కురుక్షేత్ర సంగ్రామం మొదలైన నాటి నుండి జరిగిన సంగతులను తాను చూసి వచ్చి తన ప్రభువైన ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతుంటాడు సంజయుడు. భీష్మ, ద్రోణాచార్యుల సర్వసేనాధిపత్యంలో పదిహేను రోజుల యుద్ధం తరువాత, రెండు రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ రెండు రోజుల యుద్ధం చివరన అర్జునుడి చేతిలో కర్ణుడు, భీముడి చేతిలో దుశ్శాసనుడు నిహతులయ్యారు.
ఆ సంగతులను వివరించిన సంజయుడు, కౌరవుల విజయానికి సంబంధించిన ఆశలు అడుగంటిపోయేలా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగి భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడు హతాశుడై, సంజయుడు అలా చెబుతున్నాడంటే దుర్యోధనుడు కూడా మరణించి ఉంటాడని ఊహించుకుని హాహాకారాలు చేస్తూ మూర్ఛపోతాడు.
విదురుడి సహాయంతో, సంజయుడు సపర్యలు చేసిన అనంతరం మూర్ఛలోంచి తేరుకున్న ధృతరాష్ట్రుడు ‘నీవు మొదట చెప్పిన మాటలు నేను సరిగా వినలేదు. దుర్యోధనుడికి ఏ ప్రమాదము సంభవించ లేదు కదా!’ అంటాడు. ప్రపంచమంతా ఏమైపోయినా çఫరవాలేదు, దుర్యోధనుడు ఒక్కడు బ్రతికి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది ధృతరాష్ట్రుడి వైఖరి. ఈ వైఖరిని గట్టిగానే నిరసిస్తాడు సంజయుడు.
కొడుకులంత రాజ్యంబును గొనగ శక్తు
లను దురాశను వారల యవినయములు
నీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధ
కర్మమున ఫలమొందక కౌరవేంద్ర!
‘రాజ్యం మొత్తాన్నీ తామే కాజేయాలన్న దురాశతో నిండిన కాంక్షతో నీ కొడుకులు చేసే కానిపనులన్నిటినీ నీవు ఉపేక్షించి, చూస్తూ ఊరుకున్నావు. ఏనాటికైనా దాని ఫలితం అనుభవించాల్సిన సమయం రాకుండా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చింది చూడు!’ అని ధృతరాష్ట్రుడి మొహం మీదనే సంజయుడు అనడం ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వంలోని పై తేటగీతి పద్యంలో కనబడుతుంది.
ఈ మాటలు అనిపించుకుని కూడా ‘అది సరేలే, ఇంతకీ దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా?!’ అంటాడు ధృతరాష్ట్రుడు. కళ్ళెదురుగా వినాశనానికి సంబంధించిన ఛాయలు కనపడుతున్నా చూడడానికి ఇచ్చగించని స్వార్థపూరిత ఉపేక్ష ధృతరాష్ట్రుడిది! ధృతరాష్ట్రుడి అంగవైకల్యం దృష్టి లేకపోవడం కాదు. దానిని అడ్డం పెట్టుకుని అతడు ప్రదర్శిస్తూ వచ్చిన ఉపేక్షయే! చెడు జరగకుండా ఆపగలిగే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఉపేక్షించడం ఊహించనంత వినాశనానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది. – భట్టు వెంకటరావు
ఇవి చదవండి: ఉద్యమ వాస్తవ చరిత్ర..
Comments
Please login to add a commentAdd a comment