దక్షిణాది తెరపై క్వీన్ ఎవరు?
దక్షిణాది వెండితెరపై క్వీన్ అవతారమెత్తాలని చాలా మంది కథానాయికలు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ క్వీన్ ఎవరు? ఆ అదృష్టం ఎవరిని వరించనుంది? అన్నది త్వరలోనే తేలనుంది. అసలు ఈ క్వీన్ సంగతేమిటంటారా. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. క్రేజీ నటి కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయూలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఈ సంచలన చిత్రం దక్షిణాది హక్కులను సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు.
ఈయన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ క్వీన్ చిత్రం కంటెంట్ తనకు బాగా నచ్చిందన్నారు. ఒక యువతి జీవితంలో తనకెదురైన అవాంతరాలను ఎలా ఎదురొడ్డి పోరాడిందన్నదే చిత్ర కథ అన్నారు. ఇది యూనివర్శిటీ సబ్జెక్ట్. దక్షిణాది భాషలన్నింటిలోనూ నిర్మించడానికి హక్కులు పొందినట్లు వెల్లడించారు. కంగనా పాత్రను ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ పోషించనున్నారని తెలిపారు. ఇక కంగనాకు ఫ్రెండ్‌గా నటించిన లిసా హైడన్ దక్షిణాదిలోనూ నటించనున్నారని చెప్పారు.
‘‘మీ అబ్బాయి నటుడు ప్రశాంత్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందా?’’ అన్న ప్రశ్నకు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక వైవిధ్యభరిత పాత్రను ప్రశాంత్‌తో నటింప జేయాలనుకుంటున్నట్లు త్యాగరాజన్ తెలిపారు. అయితే ఇది ప్రశాంత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తను ప్రస్తుతం తమిళ చిత్రం సాహసంలో నటిస్తున్నారని తదుపరి ఒక భారీ బాలీవుడ్ చిత్రం చేయనున్నారని వివరించారు. నాలుగు భాషల్లోనూ ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్‌ను ప్యారిస్, ఆమ్‌స్టర్‌డమ్, స్పెయిన్ దేశంలో నిర్వహించనున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు.