
నియంతలకు భయమెప్పుడూ
యుద్ధమంటేనో, బాంబులంటేనో కాదు..
ప్రశ్నలంటే, ప్రశ్నించే శక్తులంటేనే!
నాగులు కోరల్లో విషముంచుకుని బుసకొట్టేది
బలముందని కాదు..
కాలి చెప్పుల అదుళ్లకు అదిరిన భయంతోనే...
అబద్ధాలతో రొమ్మిరిచి నిలబడొచ్చనుకునే వాళ్ళు
సత్యం ముందు కురుచనవుతున్నామని తెలిస్తే...
కుట్రల చిట్టా పేరుస్తారు నిన్ను చిన్నగా చూపడానికి!
సముద్రం తన గర్భాన రేగు అగ్నిపర్వతాల అలజడులను..
అగుపడకుండా దాచగలదేమో కానీ బద్దలవకుండా ఆపలేదు!
ఎగిసి పడే లావాను అడ్డుకోనూ లేదు!!
అరుంధతీ...
నీ గొంతెప్పుడూ ఏకాకి కాదు,
వేల గొంతులు నినదిస్తాయి ఆజాదీ కోసం..
నీ భుజమెప్పుడూ ఒంటరీ కాదు,
మా భుజాలను నీ భుజంతో అంటుకడతాం ఆజాదీ కోసం..
నీ అడుగులెప్పుడూ ఖాళీగా ఉండవు
లక్షలాదిగా నీ అడుగుల్లో అడుగులేస్తూ ప్రవహిస్తాం!
మానవత్వపు పరిమళాలను పంచే ఆజాదీ కోసం..
అరుంధతీ...
నీ పేరిపుడు ‘ఆజాదీ’కి..
ఓ పర్యాయపదం!
– దిలీప్. వి, 8464030808 (హక్కుల గొంతుక అరుంధతీ రాయ్‌కి మద్దతుగా...)