మరో 'రాహూల్'గా మారే ప్రయత్నంలో... | special story to crickter kl rahul | Sakshi
Sakshi News home page

మరో 'రాహూల్'గా మారే ప్రయత్నంలో...

Published Tue, Mar 14 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

మరో 'రాహూల్'గా మారే ప్రయత్నంలో...

మరో 'రాహూల్'గా మారే ప్రయత్నంలో...

∙ రాటుదేలుతున్న లోకేశ్‌ రాహుల్‌
∙ రెండో టెస్టు విజయంలో ప్రధాన పాత్ర
∙ కీలక ఆటగాడిగా ఎదుగుతున్న వైనం  


ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు లోకేశ్‌ రాహుల్‌ ట్విట్టర్‌లో ఏదో సరదా పోస్టు పెట్టాడు. దానిపై ఒక అభిమాని ‘ఇదంతా సరే, పరుగులు ఎలా చేయాలో దానిపై దృష్టి పెట్టు’ అని కామెంట్‌ చేశాడు. సాధారణంగా ఇలాంటి వాటిపై స్పందించి రచ్చ చేసుకోవడం ఆటగాళ్లకు ఇష్టం ఉండదు. కానీ అంతకుముందు మ్యాచ్‌లో పోరాడి అర్ధ సెంచరీ చేసిన రాహుల్‌కు ఈ వ్యాఖ్య ఆగ్రహం తెప్పించినట్లుంది. వెంటనే ‘నువ్వు వచ్చి మాకు నేర్పించు. పరుగులు ఎలా చేయాలో నీకు బాగా తెలుసేమో’ అని ఘాటుగా బదులిచ్చాడు.

ఆ తర్వాత జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సొంత మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో అర్ధ సెంచరీ సాధించిన మూడు ఇన్నింగ్స్‌లు కూడా చూస్తే అతను చేసిన పరుగులే కాదు, సందర్భం, ఆడిన షాట్లు కూడా వాటి విలువను పెంచుతాయి. ఈ విషయంలో పేరులోనే కాదు తన మార్గదర్శి కూడా అయిన దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను అతనుగుర్తుకు తెచ్చాడు. మున్ముందు కూడా భారత టెస్టు జట్టులో విజయాల్లో ఓపెనర్‌గా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్న రాహుల్, అందు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.  

సాక్షి క్రీడా విభాగం :దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో లోకేశ్‌ రాహుల్‌ తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌ తరహా టెక్నిక్‌తో దేశవాళీలో అద్భుత ప్రదర్శనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అతనిపై అందరి దృష్టీ ఉంది. కానీ అనూహ్యంగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ చెత్త షాట్‌లు ఆడి తన వికెట్‌ను పారేసుకున్నాడు. బంగారు అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడని అంతా విమర్శించారు. ఈ మ్యాచ్‌ తర్వాత రాహుల్‌ చిన్ననాటి కోచ్‌ శామ్యూల్‌ జైరాజ్‌కు తన మిత్రుడి నుంచి ‘నీ శిష్యుడిని వెళ్లి ఐపీఎల్‌ ఆడుకోమని చెప్పు’ అని వ్యంగ్యంగా ఒక మెసేజ్‌ వచ్చింది.

అయితే చిన్నప్పటి నుంచి రాహుల్‌ గురించి తెలిసిన కోచ్, తన శిష్యుడిపై నమ్మకముంచాడు. అడిలైడ్‌లో జరిగిన తర్వాతి టెస్టులోనే ఈ మంగళూరు అబ్బాయి సెంచరీ సాధించి తన అసలు సత్తాను ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌ తర్వాత మూడు ఫార్మాట్‌లలో కూడా నిలకడగా రాణిస్తూ వచ్చిన లోకేశ్, ఇప్పుడు ఓపెనర్‌గా భారత టెస్టు జట్టుకు గొప్ప ఆరంభాలు ఇవ్వడంలో బిజీ అయిపోయాడు. టెక్నిక్‌ పరంగా, కష్టాల్లో ఉన్నప్పుడు నైతికంగా కూడా రాహుల్‌ ద్రవిడ్‌ ఇచ్చిన మద్దతు అతని ఎదుగుదలలో కీలకంగా మారితే... విమర్శలు వచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ అండగా నిలిచి అవకాశాలిచ్చిన మరో కర్ణాటక దిగ్గజం, భారత కోచ్‌ అనిల్‌ కుంబ్లే పోషించిన పాత్ర కూడా చాలా ఉంది.

అతివృష్టి... అనావృష్టి...
రెండో టెస్టులోనే సెంచరీ సాధించినా రాహుల్‌ కెరీర్‌ అంత తొందరగా ఊపందుకోలేదు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు సాధిస్తే మరో మ్యాచ్‌లో కనీసం 20 పరుగులు కూడా చేయకుండా ఘోరంగా విఫలమవుతూ రావడమే అందుకు కారణం. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు రాహుల్‌ టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. ఇవన్నీ కలిపి 575 పరుగులు అయితే... మిగిలిన 17 ఇన్నింగ్స్‌లు కలిపి అతను చేసింది 232 పరుగులే! అంటే నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ‘నేను 20 దాటితే చాలు సెంచరీ చేస్తాను అనేవారు. అది ప్రోత్సాహమో, వ్యంగ్యమో కూడా చెప్పలేను. కానీ ఓపెనర్‌గా మరింత బాగా ఆడాల్సిందని మాత్రం అర్థమైంది.

ఓపెనర్‌ భారీ స్కోరు చేయడం జట్టుకు కీలకం’ అని రాహుల్‌ అంగీకరించాడు. కోచ్‌ కుంబ్లే శిక్షణలో తనలో లోపాలు సరిదిద్దుకొని భారీ స్కోరుపై దృష్టి పెట్టాడు. వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో విఫలమైన తర్వాత ఇంగ్లండ్‌పై చేసిన 199 పరుగుల ఇన్నింగ్స్‌ రాహుల్‌లోని అసలైన టెస్టు క్రికెటర్‌ను బయట పెట్టింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో శుభారంభాలు లభించినా మూడు సార్లు సెంచరీ చేయలేకపోవడం తన వైఫల్యమే అని చెప్పిన రాహుల్, ఆ సమస్యను అధిగమించాలని పట్టుదలగా ఉన్నాడు.

ఆల్‌ ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌...
టెస్టు ఓపెనర్‌ అంటే ఏ వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటివాడో తప్ప దూకుడుగా ఆడటం మనకు సాధారణంగా కనిపించదు. సాంప్రదాయ ఆటలో చూడచక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చే ఓపెనర్లు మిగిలిన రెండు ఫార్మాట్‌లలో కూడా రాణిస్తున్నవారు అరుదు. సమకాలీన క్రికెట్‌లో లోకేశ్‌ రాహుల్‌ను ఆ జాబితాలో చేర్చవచ్చు. టెక్నిక్‌ తెలిసినవాడు ఎక్కడైనా చెలరేగిపోగలడనే దానికి రాహుల్‌ ఉదాహరణ. టెస్టు బ్యాట్స్‌మన్‌ ముద్ర నుంచి బయటకు వస్తూ 2016 ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో రాహుల్‌ తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. అక్కడ కొనసాగించిన జోరును అంతర్జాతీయ స్థాయిలోనూ చూపించాడు. వెస్టిండీస్‌పై నాలుగో స్థానంలో ఆడుతూ కూడా 51 బంతుల్లోనే 110 పరుగులు బాదిన తీరు అతని ప్రత్యేకతను చూపించింది. ఈ సిరీస్‌లో అతను వేగంగా పరుగులు చేయడం, కొన్ని సాహసోపేత షాట్లు ఆడటం పూర్తిగా టి20 ప్రభావంతో వచ్చినవే!

ఆడిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కూడా రాహుల్‌ ఖాతాలో ఒక అరుదైన ఘనత చేరింది. ‘అన్ని రకాల పిచ్‌లు, పరిస్థితులపై ఆడగల సామర్థ్యం తనకు ఉందని రాహుల్‌ ఇప్పటికే నిరూపించాడు. మానసికంగా దృఢంగా ఉండటం కూడా అతని మరో బలం. కొన్ని రకాల షాట్లలో మరింత మెరుగు పడితే అతనికి తిరుగుండదు’ అని భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కెరీర్‌ తొలి టెస్టులో మిడిలార్డర్‌లో విఫలమయ్యాక రెండో టెస్టులో అతడిని ఓపెనర్‌గా పంపి ఫలితం రాబట్టింది అప్పటి టీమ్‌ డైరెక్టర్‌ శాస్త్రినే. అప్పుడప్పుడు గాయాలు ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మరో మాటకు తావు లేకుండా రాహుల్‌ భారత టెస్టు జట్టుకు ప్రధాన ఓపెనర్‌ అనడంలో సందేహం లేదు. అతని తాజా ప్రదర్శన ఆసీస్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లలో కూడా కొనసాగితే సిరీస్‌ విజయమే కాదు, ఆ తర్వాత కూడా రాహు ల్‌ కెరీర్‌ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం.

స్టయిల్‌ రాజా!   
‘పదే పదే లుక్‌ మారుస్తూ ఉంటావు. నీ ఫొటోలు వాడుకోవడం చాలా కష్టంగా ఉంది రాహుల్‌. మరో కొత్త ఫొటో కావాలి’ అంటూ ఇటీవలే ఒక జర్నలిస్ట్‌ రాహుల్‌ ముందు వాపోయాడు. దానికి సిద్ధమైన అతను, మరోసారి జుట్టును సెట్‌ చేసుకోవడం కష్టమంటూ క్యాప్‌ తీయడానికి మాత్రం ఒప్పుకోలేదు! మైదానంలో ఆటను పక్కన పెడితే భారత క్రికెటర్లలో ‘అనుభవించు రాజా...’ తరహా స్టయిల్‌లో రాహుల్‌ ముందుంటాడు. ఈ విషయంలో కెప్టెన్‌ కోహ్లి కూడా అతనికంటే తక్కువే. చిత్ర విచిత్రమైన హెయిర్‌ స్టయిల్, ఒళ్లంతా టాటూస్, పైన షర్ట్‌ లేకుండా పోజులు... ఇలా ఈతరం కుర్రాళ్లతో అతను పోటీ పడుతుంటాడు. ఇక్కడ మాత్రం అతనికి రాహుల్‌ ద్రవిడ్‌తో అసలు పోలికే లేదు. ఈ అత్యుత్సాహం గత ఏడాది వివాదాన్ని కూడా రేపింది.

చేతిలో బీర్‌ బాటిల్‌ పట్టుకొని దిగిన ఫొటోపై బీసీసీఐ హెచ్చరించాల్సి వచ్చింది కూడా. రాహుల్‌కు ఎలిగ్జిర్‌ నహర్‌ అనే గర్ల్‌ఫ్రెండ్‌ కూడా ఉంది. తన పెంపుడు కుక్క ‘సింబా’ .. అంటే అమిత ప్రేమ. ప్రతిష్టాత్మక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో సివిల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ డీన్‌ అయిన రాహుల్‌ తండ్రి అతడిని ఆటతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టేలా చేశారు. ఫలితంగా స్కూల్, ప్లస్‌ టూలో కూడా 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాడు. అయితే అదే సాగితే మహా అయితే మరో ఇంజినీర్‌ అయ్యేవాడినేమో కానీ భారత్‌ తరఫున ఆడలేకపోయేవాడిని కదా అంటాడు రాహుల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement