కంగనతో కటీఫ్
న్యూఢిల్లీ: ఏమైందో ఏమో తెలియదు కానీ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్, ప్రియాంకాచోప్రా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటొంది. క్రిష్3లో వీరిద్దరూ హృతిక్ రోషన్‌కు జోడీగా కనిపించడం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రచారానికి భారీ ఏర్పాట్లు చేసిన నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ కంగన, ప్రియాంకను ఆహ్వానించాడు. అయితే కంగనతో కలిసి ప్రచారంలో పాల్గొనే ప్రసక్తే లేదని ప్రియాంక కుండబద్దలు కొట్టడంతో ఆయన కంగు తిన్నాడు.
‘ఈ సినిమా మ్యూజిక్ సీడీని ఆవిష్కరించినప్పుడు ప్రియాంక ముంబైలో లేదు. మిగతా వాళ్లంతా ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రచార కార్యక్రమాలకు నిర్మాత ఏర్పాట్లు చేసి నటులంతా పాల్గొనాలని కోరారు. ఆమె లాస్‌ఏంజిలిస్ నుంచి రాగానే పరిస్థితి మారిపోయింది. కంగనతో బహిరంగంగా కనిపించే ప్రసక్తే లేదని చెప్పింది’ అని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి రోషన్ ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ దిగిరావడం లేదు.
వచ్చే నెల ఒకటిన విడు దలయ్యే క్రిష్ 3 ప్రచారం కోసం నిర్వహించే టీవీ షోల్లో ఈ ఇద్దరు విడివిడిగానే కనిపిస్తారు. ప్రియాంక, కంగన ఇంటర్వ్యూలు నిర్వహించే ఓ టీవీ చానెల్ అధికారి మాట్లాడుతూ ‘మా చానెల్‌కు వాళ్లిద్దరూ ముఖ్యమే. సల్మాన్‌ఖాన్ ఈ వారం నిర్వహించే షోలో కంగన కనిపిస్తుంది. ఇందులో ఆమె క్రిష్ 3 ప్రచారం కోసం పాల్గొనడం లేదు. అతిథిగానే పిలిచాం. వచ్చే వారం షోకు ప్రియాంక వస్తుంది’ అని ఆయన వివరించారు. ఈ వివాదంపై మాట్లాడడానికి అటు కంగన, ఇటు ప్రియాంక ముందుకు రావడం లేదు.