సాక్షి, బెంగళూరు: త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఈ సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండవులైతే, బీజేపీ నాయకులు కౌరవులని వర్ణించారు. మంగళవారం నగరంలో కేపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తమ పార్టీ సరైన మార్గంలో వెళ్తోందని, కౌరవులైన బీజేపీ నేతలు తప్పుడు మార్గంలో పోతున్నారని విమర్శించారు. ఎన్నికల కోసం కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర నేతృత్వంలో సరైన బృందాన్ని తమ అధిష్టానం ఇచ్చిందని తెలిపారు.
కుమార, యడ్డిలు ఏం చేయలేరు
కుమారస్వామి, యడ్యూరప్ప తదితర నేతలు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని సీఎం అన్నారు. ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంత్ కుమార్ హెగ్డేని ప్రధాని మోదీ కేబినెట్‌లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో మోదీ, అమిత్ షాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. బీజేపీ శోభా కరంద్లాజే వంటి నేతలను తమపైకి ఉసిగొల్పుతోందని విమర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్ నేతల డంపింగ్..
దేశంలో ప్రస్తుతం ఒక్క కర్ణాటకలో తప్పించి ఎక్కడా ఎన్నికలు లేవని, ఈ క్రమంలో దేశంలోని ఆర్‌ఎస్‌ఎస్ నేతలందరిని ఇక్కడి ఎన్నికల కోసం బీజేపీ నేతలు డంప్ చేస్తున్నారని సిద్ధు ఆరోపించారు. బీజేపీ హిందుత్వ అని పేరు పెట్టుకుని కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని, 70 ఏళ్లుగా దేశంలో హిందుత్వాన్ని పరిరక్షించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. హిందుత్వం పేరిట బీజేపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని తెలిపారు.
గెలుపులో బూత్ కమిటీలే కీలకం
డిసెంబర్ 13 నుంచి జనవరి 12 వరకు నిరంతరంగా కొనసాగిన తన పర్యటనలో అన్ని వర్గాలతో సమావేశమైనట్లు సీఎం తెలిపారు. అన్ని జిల్లాల్లో 90 శాతం బూత్ కమిటీలో నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్క బూత్ కమిటీ నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీ నాయకులకు త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment