‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో
నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో
చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలో
కాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలో
బతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైంది బొడ్డెమ్మ పండగ. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి దీన్ని ప్రారంభించుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంభించి తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి,ఘ ఆటపాటలతో గౌరీ దేవిని పూజించి, తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ బిడ్డె బొడ్డెమ్మ అని భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఆడబిడ్డలకు ప్రత్యేకం. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి కూడా అంటారు. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారు.
బొడ్డెమ్మ పండుగను తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా ప్రాంతాల వారిగా తయారు చేస్తారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ , పందిరి బొడ్డెమ్మ, బాయి(వి) బొడ్డెమ్మ. పీటమీద పూజించే బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ అనీ, గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను 'గుంట బొడ్డెమ్మ' అనీ, పందిరిలా అలంకరించే బొడ్డెమ్మను 'పందిరి బొడ్డెమ్మ', బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను 'బాయి బొడ్డెమ్మ' అని పిలుచుకుంటారు. ఆకారం ఏదైనా, పూజా విధానం మాత్రం ఒకేలా ఉంటుంది.
బొడ్డెమ్మ ఆటలు
భాద్రపద బహుళ పంచమి నుంచి చతుర్ధశి వరకు బొడ్డెమ్మ ఆడతారు. చెరువు మట్టి లేదా పుట్ట మట్టిని తెచ్చి చెక్కపీటపై ఐదు దొంతరులుగా వలయాకారంలో బొడ్డెమ్మను తయారు చేస్తారు. దీన్ని ఎర్రమట్టితో అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో అలంకరించి, ముగ్గులు వేస్తారు. ఐదు అంతస్తులపైన కలశం పెట్టి అందులో బియ్యం పోస్తారు. పైన కొత్త గుడ్డతో చుట్టి తమలపాకులో పసుపు గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. ఈ గౌరమ్మకు ఉదయం ఇంట్లో భక్తితో పూజింజి సాయంత్రం ఇంటి వాకిట్లో అలుకు చల్లి చుక్కల ముగ్గులు వేసి పీట బొడెమ్మను తెచ్చి ప్రతిష్టించి సాయంత్రం పూసే ఉద్రాక్ష, బీర, మల్లె, జాజిపూలతో అలంకరించి ఫలహారాలు పెట్టి చుట్టూ తిరుగుతూ బొడ్డెమ్మ పాటలు పాడుతారు.
చివరగా బొడ్డెమ్మను నిద్రపుచ్చే పాటలు పాడుతారు. పాడడం అయిపోయాక తెచ్చుకున్న ఫలహారాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుని బొడ్డెమ్మను ఎవరింట్లో ఆడుతున్నారో వారింట్లోనే దేవుని దగ్గర పెట్టి వెళ్లిపోతారు. ఇలా తొమ్మిదిరోజులు ఆడిన తర్వాత చివరిరోజు సాగనంపే పాటలు పాడి బావిలో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను బావిలో వేసిన తెల్లారి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తెలంగాణా పల్లెల్లో కొన్ని చోట్ల బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలు కాగా, అక్టోబరు 2వ తేదీనుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు షురూ అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment