
ఆ సన్నివేశాలు తొలగించండి
చెన్నై: తమిళ సినీ హాస్య నటుడు వడివేలుకు చెన్నై హైకోర్టులో చుక్కెదురైంది. ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు తొలగించాలని ఆదేశించింది. ఈ చిత్రంలో కృష్ణదేవరాయలు పేరు, తెలుగు భాషను కించపర్చేలా ఉన్న సన్నివేశాలు తొలగించి విడుదల చేసుకోవాలని హైకోర్టు సూచించింది.
వడివేలు హీరోగా నిర్మించిన తెనాలిరామన్ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలను కించపరిచేవిధంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని తెలుగు సంఘాలు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అభ్యంతకర సన్నివేశాలను తొలగించేందుకు నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశంపై తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.