
మైసూర్: టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో... ఇంగ్లండ్ లయన్స్‌తో బుధవారం మొదలైన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 84.5 ఓవర్లలో మూడు వికెట్లకు 282 పరుగులు చేసింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ (222 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) సెంచరీ సాధించగా... లోకేశ్ రాహుల్ (166 బంతుల్లో 81; 11 ఫోర్లు) ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 179 పరుగులు జోడించడం విశేషం. రాహుల్ ఔటయ్యాక ప్రియాంక్ పాంచల్ (88 బంతుల్లో 50; 7 ఫోర్లు)తో కలిసి ఈశ్వరన్ రెండో వికెట్‌కు 73 పరుగులు జత చేశాడు. ఇన్నింగ్స్ 85వ ఓవర్‌లో ప్రియాంక్ ఔటయ్యాక తొలి రోజు ఆటను ముగించారు. కరుణ్ నాయర్ (33 బంతుల్లో 14 బ్యాటింగ్; ఫోర్, సిక్స్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో టామ్ బెయిలీ, జాన్ చాపెల్, డొమినిక్ బెస్ ఒక్కో వికెట్ తీశారు.