57 సర్జరీలు... భరించలేని బాధ!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధాకరమైన సంఘటనలు ఉంటాయి. కొన్ని బాధలు తాత్కాలికం. కొన్ని మాత్రం జీవితాంతం వెంటాడతాయి. ఆ బాధ తాలూకు ఆనవాళ్లు మిగిలిపోతాయి. కంగనా రనౌత్ అక్క రంగోలి జీవితంలో అలా ఆనవాళ్లు మిగిల్చిన సంఘటన ఒకటి ఉంది. పెళ్లి కుదిరాక ఆమె మీద ఎవరో యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడి కారణంగా ఒక కంటికి 90 శాతం చూపు పోయింది. ఒక చెవి పని చేయడం మానేసింది. ఇక... చక్కని ముఖారవిందం కాలిపోయింది. మరోవైపు ఆహారం వెళ్ళే నాళం, శ్వాసకోశం కూడా దెబ్బ తిన్నాయి. దాంతో రంగోలి నరకం అనుభవించారు. పాడైపోయిన మొహాన్ని కొంతలో కొంత బాగు చేయడానికి 57 సర్జరీలు చేశారు. ఆ చర్మాన్ని తొడల దగ్గర్నుంచి తీసేవారు. మొత్తం మీద ప్రత్యక్ష నరకం చూశారామె.
దేవుడు ఆ విధంగా కొంత పెయిన్ ఇచ్చినా.. ఎవరితో అయితే పెళ్లి కుదిరిందో ఆ యువకుడే రంగోలీని పెళ్లి చేసుకోవడంతో ఆమె జీవితం ఆనందంగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్‌లో జీవిత చరిత్రల నేపథ్యంలో సినిమాలు రావడం ఎక్కువైంది. క్రీడాకారులు, స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. కానీ, కంగన మాత్రం ‘మా అక్క జీవితానికి మించిన ఇన్‌స్పిరేషన్ లేదు’ అంటున్నారు. అందుకే, రంగోలీ జీవితం ఆధారంగా సినిమా చేయాలనుకుంటున్నారామె.
ఈ విషయం గురించి కంగన మాట్లాడుతూ - ‘‘నా జీవితం కన్నా మా అక్క జీవితం చాలా బాగుంది. మా బావ తనను ఎంతగానో ప్రేమిస్తాడు. నాకు అలాంటి ప్రేమికుడు లేడు. మా అక్క జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టే, తన జీవితంతో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ, తన జీవితంతో సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుందని మా అక్క అంటోంది. నేను జయాపజయాల గురించి ఆలోచించడం లేదు. స్ఫూర్తిదాయకమైన ఒక సినిమా చేయాలన్నదే నా ఆశయం’’ అని చెప్పారు.