కుటుంబాలకు దూరంగా పండుగ రోజుల్లోనూ విధుల్లో అత్యవసర సర్వీసుల సిబ్బంది..
వాళ్లతో గడపాలని ఉన్నా ప్రజాసేవలో సంతృప్తి దక్కుతోందంటున్న ‘అలుపెరుగని వీరులు’
రిషి.. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్.. ప్రస్తుతం కోనసీమ కోళ్ల పందేల్లో బిజీబిజీగా ఉన్నాడు.. పండుగకు మూడ్రోజుల ముందే ఊరొచ్చేశాడు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు..ప్రవీణ్.. ప్రభుత్వ ఉద్యోగి.. సొంతూరు జనగామ. భోగి ముందు రోజున వచ్చాడు. చెడ్డీ దోస్తులతో, బంధువులతో సంబరాలు చేసుకుంటున్నాడు.కిశోర్.. ప్రైవేటు ఉద్యోగి.. తూర్పుగోదావరి జిల్లా.. సేమ్ అందరిలాగే సంక్రాంతి వేడుకల్లో తలమునకలై ఉన్నాడు..
ఇక్కడా కొందరు తలమునకలై ఉన్నారు.. విందులు, వినోదాల్లో కాదు.. వీధుల్లో.. విధులను నిర్వహిస్తూ తలమునకలై ఉన్నారు. నాన్నెప్పుడొస్తడా అంటూ ఇంట్లో ఎదురుచూస్తున్న పిల్లలను తలచుకుంటూ.. ఊర్లో ఉన్న అమ్మాబాపులను యాది చేసుకుంటూ.. పండుగ రోజున కూడా సెలవు తీసుకోని మన సంరక్షకులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు.
అది ఉప్పల్‌లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న ఓ పోలీసు కావచ్చు.. గోల్కొండ ప్రభుత్వాస్పత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్న ఒక వైద్యుడు కావచ్చు.. పతంగులు చిక్కుకోవడం వల్ల ఫీడర్‌లో అంతరాయాలు తలెత్తి.. మనకు కరెంట్ పోకుండా చూస్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి కావచ్చు.. లేదా.. ఆర్టీసీ, వాటర్ బోర్డు, శానిటరీ సిబ్బంది, టీవీ రిపోర్టర్లు, అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు, మాల్స్‌లో పనిచేసేవారు, స్విగ్గీ, జొమాటో బాయ్స్.. వీళ్లెవరైనా కావచ్చు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ‘మన కోసం’ అలుపెరుగని వీరుల్లా పనిచేస్తూనే ఉన్నారు.
పండుగ రోజు.. కరెంట్ పోకుండా..
సంక్రాంతి పండుగ అంటే పతంగులు. ఎగరేసేప్పుడు గాలివేగానికి దారం తెగి పతంగులు అనేక చోట్ల విద్యుత్ లైన్ల మధ్య చిక్కుకుంటాయి. ఇదే సమయంలో పలు ఫీడర్లలో సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. వాటిని వెంటనే సరిచేసి సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రీన్‌లాండ్స్ డివిజన్ సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ)విభాగం ఏడీఈ చరణ్‌సింగ్ నేతృత్వంలోని బృందం ఫ్యూజ్ ఆఫ్ కాల్ సహా ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూం నుంచి వచ్చే ఫిర్యాదులను అటెండ్ చేస్తూ.. ఎప్పటికప్పుడు లైన్ల మధ్య చిక్కుకున్న గాలిపటాలను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది.
ఇంట్లో ఉండాలంటారు.. నాకు వీలవదు..
నాకు పండుగ పూట ఇంట్లో ఉండాలని ఉంటుంది. కానీ విధి నిర్వహణ తప్పదు. నాన్న వస్తాడంటూ ఎదురు చూడటం పిల్లలకు అలవాటైపోయింది. ఇంట్లో ఉండండి అని చాలా సార్లు అడిగారు. నాకు వీలవ్వదుగా.. ఈ మధ్య వాళ్లు అమ్మమ్మ వారింటికి వెళ్లిపోతున్నారు. నేను ఇలా డ్యూటీకి వచ్చేస్తున్నాను.
– ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి
ఈ సంతృప్తి ముందు ఏదీ సాటి రాదు..
సొంతూరు వెళ్లి కుటుంబం, బంధువులతో సంక్రాంతి పండుగను జరుపుకోలేకపోతున్నామనే బాధ కొంత ఉంటుంది. అయితే విధి నిర్వహణలో రోగులకు సేవలు అందించడంలో ఉన్న సంతృప్తి ముందు ఏదీ సాటిరాదు. రోగులకు సేవలు అందించడం గర్వంగా ఉంది.
– డాక్టర్ పీవీ శ్రీనివాసరావు, గోల్కొండ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్
మేం పనులు చేయకపోతే.. రోడ్లు అధ్వానమే..
మాది వరంగల్ దగ్గరి మైలారం. పండుగలప్పుడు మేం పనులు చెయ్యకపోతే రోడ్లు అధ్వానంగా అవుతయి. అప్పుడెలా? అందుకే మాకు పండుగలప్పుడు సెలవులుండవు. ఊరికి వెళ్లడం కుదరదు.
–జి.బాబమ్మ, జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికురాలు
ఇలాంటి సంతృప్తి పోలీసు శాఖలోనే..
పోలీసు ఉద్యోగంలోకి వచ్చి 30 ఏళ్లవుతోంది. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా ఎన్నో పండుగల సమయంలో విధుల్లో ఉన్నాను. విధినిర్వహణలో ఎంతో మంది మమ్మల్ని కలిసి శుభాకాంక్షలు తెలుపు తారు. ఇలాంటి సంతృప్తి పోలీసుశాఖలోనే దొరుకుతుంది.తర్వాతి రోజు ఇంట్లో పండుగ జరుపుకొంటాం.
– బి.యాదగిరి, హెడ్ కానిస్టేబుల్, బచ్చన్నపేట, జనగామ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment