south Indian languages
-
భాషా వివాదం!
ఎప్పటిలాగే హిందీపై పెను వివాదం రేగింది. ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందుకు కారకులయ్యారు. ‘హిందీ దివస్’ సందర్భంగా మొన్న శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశానికి ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని, అప్పుడే మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కన్న కలలు నెరవేరతాయని చెప్పడం ఈ వివాదానికి మూలం. అయితే హిందీని ద్వితీయ భాషగానైనా నేర్చుకోవాలన్నదే తన ఉద్దేశమని షా వివరణ ఇచ్చారు. మన దేశానికి జాతీయ భాష లేదు. కేంద్ర స్థాయిలో అధికార భాషగా హిందీ, ఇంగ్లిష్ ఉన్నాయి. రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ భాషలు అధికార భాషలుగా ఉంటున్నాయి. 1960 ప్రాంతంలో హిందీ భాషను ‘రుద్దడాన్ని’ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో పెద్దయెత్తున ఆందోళనలు పెల్లు బికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషల్ని ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ గుర్తించింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో కేంద్రం ఇంగ్లిష్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధి కార భాషల చట్టాన్ని సవరించారు. దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే డజను రాష్ట్రాల్లో మాతృ భాష హిందీయేనని పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణలో తేలుతుంటుంది. అలాగని ఆ రాష్ట్రాల్లో అన్నిచోట్లా దాన్ని ఒకేలా మాట్లాడరు. అక్కడ హిందీకి దగ్గరగా ఉండే బ్రజ్ భాష, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీవంటి 49 రకాల పలుకుబడులున్నాయి.‘ప్రామాణిక హిందీ’ పాఠ్యపుస్తకాలకూ, ప్రభుత్వ లావాదేవీలకూ మాత్రమే పరిమితం. 1805లో బ్రిటిష్ వలసపాలకుల ఆదేశాలమేరకు కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో పనిచేసే నలుగురు మున్షీలు ఈ ‘ప్రామాణిక హిందీ’ని రూపొందించారు. మొత్తంగా హిందీయేతర భాషలు మాట్లాడేవారు దేశంలో 60 శాతంమంది ఉంటే... హిందీ, దానికి దగ్గరగా ఉండే భాషలు మాట్లాడేవారు 40 శాతంమంది. వాస్తవాలిలా ఉంటే హిందీ భాష మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనడం అవివేకం. ఇప్పుడు అమిత్ షా ప్రకటనను ఇతర పార్టీలతోపాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నదిగానీ...ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో హిందీకి అగ్రాసనం వేయాలని ప్రయత్నించింది. 2008లో దేశంలో హిందీ వినిమయాన్ని పెంచడం కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రతి పాదనలే దీనికి రుజువు. మెట్రిక్, ఆ పైస్థాయి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్నది ఆ ప్రతిపాదనల్లో ఒకటి. అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన వల్ల హిందీ భాషా ప్రాంత అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, ఇతర రాష్ట్రాల వారు నష్టపోతారని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పారు. మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతి రేకత రావడంతో ఆ ప్రతిపాదన మూలనబడింది. ఈమధ్య విడుదలైన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో సైతం హిందీకి అగ్ర తాంబూలం ఇచ్చే ప్రతిపాదన ఉంది. దాని ప్రకారం ఆరో తరగతి మొదలుకొని హిందీ భాషా ప్రాంతాల పిల్లలు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో ఆధునిక భాష నేర్చుకోవచ్చు. హిందీయేతర ప్రాంతాల విద్యార్థులు మాత్రం హిందీ, ఇంగ్లిష్‌లతోపాటు స్థానిక భాష నేర్చుకోవచ్చునని ఆ ప్రతిపాదన అంటున్నది. సారాంశంలో ఈ ప్రతిపాదన హిందీని తప్పనిసరి చేస్తున్నది. మన రాజ్యాంగం త్రిభాషా సూత్రాన్ని గుర్తించింది. అధికార భాషల చట్టం కూడా ఈ విషయంలో స్పష్టతతో ఉంది. కానీ పాలకులు మాత్రం ఎప్పటికప్పుడు హిందీని ఉన్నత పీఠం ఎక్కిం చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకే భాష మాట్లాడేవారి మధ్య సదవగాహన, సహోదరత్వం వంటివి పెంపొందుతాయన్నది వాస్తవమే. కానీ ప్రాంతీయ భాషలకు విలువీయకుండా, వాటి నెత్తిన మరో భాషను రుద్దుతామంటేనే పేచీ వస్తుంది. మన దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదా యాలు వర్థిల్లుతున్నాయి. ఈ భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ విశిష్టత. ఫలానా భాష నేర్చుకోమని లేదా నేర్చుకోరాదని నిర్బంధంగా అమలు చేస్తే అది తమ భాషా సంస్కృతులకు ముప్పు కలగ జేస్తుందన్న సంశయం కలుగుతుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో సైతం ఈ భాషా సమస్య ఎంత రగడ సృష్టించిందో మరిచిపోకూడదు. హిందీని ఉమ్మడి భాషగా ప్రకటించాలని బ్రిటిష్ ప్రభు త్వాన్ని కోరుతూ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో పురుషోత్తందాస్ టాండన్ నేతృత్వంలో కొందరు ఉత్తరాది రాష్ట్రాల నాయకులు తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పుడు ఎన్జీ రంగా తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవాళ చదువుల నిమిత్తమో, ఉపాధికోసమో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావటం తప్పనిసరైంది. కనుక దేశ పౌరులంతా హిందీతోసహా ఏ భాషనైనా ఇష్టంతో, ప్రేమతో నేర్చుకోవడాన్ని పాలకులు ప్రోత్సహించాలి. దక్షిణాదివారికి పొరుగు రాష్ట్రంలోని ప్రాంతీయ భాష... ఉత్తరాదివారికి దక్షిణాది రాష్ట్రాల్లోని భాషలు నేర్చుకుంటే వాటివల్ల ప్రయోజనమే తప్ప చేటు కలగదు. దేశంలో హిందీ చలనచిత్రాలు, సీరియళ్లు, నెట్ఫ్లిక్స్వంటి సామాజిమాధ్యమాల ద్వారా విడుదలవుతున్న చిత్రాలు హిందీని దేశ ప్రజలకు అలవాటు చేస్తున్నాయి. అక్కడి సంస్కృతీ సంప్ర దాయాలపై అవగాహన కలిగిస్తున్నాయి. భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా... ఉద్యోగా వకాశాలకు షరతుగా మార్చినా ఆందోళనలు చెలరేగుతాయి. ఆ భాషపై విముఖతను పెంచుతాయి. ఒక భాష ఉన్నతమైనదనడం ఇతర భాషలను తక్కువ చేయడమే అవుతుంది. కనీసం ఇప్పుడు దేశంలో చెలరేగిన వ్యతిరేకత చూశాకైనా నేతలు హిందీ దురభిమానాన్ని కట్టిపెట్టాలి. -
దక్షిణాది భాషలపై హిందీ పెత్తనం
దక్షిణ భారతదేశంపై హిందీ భాషను రుద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఇది భారత రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ఫెడరిలిజంపై గొడ్డలి వేటు వేయడమే. భారత రాజ్యాంగం దేశీయ భాషల అస్తిత్వానికిచ్చిన స్వేచ్ఛను భగ్నపరచడం తప్ప మరొకటి కాదు. దక్షిణాది భాషలన్నీ అతి ప్రాచీనమైనవి. భారతదేశానికి వలస వచ్చిన అనేక జాతుల భాషలను సంలీనం చేసుకొన్న భాషా జాతులు దక్షిణాది భాషలు. ఇతర దేశీయ దాడులకు ఉత్తర భారతం గురైనంతగా దక్షిణ భారతం గురికాలేదు. అందుకే ఇక్కడ భాషల్లోని మాతృస్వామికత, దేశీయతల పునాది చెక్కు చెదరలేదు. దక్షిణ భారత భాషలు ప్రపంచ భాషా చరిత్రలో అత్యున్నత ప్రాధాన్యం కలిగినవి. నిజానికి తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రవిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాడు మూల ద్రవిడ భాష నుండి ఈ భాషలు ఒకటొకటిగా స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెప్తున్నారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికి వెయ్యి యేండ్లు పట్టింది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగల మీద వుండటాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నాయి. తెలుగులో అతి ప్రాచీన జాతుల్లో సవరలు ఒకరు. వారి పాటలు ఆర్యులకు పూర్వం నాటివి. ఆ సవరుల భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నట్టు గిడుగు శ్రీరామమూర్తిగారు నిరూపించారు. అమిత్ షా ప్రకటనలో ఆర్.యస్.యస్. ఎజెండా వుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటూనే అంతా ‘రామ’ మయం చేయాలంటారు. దక్షిణ భారతదేశంలో సామాజిక సాంస్కృతిక, తాత్విక ఉద్యమాలన్నీ భాషా పునాదిగా పుట్టాయి. ఇప్పటికీ అధిక శాతం మంది నిరక్షరాస్యులుగా వుండి తమ భాషలోనే తమ జీవన క్రమాన్ని నడుపుకొంటున్నారు. చదువుకొనే వారికి, చదువుకోని వారికి ఆయా ప్రాంతీయభాషలే జీవ వాహికలుగా వున్నాయి. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకులు కాదు. కానీ, ఏ భాషనూ ప్రభుత్వం ప్రజ లపై రుద్దకూడదు. వారి వారి ఉత్సాహాన్ని బట్టి భాషను నేర్చుకొంటారు. అప్పుడే భాష వస్తుంది. భాష మెదడు మీద రుద్దితే వచ్చేది కాదు. అది నేర్చుకునే ఔత్సాహికత నుండే వస్తుంది. అంబేడ్కర్ ఈ సందర్భంగా ఫెడరల్ స్ట్రక్చర్ మనుగడ ఆయా దేశీయ భాషల్ని రక్షించి అభివృద్ధి చేయడం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. భాషా రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా పేర్కొన్నారు. ‘‘సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి రాష్ట్రాలు ఎక్కువగా సమతుల్యతలో ఉండడం అవసరమని నేను భావిస్తున్నాను. వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే అది అనుమానాల్ని, అసంతృప్తిని కలిగించడమే కాదు, ఫెడరల్ వ్యవస్థనే విచ్ఛిన్నం చేయగల శక్తులను సృష్టించడం దేశ ఐక్యతకే ప్రమాదకారి అవుతుంది. భాషల అంశం చాలా లోత్తైంది’’. నిజానికి కేంద్రం దక్షిణాది భాషల అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి వుంది. కానీ దేశీయ భాషలను సంస్కృతులను ప్రోత్సహించకుండా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది అత్యంత సంకుచిత రాజకీయం. దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం నుండి సరైన సహకారం లేదు. డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తికి షా ప్రకటన విరుద్ధం. దక్షిణ భారతీయులు అశోకుణ్ని, ఔరంగజేబుని నియంత్రించిన సమర్థులు. దక్షిణాది సంస్కృతులపై దాడి చేసి నిలిచిన వారు లేరు. ఈ సందర్భంగా దక్షిణ భారత ముఖ్యమంత్రులు, భాషావేత్తలు, ప్రజలు ఏకమై మహత్తర పోరాటాన్ని సాగించడం ద్వారా భారతీయ సమైక్యతను సముజ్వలతను కాపాడుకోవాల్సిన చారి త్రక సందర్భం ఇది. ఇది కేవలం హిందీ పేరుతో జరుగుతున్న పాలక వర్గపు రాజకీయ దాడి. అందుకే సామాజిక భాషా శక్తులే కాక రాజకీయ శక్తులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిన సందర్భం ఇది. దక్షిణ భారతీయులు పోరాటమే ఊపిరిగా తరతరాలుగా తమ అస్తిత్వాలను చాటుకొంటున్నారు. ఈ పోరాటంలో మనమూ భాగస్వాములు అవుదాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొబైల్ : 98497 41695 -
దక్షిణాది తెరపై క్వీన్ ఎవరు?
దక్షిణాది వెండితెరపై క్వీన్ అవతారమెత్తాలని చాలా మంది కథానాయికలు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ క్వీన్ ఎవరు? ఆ అదృష్టం ఎవరిని వరించనుంది? అన్నది త్వరలోనే తేలనుంది. అసలు ఈ క్వీన్ సంగతేమిటంటారా. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. క్రేజీ నటి కంగనా రనౌత్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయూలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఈ సంచలన చిత్రం దక్షిణాది హక్కులను సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఈయన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ క్వీన్ చిత్రం కంటెంట్ తనకు బాగా నచ్చిందన్నారు. ఒక యువతి జీవితంలో తనకెదురైన అవాంతరాలను ఎలా ఎదురొడ్డి పోరాడిందన్నదే చిత్ర కథ అన్నారు. ఇది యూనివర్శిటీ సబ్జెక్ట్. దక్షిణాది భాషలన్నింటిలోనూ నిర్మించడానికి హక్కులు పొందినట్లు వెల్లడించారు. కంగనా పాత్రను ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ పోషించనున్నారని తెలిపారు. ఇక కంగనాకు ఫ్రెండ్‌గా నటించిన లిసా హైడన్ దక్షిణాదిలోనూ నటించనున్నారని చెప్పారు. ‘‘మీ అబ్బాయి నటుడు ప్రశాంత్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందా?’’ అన్న ప్రశ్నకు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక వైవిధ్యభరిత పాత్రను ప్రశాంత్‌తో నటింప జేయాలనుకుంటున్నట్లు త్యాగరాజన్ తెలిపారు. అయితే ఇది ప్రశాంత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తను ప్రస్తుతం తమిళ చిత్రం సాహసంలో నటిస్తున్నారని తదుపరి ఒక భారీ బాలీవుడ్ చిత్రం చేయనున్నారని వివరించారు. నాలుగు భాషల్లోనూ ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్‌ను ప్యారిస్, ఆమ్స్టర్డమ్, స్పెయిన్ దేశంలో నిర్వహించనున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు.