ఇష్టారాజ్యంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవహారం
లాఠీల్లాంటి కర్రలతో ఆస్పత్రుల ఆవరణల్లో వీరవిహారం
దుర్భాషలాడటం, దాడులు చేయడం పరిపాటిగా మారిన వైనం
తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి
ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను నిలదీసిన జర్నలిస్టులు
సదరు గార్డును విధుల నుంచి తొలగించిన యాజమాన్యం
ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో చూసినా వారిదే రాజ్యం
సాక్షి, సిటీబ్యూరో: వాళ్లు సెక్యూరిటీ గార్డులు..గేటు దగ్గరి నుంచి డాక్టర్‌ను కలిసే దాకా అడుగడుగునా ఉరుముతూ కనిపిస్తుంటారు. తెలిసీతెలియక ఏదైనా అడిగితే చిరాకు పడుతుంటారు. మరోసారి అడిగామంటే అంతే సంగతులు..అక్కడికి వచ్చే పేషెంట్ గజగజలాడాల్సిందే. ఈ పరిస్థితి ఏదో ప్రైవేటు ఆస్పత్రుల్లోనిది కాదు.. మన భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవహార శైలి. నిజం..నగరంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ రాజ్యం నడుస్తోంది.
ఒక రకంగా ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నట్టే ఉంది వ్యవహారం. దూరభారాల నుంచి వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం..గట్టిగా మాట్లాడితే దుర్భాషలాడటం.. మరీ కాదంటే దౌర్జన్యం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల గురించి పాఠకులకు తెలియజేసేందుకు ఫొటోలు తీసేందుకు వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ప్రైవేటు సెక్యూరిటీ గార్డు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రుల్లోని ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఆగడాలపై మరోసారి చర్చకు తెరలేచింది.
అంత ఉలుకెందుకు?
ఆస్పత్రుల్లో తాకిడిని నియంత్రించేందుకు థర్డ్ పార్టీ ద్వారా ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పరచుకుంటుకున్నారు. అయితే వారి వ్యవహార శైలి ఏ ఆస్పత్రిలో చూసినా.. ఎప్పుడైనా వివాదాస్పదమే. చిన్న విషయాలకే రోగులపై విరుచుకుపడటం, దుర్భాషలాడటం సర్వసాధారణం అయింది. ఆస్పత్రులకు వచ్చే వారు అనారోగ్యంతో ఎంతో బాధతో వస్తుంటారు. కనీసం వారితో మర్యాదగా మాట్లాడుదామనే ఆలోచనే ఉండట్లేదని రోగులు వాపోతున్నారు. నేరస్తులను చూసినట్టు చూస్తుంటారని, చేతిలో లాఠీల్లాంటి కర్రలతో బెదిరిస్తుంటారని చెబుతున్నారు.
శిక్షణ లేకుండానే విధుల్లోకి..?
ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే ప్రైవేటు సెక్యూరిటీకి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ప్రజలతో ఎలా మెలగాలి? వారితో ఎలా ప్రవర్తించాలి..? అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? మానవతా దృక్పథం ఎలా అలవర్చుకోవాలి వంటి అనేక అంశాలపై వారికి అవగాహన కలి్పంచాలి. పైగా వీరిని గమనించే ఇన్‌చార్జి వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ప్రతిసారి షిఫ్ట్ మారుతున్న సమయంలో రోల్ కాల్‌కు పిలిచి వారికి సూచనలు చేస్తుండాలి. కానీ ఏ ఆస్పత్రిలో కూడా ఇలా జరుగుతున్న దాఖలాలు లేవు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
సమస్యలు దాస్తే ఏం లాభం?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన పరిపాలనా యంత్రాంగం.. మసిపూసి మారేడు కాయ చేయడంపైనే దృష్టిసారిస్తోంది. ఆస్పత్రుల్లోని సమస్యలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఎన్నడూ లేని ఆంక్షలు విధిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి..ఆ సమస్యలు బయటకు రాకుండా మేనేజ్ చేస్తే సరిపోతుందిలే అన్న చందంగా పాలక వర్గం వ్యవహరిస్తోంది. దీంతో రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోతోంది. మీడియాపై ఆంక్షలు విధించి, సమస్యలను దాచేస్తే సరిపోతుందా.. నిజాలు బయటకు రాకుండా ఎంతకాలం దాస్తారంటూ పలువురు రోగులు ప్రశి్నస్తున్నారు.
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి..
విధుల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రిలో పరిస్థితిని ప్రపంచం ముందు పెట్టేందుకు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ఫొటోగ్రాఫర్ జి.బాలస్వామిపై అక్కడి సెక్యూరిటీ గార్డు దాడి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కెమెరా లాక్కుని దుర్భాషలాడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను విధుల్లో భాగంగా ఇక్కడికి వచ్చానంటూ ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా, సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించామని తెలిపారు. అయితే వ్యవస్థ మొత్తం ఇలాగే ఉండగా, ఒక్కరిపై వేటు వేసి చేతులు దులుపుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నడూ లేనంత ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment