చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీకృష్ణదేవరాయలను కించపరుస్తూ తమిళ సినీ హాస్య నటుడు వడివేలు హీరోగా నిర్మించిన తెనాలిరామన్ చిత్రంపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిత్రాన్ని నిషేధించాల్సిందేని ముక్తకంఠంతో ఘోషించాయి. ఒకే తల్లిబిడ్డల్లా మెలగుతున్న తెలుగు, తమిళుల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు తమిళ సినీ పెద్దలు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వల్లువర్‌కోట్లం వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించాయి. పలు తమిళ సంఘాలకు చెందిన వారు సైతం ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించడం విశేషం. ఇండియన్ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ, తెనాలి రామన్ చిత్రంపై తమ ఆందోళన కేవలం తెలుగుభాషా పరమైనది కాదని, ద్రవిడ సంస్కృతిని కాపాడుకునే యత్నమని అన్నారు.
శ్రీకృష్ణదేవరాయల పాత్రే లేదని చిత్ర నిర్మాత, దర్శకులు ప్రకటించగా, సెన్సార్ అధికారి ఉందని చెప్పడం గమనార్హమని అన్నారు. సినిమా విడుదల సమయంలో తెలుగువారి ముసుగులో కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ అనుమానాన్ని ఎన్నికల కమిషన్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మాభిమానం కాపాడుకునేందుకు పదిరోజులుగా అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కృష్ణదేవరాయల పాత్ర చిత్రీకరణ తమ సంస్కృతికి విరుద్దంగా ఉందని అన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని జాతీయ సమస్యగా మార్చేందుకు కొందరు రెచ్చగొట్టే చర్చలు చేపడుతున్నారని ఆరోపించారు. తెలుగువారంటే ప్రత్యేక అభిమానమని చెప్పే సీఎం జయలలిత ఈ విషయంలో నిరూపించుకోవాలని ఆయన అన్నారు.
ఇన్నాళ్లూ మేము ఆమెకు అండగా ఉన్నాం, ఈరోజు ఆమె మాకు అండగా నిలవాలని జయకు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.ప్రపంచ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి, పెరియార్ యూనివర్సిటీ సభ్యులు తంగటూరి రామకృష్ణ మాట్లాడుతూ, మొత్తం భారత దేశమే కీర్తించే శ్రీకృష్ణ దేవరాయల, తెనాలిరామకృష్ణల పాత్రలను సైతం అభ్యంతరకరంగా చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో ఈ చిత్రం విడుదలను నిలిపివేశారని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఁఆహో అంధ్రభోజా శ్రీ కృష్ణదేవరాయ...రూ. అంటూ ప్రసిద్ద తెలుగుసినిమా గీతాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త ఆలపించారు. ద్రవిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ, తెలుగు, తమిళులు రాష్ట్రంలో పాలునీళ్లలా కలిసిపోయివుండగా, ఈ చిత్రం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టేదిగా ఉందని అన్నారు.
కొందరు బెదిరిస్తే తెలుగువారు భయపడిపోరని తమిళనాడు తెలుగమక్కల్ పేరవై అధ్యక్షుడు బాలగురుస్వామి వ్యాఖ్యానించారు. తమిళుడు అంటూ వడివేలును వెనకేసుకువచ్చే ఈ నేతలు మూడేళ్లుగా సినిమాలు లేని అతనికి ఏరకమైన అండగా నిలిచారని నిలదీశారు. ఐటీఎఫ్ కార్యదర్శి నందగోపాల్ తమిళంలో ప్రసంగించి నినాదాలు చేశారు. జార్ఖండ్ ముక్తిమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్ ప్రసంగించారు. ధర్నాలో టామ్స్ అధ్యక్షుడు గొల్లపల్లి ఇజ్రాయల్, శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దర్శిగుంట శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
‘తెనాలిరామన్’పై ఆగ్రహం
Published Wed, Apr 16 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
Advertisement
Advertisement