
సాక్షి, తిరుపతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు హడావిడితో అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలనూ ఆపేశారు. దీంతో చాలాసేపు భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది
మంగళవారం పవన్ పర్యటన నేపథ్యంలో.. తిరుమల వెళ్లే ఘాట్ రోడ్‌లోని వాహనాలను అధికారులు నిలిపివేశారు. సుమారు అరగంటకు పైగా ఆపేయడంతో భక్తులు అసహనానికి లోనయ్యారు. పవన్ వెళ్లిన చాలా సేపటి తర్వాత వాహనాలను అనుమతించారు. ‘‘గతంలో ఎందరు నేతలు వచ్చినా.. ఇలాంటి అనుభవం మాత్రం ఎదుర్కొలేదు’’ అని కొందరు భక్తులు అంటున్నారు.
ఇక లడ్డూ వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్.. రేపు తిరుమలలో దానిని విరమించే అవకాశం ఉంది. ఎల్లుండి తిరుపతిలో వారాహి సభలో పవన్ పాల్గొంటారు.
కోర్టు వ్యాఖ్యలపై..
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ పరిణామంపై పవన్ స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్పారు. తనకు ఉన్న సమాచారం మేరకే సుప్రీం కోర్టు అలా వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై ఎక్కువ మాట్లాడను అని అన్నారు.
ఇదీ చదవండి: బాబు ఫోకస్ అంతా అక్కడే ఇక!