kurukshetra war
-
హానికరమైన ఉపేక్ష!
కురుక్షేత్ర సంగ్రామం మొదలైన నాటి నుండి జరిగిన సంగతులను తాను చూసి వచ్చి తన ప్రభువైన ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతుంటాడు సంజయుడు. భీష్మ, ద్రోణాచార్యుల సర్వసేనాధిపత్యంలో పదిహేను రోజుల యుద్ధం తరువాత, రెండు రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ రెండు రోజుల యుద్ధం చివరన అర్జునుడి చేతిలో కర్ణుడు, భీముడి చేతిలో దుశ్శాసనుడు నిహతులయ్యారు.ఆ సంగతులను వివరించిన సంజయుడు, కౌరవుల విజయానికి సంబంధించిన ఆశలు అడుగంటిపోయేలా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగి భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడు హతాశుడై, సంజయుడు అలా చెబుతున్నాడంటే దుర్యోధనుడు కూడా మరణించి ఉంటాడని ఊహించుకుని హాహాకారాలు చేస్తూ మూర్ఛపోతాడు.విదురుడి సహాయంతో, సంజయుడు సపర్యలు చేసిన అనంతరం మూర్ఛలోంచి తేరుకున్న ధృతరాష్ట్రుడు ‘నీవు మొదట చెప్పిన మాటలు నేను సరిగా వినలేదు. దుర్యోధనుడికి ఏ ప్రమాదము సంభవించ లేదు కదా!’ అంటాడు. ప్రపంచమంతా ఏమైపోయినా çఫరవాలేదు, దుర్యోధనుడు ఒక్కడు బ్రతికి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది ధృతరాష్ట్రుడి వైఖరి. ఈ వైఖరిని గట్టిగానే నిరసిస్తాడు సంజయుడు.కొడుకులంత రాజ్యంబును గొనగ శక్తులను దురాశను వారల యవినయములునీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధకర్మమున ఫలమొందక కౌరవేంద్ర!‘రాజ్యం మొత్తాన్నీ తామే కాజేయాలన్న దురాశతో నిండిన కాంక్షతో నీ కొడుకులు చేసే కానిపనులన్నిటినీ నీవు ఉపేక్షించి, చూస్తూ ఊరుకున్నావు. ఏనాటికైనా దాని ఫలితం అనుభవించాల్సిన సమయం రాకుండా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చింది చూడు!’ అని ధృతరాష్ట్రుడి మొహం మీదనే సంజయుడు అనడం ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వంలోని పై తేటగీతి పద్యంలో కనబడుతుంది.ఈ మాటలు అనిపించుకుని కూడా ‘అది సరేలే, ఇంతకీ దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా?!’ అంటాడు ధృతరాష్ట్రుడు. కళ్ళెదురుగా వినాశనానికి సంబంధించిన ఛాయలు కనపడుతున్నా చూడడానికి ఇచ్చగించని స్వార్థపూరిత ఉపేక్ష ధృతరాష్ట్రుడిది! ధృతరాష్ట్రుడి అంగవైకల్యం దృష్టి లేకపోవడం కాదు. దానిని అడ్డం పెట్టుకుని అతడు ప్రదర్శిస్తూ వచ్చిన ఉపేక్షయే! చెడు జరగకుండా ఆపగలిగే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఉపేక్షించడం ఊహించనంత వినాశనానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది. – భట్టు వెంకటరావుఇవి చదవండి: ఉద్యమ వాస్తవ చరిత్ర.. -
శిక్ష అనుభవించాల్సిందే!
కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. ‘కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు... వీరిని కూడా విడిచిపెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా. వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే. ... అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది..’’ అంటూ ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. ‘‘వారు చేసిన పాపం ఏమిటి’’ రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు.‘‘నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ. వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు’ ‘‘ఏం తప్పు చేశారు?’’ ‘‘పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే, పెదవి విప్పకుండా, తలలు దించుకుని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకుమించిన నేరమేముంది...’’ ‘‘మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడుగా. గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా. ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో. నువ్వు మరీ ఇంత నిర్దయుడివా’’ ‘నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే, యుద్ధరంగంలో యోధానుయోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు... మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి, పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు. ఆ తరవాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా, జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతిమంతమైనదేనా? న్యాయమైనదేనా? అని ఆలోచించాలి’’ సెలవిచ్చాడు శ్రీకృష్ణపరమాత్ముడు. – డా. వైజయంతి -
త్వరలో కురుక్షేత్రమే
సాక్షి, బెంగళూరు: త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఈ సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండవులైతే, బీజేపీ నాయకులు కౌరవులని వర్ణించారు. మంగళవారం నగరంలో కేపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తమ పార్టీ సరైన మార్గంలో వెళ్తోందని, కౌరవులైన బీజేపీ నేతలు తప్పుడు మార్గంలో పోతున్నారని విమర్శించారు. ఎన్నికల కోసం కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర నేతృత్వంలో సరైన బృందాన్ని తమ అధిష్టానం ఇచ్చిందని తెలిపారు. కుమార, యడ్డిలు ఏం చేయలేరు కుమారస్వామి, యడ్యూరప్ప తదితర నేతలు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని సీఎం అన్నారు. ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంత్ కుమార్ హెగ్డేని ప్రధాని మోదీ కేబినెట్లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో మోదీ, అమిత్ షాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. బీజేపీ శోభా కరంద్లాజే వంటి నేతలను తమపైకి ఉసిగొల్పుతోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నేతల డంపింగ్.. దేశంలో ప్రస్తుతం ఒక్క కర్ణాటకలో తప్పించి ఎక్కడా ఎన్నికలు లేవని, ఈ క్రమంలో దేశంలోని ఆర్ఎస్ఎస్ నేతలందరిని ఇక్కడి ఎన్నికల కోసం బీజేపీ నేతలు డంప్ చేస్తున్నారని సిద్ధు ఆరోపించారు. బీజేపీ హిందుత్వ అని పేరు పెట్టుకుని కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని, 70 ఏళ్లుగా దేశంలో హిందుత్వాన్ని పరిరక్షించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. హిందుత్వం పేరిట బీజేపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని తెలిపారు. గెలుపులో బూత్ కమిటీలే కీలకం డిసెంబర్ 13 నుంచి జనవరి 12 వరకు నిరంతరంగా కొనసాగిన తన పర్యటనలో అన్ని వర్గాలతో సమావేశమైనట్లు సీఎం తెలిపారు. అన్ని జిల్లాల్లో 90 శాతం బూత్ కమిటీలో నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్క బూత్ కమిటీ నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీ నాయకులకు త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కురుక్షేత్ర యుద్ధం
జ్యోతిర్మయం కురుక్షేత్ర యుద్ధం కౌరవ పాండవుల మధ్య జరిగింది అంటాం. కురుక్షేత్ర యుద్ధం సర్వనాశనం అనే మాటకు సరైన, యథార్థమైన ఉదాహరణ. అందులో పాండవుల తరఫున ఏడు అక్షౌహిణీల సైన్యం, కౌరవుల తరఫున పదకొండు అక్షౌహిణీల సైన్యం, మొత్తం ఇరవై ఐదు లక్షల మంది సైనికులు యుద్ధం చేశారు. చివరకు మిగిలింది కేవలం పన్నెండు మంది ప్రముఖ వీరులు. పాండవుల పక్షాన పంచ పాండ వులూ, కృష్ణుడూ, సాత్యకీ, యుయుత్సువూ. కౌరవుల వైపు అశ్వత్థామా, కృపాచార్యుడూ, కృతవర్మా, వృష కేతుడూ మాత్రమే మిగిలారు. మరి లోకంలో ఉన్న వీరాధివీరులందరూ కలిసి ఇంతటి మహా యుద్ధం చేసి సాధించిందేమిటి? ధర్మం పూర్తిగా వదిలేసి అయినా, దాయాదులకు ఎంతటి ద్రోహం చేసి అయినా, చిరకాలం కురు రాజ్యాధిపతిగా ఉండి పోవాలన్న కాంక్షతో, అవధులు లేని అసూయతో, మొండితనంతో, మూర్ఖత్వంతో యుద్ధంలోకి దిగిన దుర్యోధనుడు బంధుమిత్ర పరివార సమేతంగా తన అసూయాగ్నిలో తనే భస్మమై పోయాడు. ఎంతో శ్రమపడి స్వపక్షం సర్వనాశనాన్ని సాధించాడు. గెలిచిన పక్షం సాధించింది కూడా, అది పోగొట్టు కొన్న దానితో పోలిస్తే స్వల్పమే. బంధువులనూ, మిత్రులనూ, పుత్రులనూ కోల్పోయి ధర్మరాజు ముప్పై ఆరు సంవత్సరాల స్వల్ప కాలం రాజ్యం అయితే చేశాడు కానీ, ఆ ‘నెత్తుటి కూడు’ ఆయనకు చెప్పుకోదగ్గ ఆనందాన్ని మిగిల్చినట్టు కనబడదు. ద్రౌపది తనకు జరిగిన పరాభ వాలకు ప్రతీకారం తీర్చుకొన్నట్టు అయింది కానీ ఆమె చెల్లించిన మూల్యం? దుస్సహమైన గర్భ శోకం! ఐదుగురు దివ్య పురుషులు ఆమె భర్తలు, కానీ కురు సింహాసనం మీద కూర్చోబెట్టేందుకు వారసుడు మాత్రం ఒక్కడూ మిగలలేదు. చివరికి, యుద్ధంలో కష్టపడి గెలుచుకొన్న రాజ్యానికి, ఆ యుద్ధానికి దారి తీసిన కారణాలతో ఎటువంటి సంబంధమూ లేని ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు ఉత్తరాధికారి అయ్యాడు, అదీ కేవలం దైవానుగ్రహం వల్ల. యుద్ధాలకూ, పగలకూ, ప్రతీకారాలకు, కక్ష లకూ, కావేషాలకూ తరచుగా ఫలితం ఇంత మాత్రంగానే ఉంటుంది. రాగద్వేషాలూ, కామ క్రోధాలూ సుఖసాధనాలు కావు. రాజ భోగాలూ, ఐహిక సుఖాలూ నీటి బుడగల పాటివే. దృశ్య ప్రపంచమంతా క్షణ భంగురం. స్వధర్మ పాలన ఇహ పర శ్రేయస్సును ఇస్తుంది. ఫల వైరాగ్య బుద్ధితో ధర్మాచరణ చేయటం చిత్త శాంతిని కలిగిస్తుంది. వాచ్యంగా చెప్పినా, వ్యంగ్యంగా చెప్పినా, ధ్వన్యాత్మకంగా చెప్పినా మహా భారతం ముఖ్యంగా బోధించేది ఈ విషయమే. అందుకే మహాభారతాన్ని శ్రద్ధగా చదివే పాఠకుడికి కలిగేది వీర రసానుభవమో, బీభత్స రసానుభవమో మరొకటో కాదు, భారతంలో ఆద్యంతం ధ్వనించే ప్రధాన రసం శాంత రసం అంటారు ఆనంద వర్థనుడి వంటి ఆలంకారికులు. (వ్యాసకర్త: ఎం మారుతి శాస్త్రి)