కంగనా రనౌత్ ఓవర్ యాక్షన్
స్టార్‌డమ్ కే సైడ్ ఎఫెక్ట్స్!
ఆ మధ్య ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ అని హిందీలో ఓ సినిమా వచ్చింది. పెళ్లయ్యాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఒక్క పెళ్లి అనే కాదు... ప్రేమలో పడితే కూడా ఓ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ్. శరీరం జీర్ణించుకోలేని తిండి తింటే, సైడ్ ఎఫెక్ట్స్ కామన్. అలాగే మాంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ హఠాత్తుగా మొదలవుతాయ్. అప్పటివరకూ మామూలుగా ఉన్నవాళ్లు సక్సెస్ తర్వాత విచిత్రంగా ప్రవర్తించేస్తారు. హఠాత్తుగా వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇతరులను ఎఫెక్ట్ చేస్తుంటాయ్. ఇప్పుడు బాలీవుడ్‌లో తన సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇతరులను తెగ ఇబ్బందిపెట్టేస్తున్నారట హీరోయిన్ కంగనా రనౌత్.
అసలే కంగన అంటే చాలా కంగాళీ మనిషి అనే పేరుంది. ఎదుటి వ్యక్తి బాధపడతారేమోనని కూడా ఆలోచించకుండా ఏది అనిపిస్తే, అది మాట్లాడటం, ఎలా అనిపిస్తే అలా ప్రవర్తించడం కంగన స్టయిల్. ఇక, ఇప్పుడు సక్సెస్ తోడయ్యింది కాబట్టి, ఈవిడగారి ఆగడాలు హద్దులు దాటాయని చెప్పుకుంటున్నారు. ఇంతకీ కంగన ఏమైనా పదుల సంఖ్యలో విజయాలు చవిచూశారా? అంటే అదీ లేదు. ఓ నాలుగు విజయాలు చూశారు. ఆ మాత్రం దానికే ఇంత మిడిసిపడితే ఎలా? అని ఈవిడగారి సైడ్ ఎఫెక్ట్స్‌కి బలైనవాళ్లు అంటున్నారు. అంతలా కంగన ఏం చేస్తున్నారు?
‘తను వెడ్స్ మను, క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్’ విజయాలతో కంగనా రనౌత్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. దాన్నలా కొనసాగించాలంటే మంచి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నారామె. ఈ క్రమంలో కథ, తన పాత్ర గురించి మాత్రమే కాకుండా... కథా చర్చల్లో కూడా పాల్గొంటానని కంగన మొండిపట్టు పడుతున్నారట. పోన్లే అని రమ్మంటే.. కథలో ఏవేవో మార్పులు చెబుతున్నారట. చెయ్యకపోతే హీరోయిన్‌గారు అలుగుతారేమోనని టెన్షన్. మార్కెట్ ఉన్న హీరోయిన్‌తో సినిమా తీస్తే, లాభాలు చవిచూడొచ్చన్న ఆశ నిర్మాతకు ఉంటుంది కదా. అందుకని, కాదనకుండా ఆమె చెప్పిన మార్పుల్లో కొన్ని చేస్తున్నారట.
ఓ సినిమా ప్రారంభమయ్యాక కంగనా రనౌత్ పెట్టే ఇబ్బందులు మామూలుగా ఉండవట. షూటింగ్స్‌కు సరిగ్గా హాజరు కారట. అందుకు నిదర్శనం గత ఏడాది విడుదలైన ‘ఉంగ్లీ’. ఈ చిత్రం షూటింగ్‌కి అరగంట, గంటా కాదు.. ఏకంగా మూడు, నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చేవారట. అది మాత్రమే కాకుండా తొలి ప్రచార చిత్రం తనకు నచ్చకపోవడంతో ప్రచార కార్యక్రమాలకు సహకరించలేదట. ‘వేరే సినిమాలతో బిజీగా ఉన్నా... తేదీల్లేవ్’ అని చెప్పి, తప్పించుకున్నారట.
కంగనా రనౌత్‌కు మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం ఉందట. అడపా దడపా కథలు, కవితలు రాసుకుంటుంటారని సమాచారం. చివరికి తాను నటించే చిత్రాలకు సంభాషణలు రాసే అవకాశం ఇవ్వమని దర్శక, నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ‘ఇప్పుడొద్దులేమ్మా.. మరోసారి చూద్దాం’ అని కంగనకు నచ్చజెప్పడానికి వాళ్లు చాలా ట్రిక్కులే చేయాల్సి వస్తోందట.
‘ఐ లవ్ న్యూ ఇయర్’ అనే చిత్ర నిర్మాతలకు ఈ మధ్య కంగన చాలా చుక్కలే చూపించారు. సన్నీ డియోల్, కంగన జంటగా భూషణ్‌కుమార్, కృష్ణకుమార్ నిర్మించిన ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. ఏవో కొన్ని సమస్యలతో వాళ్లు విడుదల చేసుకోలేకపోయారు. ఇప్పుడు కంగనకు మార్కెట్ ఉంది కాబట్టి, విడుదల చేస్తే కొంతలో కొంత సేఫ్ అవ్వొచ్చన్నది నిర్మాతల తాపత్రయం. అందుకే గత శుక్రవారం విడుదల చేశారు. ఎప్పుడో తీసిన ఆ సినిమా ఇప్పుడు విడుదలైతే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన కంగనా రనౌత్ వాళ్ల మీద కేసు పెట్టి, సినిమా విడుదలను అడ్డుకుందామన్నా కుదర్లేదు. సినిమా విడుదలైంది. ఆమె ఊహించినట్లే జరిగింది. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అసలు కంగన కెరీర్‌లో ఇలాంటి సినిమా కూడా ఉందా? అని చూసినవాళ్ల మాట.
పారితోషికం విషయంలో అయితే, నిర్మాతలకు ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వడం లేదట. ఆరు కోట్ల రూపాయలకు అరకోటి తగ్గినా, ‘ఊహూ..’ అంటున్నారట. పెద్ద నిర్మాతలని లేదు.. పెద్ద దర్శకులని లేదు... ఎవరినీ లెక్క చేయడం లేదని సమాచారం. ఆ రేంజ్‌లో సక్సెస్ కంగన నెత్తికెక్కిందని మాట్లాడుకుంటున్నారు. సక్సెస్‌లో ఉన్నంతవరకూ ఫరవాలేదు.. కానీ, ఒక్క ఫ్లాప్ పడిందా? ఖేల్ ఖతమ్... అని మాట్లాడుకుంటున్నారు.