చేతల్లోనూ, గొంతుల్లోనూ, ఊరువాడల్లోనూ విరాజిల్లుతూ వర్ధిల్లే బతుకమ్మ ఏనాడు పుట్టిందో, ఏనాడు పెరిగిందో నేటికీ తెలంగాణను ఒక్కతాటి మీదుగా నిలుపుతోంది. జాతి వైభవాన్ని చాటుతోంది.
శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరి భాగంలో (ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు) జరిగే వేడుక బతుకమ్మ. రుతుపవనాల వర్షాలు మంచినీటి చెరువులలోకి పుష్కలంగా నీటిని తెస్తాయి. తెలంగాణ ్ర΄ాంతంలోని సాగు చేయని, బంజరు మైదానాలలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించే సమయం కూడా ఇదే. వీటిలో అత్యధికంగా లభించేవి ‘గునుగు, తంగేడు పూలు.’ ఇక సీతజడ, బంతి, చెమంతి, గోరింట, గుమ్మడి, కట్లపూలు... పూల పేర్లు చెప్పుకుంటూపోవడం కన్నా అవన్నీ ఒక్క చోట చేర్చిన వారి శ్రమ, ఆ పూల అందం ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రకృతి తన సౌందర్యాన్ని ఈ అనేక రకాల పువ్వుల రంగులతో తెలియజేస్తుంది. ఈ పూలన్నీ కలిస్తే ఉండే అందం స్త్రీలంతా ఒక్కచోట చేరి ఆట ΄ాటలతో శక్తి స్వరూపిణిని కొలవడంలో, వారి పాటల్లో తెలుస్తుంటుంది.
స్వేచ్ఛకు ప్రతీక
దసరాకు ముందు వచ్చే ’సద్దుల బతుకమ్మ’ కి ఆడబిడ్డలు అత్తవారింటి నుండి తల్లిగారింటికి తిరిగి వచ్చి, పువ్వుల రంగులను జరుపుకోవడానికి స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజున ఇంటి పెద్దతో పాటు బతుకమ్మ ను అందంగా పేర్చడానికి ఆ ఇంట్లో అందరూ ఒక చోట కూర్చుంటారు. పువ్వులు వృత్తాకార వరుసలలో, రంగులలో ఇత్తడి ప్లేట్‌లో జాగ్రత్తగా వరుస తర్వాత వరుసలో అమర్చుతారు. సాయంత్రం సంప్రదాయ వేష ధారణలో తమ ్ర΄ాంగణంలో అంతా చేరి, బతుకమ్మను ఉంచి, చుట్టుపక్కల మహిళలు పెద్ద వలయంలో గుమికూడుతారు. బతుకమ్మల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నట్టు తిరుగుతూ,పాటలు పాడటం మొదలు పెడతారు. ఐకమత్యం, ప్రేమ, సోదరీమణుల ఆనందానికి బతుకమ్మ ప్రతీక.
సామూహిక సందడి
బతుకమ్మ పాటలు పాడి, ఆడలు ఆడి, చివరకు వాటిని తలపై ఎత్తుకొని ఊరేగింపుగా పెద్ద నీటి ప్రదేశానికి చేరుకుంటారు. బతుకమ్మలను నెమ్మదిగా ఆ నీటిలో వదులుతారు. చేసిన ప్రసాదాలను పంచుకుని, బతుకమ్మను కీర్తిస్తూపాటలుపాడుతూ తిరిగి వస్తారు. కష్టం, సుఖం చెప్పుకోవడం, తీపిదనాన్ని పంచుకోవడం కూడా ఈ వేడుక మనసును తృప్తి పరుస్తుంది.
నీటి స్వచ్ఛత
బతుకమ్మ... భూమి, నీళ్లతో మానవుల మధ్య అంతర్గత సంబంధాన్ని చూపుతుంది. కొన్ని చోట్ల బతుకమ్మతో పాటు ’బొడ్డెమ్మ’ (గౌరీ దేవిని మట్టితో తయారు చేస్తారు)ను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియ చెరువులను బలోపేతం చేయడానికి, మరింత నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు నీటిని శుద్ధి చేసే గొప్ప నాణ్యతను కలిగి ఉంటాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న స్త్రీలు ప్రకృతి సౌందర్యాన్ని పండగలా జరుపుకోవడం ద్వారా చెరువులను ఎలా మెరుగుపరచాలో అంతర్లీనంగా వారికి తెలుసు. ఈ పండుగ ప్రకృతి, ప్రజల సామూహిక, మహిళా జనాదరణ పొందిన స్ఫూర్తి. అలాగే ప్రకృతి వనరులను వేడుకగా సంరక్షించడంలో వ్యవసాయదారుల శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది. అందుకే బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం.
మన దేశంలో
బతుకమ్మ వేడుకను దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులలో స్థిరపడిన తెలంగాణ వాళ్లు ఇప్పటికీ జరుపుకుంటున్నారు ∙బతుకమ్మ పండగ వచ్చిందంటే బెంగళూరు, పుణె వీధుల్లోనూ ఊయ్యాల ఆటపాటల కళ కనపడుతుంది. పూణెలో కూడా బతుకమ్మ పండగ సందడి జోరుగానే ఉంది ∙ముంబైలో డీజీపాటల స్టెప్స్ వేస్తూ బతుకమ్మ ఆటలతో సందడి చేస్తుంటారు. భిన్న సంస్కృతుల ముంబై తెలంగాణ సంస్కృతినీ స్వీకరించింది.
విదేశాలలోనూ... నేపాల్, అమెరికా, సింగపూర్, కెనడాలో, న్యూజిలాండ్.. మొదలైన దేశాలలో ఉన్న తెలంగాణీయులు బతుకమ్మ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తమ కమ్యూనిటీలో అందరినీ ఒక చోట చేర్చి, సంబరం జరుపుకుంటున్నారు. భావి తరాలకు బతుకమ్మను మరింత వైభవంగా అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment