తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. వానాకాలం వెళ్లేముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లె పడుచులతో ఎటు చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుగా ఉన్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండి జిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి.
పూరిగుడిసెలమీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి పొలంగట్లు. పూలు కోసుకురావడం ఒక్కటే మగవారి వంతు. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవాళ్లదే. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే ‘బతుకమ్మ’ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న విశ్వాసం ఈనాటికీ తెలంగాణలో ఉంది.
తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగ మహాలయ పక్ష అమావాస్యతో ఆరంభం అవుతుంది. కొన్నిచోట్ల పితృ అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి.
అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలియజేయడంతో పాటు ఆడపిల్లలకు సంబంధించిన అనేక విషయాలమీదే ఉంటాయి. ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ. భాద్రపద అమావాస్య అక్టోబరు 2నప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగి, అక్టోబరు 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. – డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment