
దక్షిణాది రాణి!
ఏ నటికైనా సవాల్ లాంటి పాత్ర వస్తే.. నటనాపరంగా విజృంభించేస్తారు. ‘క్వీన్’ చిత్రంలో కంగనా రనౌత్ అదే చేశారు. మొదట్లో గ్లామర్ డాల్ అనిపించుకున్నప్పటికీ రాను రాను తనలో ఎంత మంచి నటి ఉందో నిరూపించుకుంటున్నారు కంగనా. ముఖ్యంగా ‘క్వీన్’లో ఆమె ప్రదర్శించిన నటనను అమితాబ్ బచ్చన్ వంటివారే సైతం మెచ్చుకున్నారు. ఈ సినిమా కంగనా తప్ప ఎవరూ చేయలేరు? అని కూడా చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఎంతో పోటీ మధ్య తమిళ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ (హీరో ప్రశాంత్ తండ్రి) ‘క్వీన్’ దక్షిణాది రీమేక్ హక్కులు సాధించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించాలనుకుంటున్నారు.
కంగనా స్థాయిలో దక్షిణాదిన నటించే సత్తా ఎవరికుంది? అంటూ.. రకరకాల తారల పేర్లు అనుకున్నారు. ఎంతమందిని అనుకున్నా ఎక్కువ శాతం మార్కులు త్రిషకే వేస్తున్నారట. త్యాగరాజన్ మనసులో కూడా త్రిషానే ఉందని సమాచారం. ఈ చిత్రానికి రాధామోహన్ లేక అహ్మద్ దర్శకత్వం వహిస్తారని వినికిడి. రాధామోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘అభియుమ్ నానుమ్’ అనే చిత్రంలో త్రిష అద్భుతంగా నటించారు. అలాగే, అహ్మద్ దర్శకత్వం వహించిన ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’లో కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశారామె. ఆ విధంగా ఈ ఇద్దరు దర్శకులకు త్రిష నటనపై మంచి అభిప్రాయం ఉంది. అందుకని, తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన ‘క్వీన్’ రీమేక్‌లో త్రిషకే ఎక్కువ అవకాశం ఉంది. మరి.. క్వీన్‌గా ఎవరు ఒదిగిపోతారో వేచి చూడాలి.