
ఆ లేఖ చదువుతుంటే పెదవులు వణికాయి!
గత పదిహేను రోజులుగా కంగనా రనౌత్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అభినందనల సముద్రంలో తడిసి ముద్దయిపోతున్నారు. దానికి కారణం ‘క్వీన్’ చిత్రం. కంగనా నాయికగా నటించిన ఈ చిత్రం విజయవిహారం చేయడంతో పాటు నటిగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది.
నిన్న మొన్నటివరకు కంగనా ఓ మోస్తరు నటి మాత్రమే అన్నవాళ్లు సైతం ‘క్వీన్’ చూసి కంగనా ‘అద్భుతమైన నటి’ అని ప్రశంసించేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏకంగా ఓ ఫ్లవర్ బొకే, స్వహస్తాలతో రాసిన ఓ అభినందన లేఖ కంగనాకి పంపించారు. ఆ విషయం గురించి చెబుతూ -‘‘ఆ రోజు మా ఇంటి కాలింగ్ బెల్ మోగితే, నా సోదరి రంగోలి వెళ్లి తీసింది. నా పేరుతో ఉన్న ఓ బొకే, లెటర్‌ని డెలివరీ బోయ్ అందజేశాడు. ‘నీ కోసం ప్రత్యేకంగా వచ్చిన బహుమతి ఇది’ అంటూ రంగోలి నా చేతికిచ్చింది. పూల బొకే చాలా అందంగా ఉంది. దాన్ని పక్కన పెట్టి, లెటర్ విప్పాను.
నన్ను ప్రశంసిస్తూ అమితాబ్‌గారు రాసిన ఆ ఉత్తరం చదువుతుంటే పెదాలు వణికాయి. భారతీయ సినిమా చరిత్రలో భేష్ అనదగ్గ నటుల్లో అమితాబ్‌గారు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన ‘రాణీగా నువ్వు జీవించావు’ అంటూ.. ఇంకా నా నటన గురించి అద్భుతమైన పదాలతో ప్రశంసిస్తూ రాశారు. నాకైతే అంతా కలలా అనిపించింది. సినిమా పరిశ్రమలో గౌరవంతో పాటు ప్రేమాభిమానాలను కూడా పొందగలుగుతానని నేనూహించలేదు. అమితాబ్‌గారు మాత్రమే కాదు... సల్మాన్, షారుక్, ఆమిర్‌ఖాన్ ఇలా అందరూ అభినందించారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.