాశనం చేసుకోబోయిన ఆరిందా అమ్మాయి పాత్రలో కంగనా నటన ఆమెలో ఉన్న డిప్రెసివ్ కోణాన్ని శాశ్వతంగా తుడిచి పెట్టేసింది. మరో రెండేళ్లకు వచ్చిన క్రిష్ 3- కంగనా సైఫై క్యారెక్టర్లు కూడా ఎంత బాగా చేయగలదో చూపించింది. క్వీన్ ఆమె స్థాయిని స్థిర పరిచింది. దాదాపు శిఖరం చేరినట్టే. కాని అక్కడ నిలబడే సత్తా ఆమెలో ఉందా లేదా అనే సందేహాన్ని తీరుస్తూ 2015 వేసవి ఆమె కోసం ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తీసుకొచ్చింది. గతంలో హేమమాలిని, శ్రీదేవి డ్యూయెల్ రోల్స్ చేసి మెప్పించారు. ఇంకెవ్వరికీ అది సాధ్యం కాలేదు. కంగనా ఈ సినిమాలో దానిని నమ్మశక్యం కాని రీతిలో చూపించింది. గృహిణిగా ఒకపాత్ర, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకున్న హర్యానా అమ్మాయిగా మరో పాత్ర.... ఒకే తెర మీద ఒకే సమయంలో ఇద్దరు వేరు వేరు వ్యక్తులు చేస్తున్నట్టుగా భ్రాంతి కలిగించింది. కలెక్షన్లు మోగిపోయాయి. మూడు వారాల్లో వందకోట్లు.
           
కంగనా- ఇవాళ వెండితెర క్వీన్.
అయితే అది వారసత్వంగా వచ్చిన సింహాసనం కాదు.
ప్రేక్షకులు ప్రేమగా ఇచ్చిన సింహాసనం. తమను మెప్పించినందుకు కృతజ్ఞతగా ఇచ్చిన సింహాసనం.
బహుశా- ఇప్పట్లో దానికి ఎండ తగలనట్టే.
 - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
కంగనా ఉత్త నటి మాత్రమే కాదు. ఇవాళ ఆమె మాటకు ఒక విలువ ఉంది. సామాజిక పరిణామాల మీద, ధోరణుల మీద, వేళ్లూనుకున్న వ్యవస్థల మీద, ముఖ్యంగా స్త్రీల పట్ల ఉన్న చిన్నచూపు మీద ఆమె చేసే వ్యాఖ్యలను జాగ్రత్తగా వినేవాళ్లు ఉన్నారు. కొత్తతరం ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటోంది. పాతతరం ఆమెతో కలిసి పని చేయాలనుకుంటోంది. ‘నిన్ను నువ్వు నమ్ము’ అనే సూత్రానికి దక్కిన విజయం ఇది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement