
అద్వితీయ నటనకు రెండోసారి గుర్తింపు
ఉత్తమ నటి - కంగనా రనౌత్ (హిందీ చిత్రం ‘క్వీన్’)
‘క్వీన్’ చిత్రం ద్వారా జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన కంగనా రనౌత్ మరోసారి దేశమంతటా వార్తల్లో నిలిచారు. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో రాజౌరీ ప్రాంతానికి చెందిన రాణిగా ఆమె చేసిన అభినయం తాజాగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డు రావడం ఇది రెండోసారి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యాషన్’ (2008) చిత్రంలో మాదక ద్రవ్యాలకు బానిసైన మోడల్‌గా చూపిన అభినయానికి గతంలో ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెల్చుకున్నారు. ఇప్పుడు ‘క్వీన్’తో ఏకంగా ఉత్తమ నటి కిరీటం అందుకోనున్నారు. సర్వసాధారణంగా హిందీ సినీ అవార్డు షోలకు హాజరయ్యే అలవాటు లేని కంగన ఈ సారి జాతీయ అవార్డు రేసులో తాను ఉన్న సంగతే తెలియదన్నారు. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చినా, పురస్కారం అందుకోవడానికి వెళ్ళని ఆమె జాతీయ అవార్డును తీసుకోవడానికి వ్యక్తిగతంగా హాజరవుతానన్నారు.