8 పాయింట్స్ కంగనా రనౌత్
సంతోషం
‘నేను ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను’ అని అసంతృప్తి పడేవాళ్లను, ‘నాది సొంత ఇల్లు’ అనే గర్వంగా చెప్పుకొని మురిసిపోయేవాళ్లను చూస్తుంటాం. అయితే సొంతదైనా 2 అద్దెదయినా... ఎంత సంతోషంగా ఉన్నామన్నదే, ఎంత మనశ్శాంతితో ఉన్నామన్నదే ముఖ్యం.
సీరియస్
లైఫ్‌ను, వర్క్‌లైఫ్‌ను సీరియస్‌గా తీసుకోను. తీసుకుంటే... ఏదీ సాఫీగా సాగదు. చిన్న విషయం కూడా భారం అనిపిస్తుంది. జీవితంలో ప్రాథమిక విషయాలు... ఆరోగ్యం, స్నేహం, అనుబంధం. వీటికిచ్చే ప్రాధాన్యత మీదే మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి.
కంఫర్ట్‌జోన్
‘కంఫర్ట్‌జోన్’ ఎప్పుడూ ‘కంఫర్ట్’గానే ఉండకపోవచ్చు. ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. అందుకే ఎప్పటికప్పడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తూ ఉండాలి. ‘నాకేది తెలియదు’ అనుకుంటే అక్కడే ఉండి పోతాము. ‘తెలుసుకోవాలనుకుంటాను’ అనుకుంటే ముందుకు పోతాము.
కలలు
‘ఇలా జరుగుతుంది’ ‘ఇలా జరగాలి’ అని కలలు కంటే... ఏదీ నిజం కాదు. ఎంత గొప్ప ఊహలు, కలలు అయినా ఇంట్లో కూర్చుంటే నిజం కావు. ఎంతో కొంత కష్టపడాలి. కలలు మాత్రమే కాదు కష్టం కూడా బలంగా ఉండాలి.
నచ్చిన పని
నచ్చిన పనిని ఎంచుకునేప్పుడు మనం లాభనష్టాల గురించి పెద్దగా ఆలోచించం. నష్టం ఎదురైనా...అది పెద్దగా మనల్ని కదలించదు. ‘తృప్తి’ మాత్రం మిగులుతుంది. ఇది కూడా ఒక విధంగా లాభమే కదా! అన్ని సందర్భాల్లో డబ్బు ‘తృప్తి’ ఇవ్వపోవచ్చు. ‘తృప్తి’ మాత్రం డబ్బుకన్నా విలువైనదాన్ని ఇస్తుంది.
వంద డిగ్రీలు
‘నీకు పది డిగ్రీలు కావాలా? పది ఎక్స్‌పీరియన్సెస్ కావాలా?’ అని అడిగితే రెండోదే ఎంచుకుంటాను. అడగక పోయినా అనుభవం అనేది ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అందుకే ఒక్కో అనుభవం వంద డిగ్రీలతో సమానం!
వంద శాతం
నేను వంద శాతం అంతర్ముఖురాలిని. చాలామందికి అంతర్ముఖులు ‘మూడీ ఫెలోస్’గా కనిపిస్తారు. అది అందరికీ నచ్చకపోవచ్చు కూడా. అయినప్పటికీ నేను అంతర్ముఖురాలిగా ఉండడానికి ఇష్టపడతాను. అంత్మర్ముఖం అంటే మనలోకి మనం తొంగి చూసుకోవడం, మనతో మనం విలువైన సంభాషణ చేయడం.
విజయం
విజయం అంటే... మన శక్తి ఏమిటో, అది ఎక్కడో ఉందో, అది ఏ సందర్భాల్లో వినియోగించుకోవాలో తెలుసుకోవడం. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడం. నిరంతర నిరాశను నిరంతర ఆశగా మార్చుకోవడం. ప్రతి అడుగును గుర్తు పెట్టుకోవడం.